మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్

Related image

సకల విఘ్నాలను తొలగిస్తూ, అన్ని ఆపదల నుంచి రక్షించమని మనం గణపతి పూజ చేస్తాం. ప్రస్తుతం ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ కరోనా వైరస్. దీని నుంచి మనల్ని మనం రక్షించుకోవటంతో పాటు, సమాజాన్ని రక్షించాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది. ఈ నేపథ్యంలో వినాయక చవితి సందర్భంగా మరో వినూత్న కార్యక్రమం చేపట్టారు రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్.

ఆధ్యాత్మికతకు ప్రకృతి, పర్యావరణ రక్షణను జోడించటమే ఈ కార్యక్రమం సంకల్పం. ఈ వినాయక చవితికి విత్తన గణపతిని (సీడ్ గణేష్) పంపిణీ చేయాలని నిర్ణయించారు. దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ఇవాళ విత్తన గణపతిని ఆవిష్కరించారు.

పర్యావరణ హిత స్వచ్ఛమైన మట్టిలో వేప విత్తనాన్ని కలిపి గణపతిని తయారు చేసి పంపిణీ చేయటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. రోజువారీ పూజలు అందుకునే ఈ గణేశునిలోని విత్తనం ఐదు నుంచి ఏడు రోజుల్లో మొలకెత్తుతుంది. మరో వారంలో పూర్తిస్థాయి మొక్కగా మారుతుంది. ఇంట్లోనే విగ్రహ నిమజ్జనం తర్వాత ఈ వేప మొక్కను అందరూ తమ ఆవరణల్లో నాటుకోవచ్చు.

ఎంపీ సంతోష్ ప్రయత్నాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభినందించారు. పర్యావరణ మార్పులు, కాలుష్యం, కరోనా లాంటి భూతాలకు పెద్ద ఎత్తన చెట్లు పెంచటమే మార్గమని మంత్రి అన్నారు. సీడ్ గణేషా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. క్యాబినెట్ సమావేశం సందర్భంగా మంత్రులకు ఎం.పీ సంతోష్ కుమార్ విత్తన గణేషుడి విగ్రహాలను పంపిణీ చేశారు.

ఇప్పటికే తాము చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గో రూరల్ ఇండియా సంస్థతో కలిసి త్వరలోనే విగ్రహాల పంపిణీ మొదలు పెడతామని ఎం.పీ సంతోష్ ప్రకటించారు. కరోనా సమయంలో గణపతి వేడుకలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా ఎం.పీ అన్నారు. ఎవరికి వారే తమ ఇళ్లలోనే విత్తన గణపతిని ప్రతిష్టించుకునేలా, పూజల తర్వాత మొలకెత్తే వేప విత్తనాన్ని నాటు కోవచ్చునని తెలిపారు.

తద్వారా ప్రతీ ఇంటి ఆవరణలో ఔషధ గుణాలున్న ఒక వేప చెట్టు ఉండాలన్న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఆశయం కూడా సిద్దిస్తుందని సంతోష్ తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా వీలైనన్ని విత్తన గణేష్ లను పంపిణీ చేస్తామని, అదే సమయంలో ఆసక్తి ఉన్న స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చన్నారు. టీ ఆర్ ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా ఉత్సాహంగా విత్తన గణపతి పంపిణీలో పాల్గొనాలని సంతోష్ పిలుపు నిచ్చారు. ఆకుపచ్చని తెలంగాణ సాధనలో ఇది కూడా ఒక సాధనంగా ఉపయోగపడు తుందన్నారు.

More Press Releases