కోవిడ్ బాధితులు, ఆపన్నులకు అండగా కమిటీలు: మంత్రి ఎర్రబెల్లి
- పాలకుర్తి నియోజకవర్గంలో కరోనా కట్టడి, రైతు కల్లాలు, వేదికలు, పలు అభివృద్ధి పనులపై మండలాల వారీగా టెలీ కాన్ఫరెన్స్ లో సమీక్షించిన రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
- టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ఆర్డిఓలు సహా, అన్ని శాఖల అధికారులు
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది. ఈ మహమ్మారికి మందు లేదు. టీకాలు ఇంకా రాలేదు. దేశ దేశాలు దాటి మన దేశానికి వచ్చింది. మహానగరాలు, నగరాలు, పట్టణాలు దాటి పల్లెలకు పాకింది. ఇక ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయాలె. మరో రెండు నెలలు కఠినంగా ఉండాలె అని మంత్రి అన్నారు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో రాజకీయాలకు అతీతంగా కమిటీలు వేయండి. ఆయా కమిటీల్లో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వాములను చేయండి. కలిసి వచ్చేవాళ్ళందరినీ కలుపుకుపోండి. స్వచ్ఛంద సంస్థలు, స్వచ్ఛంద సేవకులు, యూత్ ని కలుపుకోండి. ప్రజలను భాగస్వాములను చేస్తూ, చైతన్య పరుస్తూ కరోనాని కట్టడి చేయాలని సూచించారు.
*ఒక్కరికి పాజిటివ్ వచ్చినా ఇంట్లో వాళ్ళందరికీ పరీక్షలు*
ఏ ఒక్కరికి కోవిడ్ పాజిటివ్ వచ్చినా సరే, వెంటనే ఆ ఇంటిలోని వాళ్ళందరికీ పరీక్షలు చేయించాలె. ఆరోగ్యంగా ఉండీ పాజిటివ్ వచ్చిన వాళ్ళని హోం క్వారంటైన్ చేయండి. కాస్త సీరియస్ గా ఉన్నవాళ్ళను మాత్రమే హాస్పిటల్స్ కి తరలించండి. అక్కడ ఆక్సీజన్ సహా, అన్ని రకాల వైద్య సదుపాయాలు సిద్ధం చేయి ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
*కోవిడ్ బాధితులు, ఆపన్నులకు అండగా కమిటీలు*
కోవిడ్ పాజిటివ్ వచ్చిన కుటుంబాలకు,కరోనా బాధితులకు ఆయా కమిటీలు అండగా నిలవాలని మంత్రి చెప్పారు. కరోనా వస్తే, చస్తామన్న భయాలను ప్రజల్లోంచి తీసెయ్యండి. వైరస్ మొదట ఉన్నంత సీరియస్ గా లేదు. ఒకరిద్దరు మినహా అంతా నయమవుతున్నారు. మానవతతో కరోనాని ఎదుర్కొందాం... కరోనా బాధితులను ఆదుకుందామని మంత్రి చెప్పారు.
*సమన్వయం తో నిరంతరం పర్యవేక్షణ*
కమిటీలు సమన్వయంతో మెలగాలని, ఎప్పటికప్పుడుగ్రామాల్లో కరోనా పరిస్థితులను అంచనా వేస్తూ, అధికారులతో, పోలీసులతో ముఖ్యంగా డాకర్లతో సమన్వయం చేస్తూ, ఎవరికీ ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని మంత్రి ఎర్రబెల్లి ప్రజాప్రతినిధులు, అధికారులకు చెప్పారు.
*త్వరలోనే నియోజకవర్గానికి రెండు అంబులెన్సులు-4లక్షల మాస్కులు*
త్వరలోనే నియోజకవర్గానికి రెండు అంబులెన్సులు రానున్నాయని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఒక వాహనం తొర్రూరు కేంద్రంగా, మరో వాహనం పాలకుర్తి కేంద్రంగా పని అందుబాటులో ఉంటాయన్నారు. కరోనా బాధితులకు అండగా ఉండే విధంగా ఆ వాహనాలను తాను తమ ట్రస్టు తరపున అందచేయనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఇంతకుముందే లక్షలాది మాస్కులు పంపిణీ చేసిన తమ ఎర్రబెల్లి ట్రస్ట్ నుంచి మరో 4 లక్షల మాస్కులు అందచేస్తామని, వాటిని ప్రజలకు ఇంటింటికీ అందచేయాలని మంత్రి తెలిపారు.
*మాస్కులు లేకుండా తిరిగితే, జరిమానాలు*
మాస్కులు లేకుండా ఎవరైనా తిరిగితే, వారిపై జరిమానాలు విధించాలని మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు. వెంటనే ఈ నిబంధనను ఆచరణలో పెట్టాలని ఆదేశించారు. ఎవరినీ ఉపేక్షించొద్దు, మరెవరినీ విస్మరించవద్దని మంత్రి సూచించారు.
*నిర్లక్ష్యం వహించే ప్రజాప్రతినిధులు, అధికారులకు దండన*
మొన్నటి మంత్రి వర్గ సమావేశం తర్వాత సీఎం కెసిఆర్ మార్గనిర్దేశనంలో వివిధ హాస్పిటల్స్ కి సరిపడా పిపిఇ కిట్లు, మందులు, మాస్కులు, ఆక్సీజన్ వంటి అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇక వాటిని ప్రజలకు అవసరమైన మేర ఏ విధంగా వినియోగిస్తామన్నదే సవాల్ అన్నారు మంత్రి ఎర్రబెల్లి. ప్రజా ప్రతినిధులు, అధికారులు సరైన రీతిలో పని చేయాలని ఆదేశించారు. ఎవరైనా నిర్లక్ష్యం వహించినట్లుగా తేలితే, అలాంటి అధికారులపై వేటు తప్పదని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు.
*రైతు వేదికలు, కల్లాలు, డంపు యార్డులు, వైకుంఠ ధామాలు వేగంగా పూర్తి*
ఇక రైతు వేదికలు, రైతు కల్లాలు, డంపు యార్డులు, వైకుంఠ ధామాలు వంటి ఇతర అభివృద్ధి, సంక్షేమ పనులకు ఆటంకాలు రాకుండా చూసుకోవాలని, ఆయా పనులు అత్యంత వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి ప్రజాప్రతినిధులు, అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానిస్తూ ఆయా పనులను సత్వరమే పూర్త చేయాలన్నారు.
ప్రజలకు సేవ చేస్తేనే ప్రజాప్రతినిధులు, అధికారులకు సార్థకత, సంతృప్తి ఉంటుందని, అరుదైన ప్రజాప్రతినిధ్యం, అధికారులుగా అవకాశాలు వచ్చాయన్నారు. ఇప్పుడు ప్రజలకు సేవ చేసే నిజమైన అవకాశం వచ్చిందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ప్రజాప్రతినిధులు, అధికారులకు పిలుపునిచ్చారు.