అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఉమ్మడి వరంగల్ జిల్లాకు 10 అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు
గిఫ్ట్ ఏ స్మైల్ పిలుపులో భాగంగా, వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం 14 అంబులెన్స్ వాహనాలకు పలువురు దాతలు విరాళాలు ఇవ్వగా, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో కేటీఆర్ కి అందచేశారు.
ఆ నిధులతో ప్రస్తుతం బుధవారం 10వాహనాలను సిద్ధం చేశారు. ఆ 10 అంబులెన్స్ వాహనాలను మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటల రాజేందర్, చేవెళ్ళ ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, ఎంపీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. డబ్బులు అందరూ సంపాదిస్తారని, వాటిని ఖర్చు చేసే పద్ధతిలోనే వారి ఆ సంపాదించే వారి గొప్పతనం ఉంటుందని అన్నారు. అన్నింటికంటే దాన గుణం గొప్పదన్నారు. తాను ఇచ్చిన స్మైల్ ఏ గిఫ్ట్ కి స్పందించి అనేక మంది విరాళాలు అందించి తమ ధాతృత్వాన్ని చాటుకున్నారని అన్నారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు.
అలాగే ఈ వాహనాలను అందే విధంగా చూసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలను కేటీఆర్ అభినందించారు. కాగా, ఈ వాహనాలను ప్రస్తుత కరోనా సమయంలోనే గాక, ఆ తర్వాత కూడా ఎంతో ఉపయోగంగా ఉంటాయన్నారు. అయితే, కరోనా బాధితుల్లో సీరియస్ గా ఉన్న వారికి తమ తమ ప్రాంతాల నుంచి సమీప పెద్ద దవాఖానాకు వెళ్ళే సమయంలో కీలకమైన వైద్య సహాయం ఈ వాహనాల ద్వారా అందుతుందన్నారు. ఈ అంబులెన్స్ వాహనాల్లో ఆక్సీజన్, వెంటిలేటర్లు ఉండటం వల్ల క్రిటికల్ కండీషన్ లో ఉన్న పేషంట్ల ప్రాణాలు కాపాడడానికి వీలవుతుందన్నారు.
పాలకుర్తి కి వద్దిరాజు రవిచంద్ర, తొర్రూరుకు సంతోష్ రెడ్డిలు 2 వాహనాలును, వర్ధన్నపేట కి ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, వెంకటేశ్వర గ్రానైట్స్ ఆర్. వెంకటేశ్వరరావు లు 2 వాహనాలను, ములుగు కు లక్ష్మణ్ రావు, భూపాలపల్లి కి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, పరకాలకు చల్లా ధర్మారెడ్డి, వరంగల్ పశ్చిమకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ తూర్పునకు ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్, జనగామకు గుండా ప్రకాశ్ రావులు విరాళాలు అందించారు.
కాగా, కేటీఆర్ పిలుపునకు స్పందించి, తాము అడిగిన వెంటనే ఆలోచించకుండా ప్రజలకు ఉపయోగపడే ఈ అంబులెన్స్ వాహనాల కోసం మానవీయ దృక్పథంతో విరాళాలు అందించిన దాతలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు పేరునా అభినందించి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.