వరంగల్ చుట్టుముట్టు జిల్లాల పేషంట్లకు వరంగల్ లోనే చికిత్స: మంత్రి ఎర్రబెల్లి
వరంగల్, జూలై 15ః ప్రజలు ఆందోళన చెందొద్దు... కరోనా వచ్చిందనో, వస్తుందనో అక్కడా, ఇక్కడా తిరగవద్దు. ఆగం ఆగం కావద్దు. కరోనా నియంత్రణకు కావాల్సినన్ని సకల ఏర్పాట్లు వరంగల్ లోనే చేస్తున్నాం. ఇక నుంచి వరంగల్ చుట్టుముట్టు జిల్లాల కరోనా రోగులందరికీ వరంగల్ లోనే చికిత్సలు అందిస్తాం. ప్రజా సేవకు ఇది మంచి తరుణం... ఈ అవకాశాన్ని ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలి. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. వైద్యులు కూడా మీ సేవలు అందించండి అంటూ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలు, ప్రజాప్రతినిధులు, వైద్యులకు పిలుపునిచ్చారు.
కరోనా విస్తృతిని కట్టడి చేయడం, అలాగే వరంగల్ ఎంజిఎం వైద్యశాలలో కరోనా బెడ్ల, వైద్య సామర్ధ్యం పెంపు, వరంగల్ లోనే వైద్య చికిత్సలు పూర్తిగా అందే ఏర్పాట్లు వంటి పలు అంశాలపై మంత్రి వరంగల్ లోని తన క్యాంపు కార్యాలయం (హన్మంకొండ-ఆర్ అండ్ బి అతిథి గృహం)లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎంజిఎం వైద్యులు, ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలతో సుదీర్ఘంగా చర్చించారు. ఆయా అంశాలను ఒక్కొక్కటిగా సమీక్షించి, రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి ఈటల రాజేందర్ తో నేరుగా ఫోన్ లో మాట్లాడారు.
ఆయా సమస్యలకు వెంటనే పరిష్కారాలు చూపారు. అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, ఎంపీ బండా ప్రకాశ్, మేయర్ గుండా ప్రకాశ్ రావు, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్, వరంగల్ కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పతి, సిపి ప్రమోద్ కుమార్ తదితరులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు.
రానున్న రోజుల్లో కరోనాని ఎదుర్కోవడానికి అవసరమైన చర్యలపై సుదీర్ఘంగా చర్చించామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. ప్రజల్లో ఆందోళనను పోగొట్టడమే కాదు, వారికి అన్న రకాల వైద్య సేవలను స్థానికంగా వరంగల్ లోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కరోనా నియంత్రణకు కావాల్సినన్ని ఏర్పాట్లు-వరంగల్ లోనే సకల సదుపాయలు కల్పిస్తున్నామని, ఇక వరంగల్ చుట్టుముట్టు జిల్లాల పేషంట్లకు వరంగల్ లోనే చికిత్స అందిస్తామని అన్నారు.
*కోవిడ్ హాస్పిటల్ గా పిఎంఎస్ఎస్ వై హాస్పిటల్*
ప్రధాన మంత్రి స్వాస్త్య సంయోజన పథకం కింద వరంగల్ సెంట్రల్ జైలు ఆవరుణలో నిర్మించిన 200 పడకల వైద్యశాలని పూర్తిగా కోవిడ్ హాస్పిటల్ గా వినియోగించుకోవాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. అందుకు తగిన ఏర్పాట్లన్నీ చేయనున్నామన్నారు. మరోవైపు అనేక రకాల పేషంట్లు వచ్చే ఎంజిఎంని మాత్రం సాధారణ వైద్యశాలగానే పరిగణిస్తూ, కరోనా ఓపీ, ఇతరత్రా వినియోగించనున్నట్లు ఆయన చెప్పారు.
*ఐసోలేషన్ వార్డుగా కెయు- చికిత్స చేసే డాక్టర్లకు హోటల్ హరిత*
కాగా, సాధారణ కరో్నా రోగులకు ఐసోలేషన్ వార్డుగా కాకతీయ యూనివర్సిటీని వినియోగించాలని నిర్ణయించామన్నారు. ఎవరూ లేని, ఇళ్ళళ్ళకు వెళ్ళలేని పేషంట్లకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ఇక చికిత్సలు చేసే డాక్టర్ల కోసం హోటల్ హరితను వినియోగించనున్నట్లు మంత్రి తెలిపారు.
*వరంగల్ కి కావాల్సినన్ని రాపిడ్ టెస్ట్ కిట్లు, వెంటిలేటర్లు, ఆక్సీజన్, పిపిఇ కిట్లు*
వరంగల్ ఉమ్మడి జిల్లాకే గాక, దాదాపు చుట్టుముట్టు 14 జిల్లాలకు కేంద్రంగా, హైదరాబాద్ తర్వాత అతి పెద్ద హాస్పిటల్ గా పేరున్న ఎంజిఎం హాస్పిటల్ కి కావాల్సినన్ని రాపిడ్ టెస్టుల కిట్లు, వెంటిలేటర్లు, ఆక్సీజన్, పిపిసి కిట్లను ఇవ్వనున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ తమకు ఫోన్ లో చెప్పినట్లు మంత్రి ఎర్రబెల్లి వివరించారు. అలాగే కాకతీయ మెడికల్ కాలేజీలోని పీజీలకు ఎక్స్టెన్షన్ ఇవ్వడమే గాక, వారి సేవలను సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు వినియోగంచుకుంటామని, ఈ మేరకు ప్రభుత్వ జీవో కూడా వచ్చినట్లు మంత్రి తెలిపారు.
*ఇండ్లల్లో ఉండే కరోనా బాధితులకూ ఇంటివద్దే వైద్య సేవలకు సూచనలు*
కరోనా లక్షణాలు పెద్దగా ఉన్నా, లేకపోయినా హోం క్వారంటైన్ లో ఉండే పేషంట్ల కోసం ఇంటి వద్దే వైద్య సేవలు ఫోన్ ద్వారా అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. అలాగే, కరోనా నియంత్రణకు ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లు ఇవ్వాలని కలెక్టర్ ని ఆదేశించామన్నారు. కలెక్టర్, వరంగల్ కార్పొరేషన్ కమిషనర్, సీపీ, ప్రజాప్రతినిధులు, ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ సభ్యులతో కూడిన మన్వయ కమిటీతో కరోనా వైద్య సేవలను పర్యవేక్షిస్తామని చెప్పారు. ప్రతి రెండు రోజులకు అధికారులు, డాక్టర్లు, వారానికోసారి ప్రజాప్రతినిధుల సమీక్షలు ఉంటాయన్నారు.
*కరోనా రోగులకు చికిత్సలు అందించే డాక్టర్లు, సిబ్బందికి నేటి నుంచే నగదు ప్రోత్సాహకాలు-అవార్డులు, రివార్డులు*
కరోనా వైద్య సేవలు అందించే బెస్ట్ డాక్టర్లకు ప్రోత్సాహాకాలు ఇస్తున్నామన్నారు. డాక్టర్లకు ప్రతి రోజూ రూ.వెయ్యి, నర్సులకి రూ.500, మిగతా సిబ్బందికి రూ.300 ఇవ్వనున్నామన్నారు. ఒకవేళ సరైన వైద్య సేవలు అందించడంలో విఫలమైన వాళ్ళపై కూడా తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
*కరోనా చికిత్సలకు ఇక 24 గంటల్లోనే ప్రైవేట్ హాస్పిటల్స్ కి అనుమతులు*
ఇక నుంచి కరోనా పరీక్షలు, చికిత్సల కోసం అనుమతులు కోరితే, ప్రైవేట్ హాస్పిటల్స్ కి కేవలం 24 గంటల్లోనే అనుమతులివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ర్యాపిడ్ యాంటీ జెంట్ టెస్టులు కూడా చేయవచ్చని మంత్రి తెలిపారు. తాను నిరంతరం వైద్య మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లతో చర్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు మెరుగైన, సమర్థవంతమైన చికిత్సలు అందించడానికి, ప్రజా సేవకు మంచి తరుణంమన్నారు. తాను ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులోనే గాక, అండగా ఉంటామని ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు.