ఈ నెల 16వ తేదీ నుండి తెలంగాణ విద్యార్థుల పోటీ నాటికల ప్రసారాలు
- రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించిన తె.స.నా.అ
- పోటీల్లో పాల్గొన్న 239 ఉన్నత పాఠశాలల విద్యార్థులు
- 26 రోజులు కొనసాగనున్న ప్రసారాలు: సీఈవో శైలేష్ రెడ్డి
తెలంగాణలోని 239 పాఠశాలలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ నాటిక పోటీలను రాష్ట్ర వ్యాప్త విద్యార్థుల కోసం టి-సాట్ విద్య ఛానల్ లో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి 10 గంటల వరకు, నిపుణ ఛానల్ లో అదే రోజు రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు ప్రతి రోజు గంట పాటు ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.
డిఫెన్స్ ల్యాబ్స్ స్కూల్ కంచన్ బాగ్ విద్యార్థులు ప్రదర్శించిన ‘బుధ్దం శరణం గచ్ఛామి’, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హయత్ నగర్ విద్యార్ధులు ప్రదర్శించిన ‘దమయంతి స్వయంవరం’ నాటికలతో పాటు మంచిర్యాల జిల్లా కస్తూర్భా గాంధీ బాలికలు ప్రదర్శించిన ‘వై నాట్ ఎ గర్ల్’, మిర్యాలగూడ విద్యార్థులు ప్రదర్శించిన స్వాతంత్ర్య పోరాట యోధురాలు ‘చాకలి ఐలమ్మ’ విజయగాథ, నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన ‘పరమానందయ్యగారి శిష్యులు’ వంటి నాటికలు ప్రసారాల్లో ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తాయని సీఈవో వివరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు పిల్లల్లో కళాపోషణ పెంపొందించే విధంగా వారి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని శైలేష్ రెడ్డి సూచించారు.