ఉమ్మడి వరంగల్ జిల్లాలో హై అలర్ట్
- గోదావరి తీర ప్రాంతం అప్రమత్తం
- వరంగల్ కి జాతీయ విపత్తుల నివారణ టీమ్ లు
- సీఎం ఆదేశాలతో మంత్రి సత్యవతి రాథోడ్, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో పర్వగతగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
దీంతో హెలీక్యాప్టర్ ద్వారా వారిని రక్షించారు. మరోవైపు ఇప్పటికే అత్యధిక వర్షపాతం నమోదు కాగా, మరో మూడు రోజులపాటు ఈ తుఫాన్ కొనసాగునన్నదని వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రాష్ట్ర సీఎం కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ తోపాటు, ఉమ్మడి వరంగల్ జిల్లాలపై హైదరాబాద్ లో సమీక్షించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఫోన్ చేశారు. కుందన్ పల్లి ఘటనతో పాటు వర్షాలపై అప్రమత్తం చేశారు.
సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ఎర్రబెల్లి వెంటనే పర్వతగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహబూబాబాద్ లో ఉన్న స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, వరంగల్ లో ఉన్న ఎంపీలు బండ ప్రకాశ్, పసునూరి దయాకర్, వివిధ జిల్లాల జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, సీపీ, ఎస్పీలు తదితరులు ఈ టెలీ కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. వరంగల్ ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వర్షాలపై సీఎం కేసీఆర్ తనకు ఫోన్ చేసి, ఆరా తీశారన్నారు. మరో మూడు రోజుల పాటు ఈ వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నందున ప్రస్తుత పరిస్థితులననుసరించి, రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యాచరణపై దిశానిర్దేశం చేశారన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కూడా ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారని, తాజా పరిస్థితులను సమీక్షించారన్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లోని 2,600 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు.
మరో 6 పునరావాస కేంద్రాల ఏర్పాటుకు ఆదేశించామన్నారు. ములుగు జిల్లాలో 2 గ్రామాలు ముంపుకు గురయ్యాయని, జనగామ జిల్లాలో 3 చోట్ల ఇండ్లు కూలాయన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగు పొంగిపొర్లుతున్నందున ఈదులపూసలపల్లి రోడ్డు తెగిందన్నారు. బయ్యారం నామాలపాడు, గూడూరు దగ్గర, మెండ్రాయి గూడెం తదితర ప్రాంతాల్లో రోడ్లు తెగాయన్నారు. ఏటిగడ్డ తండాలో రిస్కులో ఉన్న 15 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నర్సంపేటలో ఎన్టీఆర్ నగర్ ప్రజలను తరలించారు.
ఇక పరకాలలో నార్లాపూర్ లో 70 మందిని సురక్షిత ప్రాంతాలకు పంపించారు. ఇల్లు కూలిపోయ ప్రమాదం ఉండగా, బారికేడ్లు పెట్టి, అందులోని ప్రజలను తరలించారు. రానున్న మరో మూడు రోజులు ఇదే వర్షాలు కొనసాగితే పరిస్థితులు మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని ముందు జాగ్రత్తగా అనే చర్యలు చేపట్టినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు.
వరంగల్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. గోదావరి తీర ప్రాంతం అప్రమత్తం చేశామన్నారు. వరంగల్ కి జాతీయ విపత్తుల నివారణ టీమ్ లను రప్పిస్తున్నామని చెప్పారు. 25 మంది సభ్యులు గల ఆ టీమ్ లకు 2 పడవలు కూడా ఉంటాయన్నారు. ఎమర్జెన్సీ అవసరాలకు సిద్ధంగా లైఫ్ జాకెట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఫైర్ ఇంజన్లను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని రకాల రవాణా మార్గాలను మూసి వేసే దిశగా ఆలోచిస్తున్నామన్నారు.
ప్రజలు ఇళ్ళు విడిచి బయటకు రావొద్దు:
మరోవైపు ప్రజలెవరూ ఇళ్ళు విడిచి బయటకు రావొద్దని, వ్యవసాయ పనులు, చేపల కోసం రైతులు, జాలర్లు వెళ్ళొద్దని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు. లోతట్టు, ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. లోతట్లు ప్రాంతాల ప్రజలను తరలించడాని వీలుగా, తగినన్ని పునరావాస కేంద్రాల ఏర్పాటు చేయాలని చెప్పారు. అలుగుబారుతున్న చెరువులు, కుంటలపై నజర్ పెట్టాలని, అవి తెగిపోకుండా ఉండడానికి నీటిని బయటకు వదలాలని సూచించామని మంత్రి తెలిపారు. కాలువలు, వాగులు, వంకలపై నిఘా పెట్టాలని, ప్రజలు అటుగా వెళ్ళకుండా చూడాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లు, ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్లు:
అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి, టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టామన్నారు. వరంగల్ కార్పోరేషన్ లో అదనంగా కంట్రోల్ రూములుంటాయన్నారు.
కాగా తుఫాన్ తీవ్రత తగ్గే వరకు జిల్లాలోనే మంత్రుల మకాం వేయాలని, ఎమ్మెల్యేలు ఎవరి నియోజకవర్గాల్లో వారే ఉండి సమీక్షలు చేయాలని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. జిల్లా కలెక్టర్లు నిరంతర పర్యవేక్షణ, సమన్వయం చేస్తూండాలని ఆదేశించారు.
ప్రాణ, ఆస్తి నష్టాల నివారణకు అన్ని తక్షణ చర్యలు:
కాగా, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా అన్ని తక్షణ, దీర్ఘకాలిక ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులను ఆదేశించారు. అంతేగాక, తాను వరంగల్, మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ కేంద్రంగా ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని మంత్రి తెలిపారు. ప్రజలు భయపడాల్సిన పనిలేదని, తగు జాగ్రత్తలతో ఉండాలని, సమస్యలుంటే వెంటనే కంట్రోల్ రూంలలోని టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్లు చేయాలని మంత్రి ఎర్రబెల్లి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.