ఇదే అదను అన్ని చెరువులను నింపండి: మంత్రి ఎర్రబెల్లి
పర్వతగిరి, ఆగస్టు 17ః ఇదే మంచి అదను.. వర్షాలు తగ్గుముఖం పట్టగానే అన్ని చెరువులను నింపండి. పర్వతగిరి ఆవకుంట చెరువుతోపాటు, ఊర చెరువు ఆధునీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి. ఆలస్యం కాకుండా జాగ్రత్త వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎస్సారెస్సీ, నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం మంత్రి పర్వతగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం పర్వతగిరి వాగుని, ప్రకృతి వనం స్థలాన్ని వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో మంత్రి అభివృద్ధి పనులపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, వానా కాలం కావడంతో ఇప్పటికే పర్వతగిరి మండలంలోని ఎస్పారెస్పీ పరిధిలోని 33 చెరువులు, నీటిపారుదల శాఖ పరిధిలోని 64 చెరువులు కొంత మేరకు నిండాయన్నారు. అందులో కొన్ని ఇంకా నిండలేదన్నారు. నిండని చెరువులకు అటు ఎస్పారెస్పీ, ఇటు నీటిపారుదల శాఖల అధికారులు వారి వారి పరిధిలో అన్నింటినీ నీటితో నింపాలని మంత్రి ఆదేశించారు. ఆవకుంటకు నీరు రావడానికి ఫీడర్ చానల్, సైడ్ వాల్ కట్టడం ద్వారా అదనంగా వచ్చే నీటికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఫీడర్ చానల్ పునరుద్ధరణ పై దృష్టి సారించాలన్నారు. అలాగే రూర్బన్ పథకం కింద పర్వతగిరి చెరువు ఆధునీకరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మరో రెండు నెలల్లో పనులు ప్రారంభం కావాలని ఆదేశించారు. పర్వతగిరి వాగు వద్ద పరిస్థితిని మంత్రి సందర్శించి పరిశీలించారు.
అలాగే, పర్వతగిరి ప్రకృతి వనం స్థలాన్ని మంత్రి ఎర్రబెల్లి పరిశీలించారు. వెంటనే ఈ స్థలంలో ప్రకృతి వనం పెన్సింగ్, మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం వంటి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
*పర్వతగిరి లో ప్రజలకు మాస్కులు పంపిణీ చేసిన మంత్రి*
కాగా, పర్వతగిరి, కల్లెడ తదితర ప్రాంతాల్లో తన సందర్శనల్లో ఎదురైన ప్రజలకు మంత్రి మాస్కులు పంపిణీ చేశారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం, స్వీయనియంత్రణతో ప్రజలుండాలని, కరోనా నియంత్రణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.
*రోడ్డుని వెంటనే రిపేరు చేయాలి*
కాగా కల్లెడ రోడ్డుని మంత్రి పరిశీలించారు. ఆ రోడ్డుని వెంటనే రిపేర్లు చేయించాలని అక్కడ ఉన్న అధికారులను మంత్రి ఆదేశించారు. సాధ్యమైనంత తొందరలో రోడ్డు పని పూర్తి కావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తోపాటు, ఎస్పారెస్పీ ఎస్సీ వెంకటేశ్వరరావు, నీటిపారుదల శాఖ ఇఇ, ఐబీ ఇఇ శ్రవణ్ కుమార్, డిఇ, జెఇలు, ఎమ్మార్వో తదితరులు ఉన్నారు.