సనత్‌నగర్ - బాలానగర్ నాలుగు లేన్ల రైల్వే అండర్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు కేటీఆర్, తలసాని!
- సనత్‌నగర్ - బాలానగర్ పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ నిర్మించనున్న నాలుగు లేన్ల రైల్వే అండర్ బ్రిడ్జి, ఫతేనగర్ ఫ్లైఓవర్‌కు ప్యార్‌లల్‌గా నిర్మించనున్న రెండు లేన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రులు కె.టి.ఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్
- ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, హెచ్.ఆర్.డి.సి.ఎల్ సిఇ డా.సి.వసంత, జోనల్ కమిషనర్ ప్రావిణ్య, స్థానిక కార్పొరేటర్లు
- ఆర్.యు.బి నిర్మాణ వ్యయం రూ. 68.30 కోట్లు కాగా, ఫతేనగర్ ప్యార్‌లల్ ఫ్లైఓవర్ అంచనా వ్యయం రూ. 45 కోట్లు
సనత్‌నగర్ - బాలానగర్ పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ రూ. 68.30 కోట్లతో నిర్మించనున్న నాలుగు లేన్ల రైల్వే అండర్ బ్రిడ్జి, ఫతేనగర్ ఫ్లైఓవర్ పై ఒత్తిడిని తగ్గించుటకు దానికి ప్యార్‌లల్‌గా రూ. 45 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రెండు లేన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తో కలిసి మంత్రి కె.టి.ఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ...నగరంలో ఏ పనినైనా మొదటగా సనత్‌నగర్ నియోజకవర్గం నుండే శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఈ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణంతో సనత్‌నగర్, నర్సపూర్ చౌరస్తా, జీడిమెట్ల మధ్య ప్రయాణించే లక్షలాది మంది ప్రజలకు రిలీఫ్ లభిస్తుందని తెలిపారు. ఈ రెండు పనులను వేగంగా పూర్తిచేయించాలని హెచ్.ఆర్.డి.సి.ఎల్ అధికారులను ఆదేశించారు. బాలానగర్ ఫ్లైఓవర్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, మరికొన్ని నెలల్లో దీనిని ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ...సనత్‌నగర్ నియోజకవర్గ అభివృద్దికి మంత్రి కె.టి.ఆర్ ప్రత్యేక శ్రద్ద తీసుకొని నిధులు మంజూరు చేయిస్తున్నట్లు తెలిపారు. ఏ నియోజకవర్గానికి లేనివిధంగా సనత్‌నగర్ కు ప్రత్యేక రిజర్వాయర్‌ను నిర్మించినట్లు తెలిపారు. అదేవిధంగా ఇండోర్ స్టేడియం పనులు పూర్తి అయ్యాయని, త్వరలోనే దీనిని ప్రజల వినియోగంలోకి తేనున్నట్లు తెలిపారు. మహా ప్రస్థానానికి ధీటుగా బల్కంపేట శ్మశానవాటికను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు.
నియోజకవర్గంలో వైట్ టాపింగ్ రోడ్లను కూడా నిర్మించినట్లు తెలిపారు. ధీర్ఘకాలంగా సనత్‌నగర్ ప్రాంత ప్రజల చిరకాల కోరికగా ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి, ఫ్లైఓవర్లను మంజూరు చేసిన మంత్రి కె.టి.ఆర్ కు నియోజకవర్గ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో సతమతమవుతున్న పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ ను ప్రపంచ స్థాయిలో అభివృద్దికి నిదర్శనంగా నిలిపేందుకు లింక్ రోడ్లు, స్కైవేలు, ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. సనత్‌నగర్ నియోజవకర్గం అన్ని విధాలుగా వేగంగా అభివృద్ది చెందుతున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ కృషిని నగర ప్రజలు చిరస్థాయిగా గుర్తించుకుంటారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో శాసన సభ్యులు మాధవరం కృష్ణారావు, జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, హెచ్.ఆర్.డి.సి.ఎల్ సిఇ డా.సి.వసంత, జోనల్ కమిషనర్ ప్రావిణ్య, సిసిపి దేవేందర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.