నల్గొండ క్రాస్ రోడ్ నుండి ఓవైసీ జంక్షన్ వరకు నిర్మించే కారిడార్ కు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
రూ. 523 కోట్లతో నల్గొండ క్రాస్ రోడ్ నుండి ఓవైసీ జంక్షన్ వరకు నిర్మించే కారిడార్ కు శంకుస్థాపన చేసిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు మహ్మూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎం.పి అసదుద్దీన్ ఓవైసి, జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, స్థానిక శాసన సభ్యులు, కార్పొరేటర్లు
హైదరాబాద్, జూలై 23: రూ. 523 కోట్ల 37 లక్షల వ్యయంతో నల్గొండ క్రాస్ రోడ్ నుండి ఓవైసీ జంక్షన్ వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్‌కు గురువారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి మహ్మద్ మహ్మూద్ అలీ, రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, ఎం.పి అసదుద్దీన్ ఓవైసీ, స్థానిక శాసన సభ్యులు అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్ (ఇన్‌చార్జి) ఉపేందర్‌రెడ్డి, ప్రాజెక్ట్ సి.ఇ.శ్రీధర్, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. 3.382 కిలోమీటర్ల ఈ ఎలివేటెడ్ కారిడార్‌లో 2.580 కిలోమీటర్ల పొడవున ఫ్లైఓవర్ తో పాటు రెండు వైపులా ర్యాంప్ నిర్మాణం జరుగుతుంది. నాలుగు లేన్లతో నిర్మిస్తున్న ఈ కారిడార్‌తో నల్గొండ క్రాస్ రోడ్ నుండి సైదాబాద్, ఐఎస్ సదన్, ఓవైసీ జంక్షన్ల మధ్య ట్రాఫిక్ రద్దీ సమస్య పరిష్కరించబడుతుంది. ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు చేపట్టిన పనుల్లో భాగంగా ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరుగుతున్నది. ఆధునిక టెక్నాలజితో ఈ నిర్మాణం చేపడుతున్నారు.