స్వయం సహాయక సంఘాలకు రుణ అనుసంధానంలో తెలంగాణ నెంబర్ వన్.. అధికారులను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి
- ఈ ఏడాది మొదటి త్రైమాసికానికే 17.56శాతం లక్ష్య సాధన
- కేంద్ర ప్రభుత్వ నేషనల్ రూరల్ లైవ్ లీ వుడ్స్ మిషన్ వెల్లడి
- సంబంధిత అధికారులను అభినందించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
- ఉపాధి హామీ తరహాలో నిర్ణీత లక్ష్యాన్ని ముందే సాధించాలని అధికారులకు ఆదేశాలు
- సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతోనే సాధ్యపడిందని కృతజ్ఞతలు, ధన్యవాదాలు
పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన ఈ సంఘాలు, మహిళలే సభ్యులుగా పొదుపుతోపాటు, బ్యాంకుల నుంచి రుణాలు అతి తక్కువ వడ్డీకే పొందుతూ, స్వయం సమృద్ధిని సాధించే దిశగా ఈ స్వయం సహాయక సంఘాలు నడుస్తున్నాయి. తెలంగాణలో 3,17,333 సంఘాలున్నాయి. ఈ సంఘాల్లో రూ.8661.29 లక్షల రుణ అను సంధానం లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 1,15,409 సంఘాలకు రూ.1521.72 లక్షల ఆర్థిక సహాయం అందింది. ఇదే దేశంలో లెక్కల్లో చూస్తే, 36.37శాతం సంఘాలకు 17.56శాతం ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాలతో ఎన్ ఆర్ ఎల్ ఎం వివరించింది.
అయితే, మిగతా రాష్ట్రాలు తెలంగాణ సాధించిన గణాంకాలకు చాలా దూరంలో ఉండటం విశేషం. 12.11 శాతంతో మణిపూర్, 11.69శాతంతో సిక్కిం, 10.39శాతంతో కర్ణాటక వరసగా రెండు, మూడు, నాలుగో స్థానంలో నిలిచాయి. కాగా, 6.93శాతంతో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉంది. మిగతా రాష్ట్రాలు సింగిల్ డిజిట్ శాతానికే పరిమితమయ్యాయి.
కాగా, స్వయం సహాయక సంఘాలకు రుణ అనుసంధానంలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలవడంపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం, సమర్థవంతమైన పాలన వల్లే ఇది సాధ్యపడిందన్నారు. తెలంగాణలో కరోనా కష్టకాలంలోనూ మహిళల స్వయం సహాయక సంఘాలు అద్భుతంగా పని చేశాయన్నారు. సాటిర్స్, మాస్కుల తయారీలో బాగా పని చేశారన్నారు. అతి తక్కువ సమయంలో అందరికీ మాస్కులు అందేలా చేశారన్నారు.
అలాగే దేశంలో ఎక్కడాలేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నేతృత్వంలో చేపట్టిన ధాన్యం కొనుగోలులోనూ విశేషమైన పాత్రపోశించారన్నారు. ఇక స్త్రీనిధి సంస్థ ఆధ్వర్యంలో మామిడి, బత్తాయి, బొప్పాయి పండ్ల వ్యాపారాన్ని సైతం విజయవంతంగా నిర్వహించారన్నారు. కుటీర పరిశ్రమలుగా మహిళలు చేపట్టిన అనేక పథకాలు విజయవంతంగా నడుస్తున్నాయన్నారు.
ఇంటికి వెలుగు ఇల్లాలు అన్నట్లుగా, చక్కని ఆర్థిక ప్రణాళికతో తమ ఇంటిని, కుటుంబాన్ని చక్కదిద్దినట్లుగానే, వ్యాపార వ్యవహారాలను కూడా మహిళలు అద్భుతంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. మహిళలకు రుణ అనుసంధానానికి సహకరించిన బ్యాంకర్లను, సమర్థవంతంగా పని చేస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి, పేదరిక నిర్మూలన సంస్థ, సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సందీప్ కుమార్ సుల్తానియాని, సంబంధిత శాఖల అధికారులను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. తమ కృషితో రాష్ట్రంలో నెంబర్ వన్ గా నిలిపినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.