మహిళల సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
మహిళల సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ తాగునీటి సరఫరా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రతి మహిళా ఆర్థికంగా సాధికారత సాధించి, సొంత కాళ్లపై నిలబడేలా చేయడం లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలకు అనుగుణంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మహిళా సాధికారత లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర శ్రీనిధి బ్యాంకు దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. స్త్రీనిధి సంస్థ సేవలను మరింత విస్తృత పరచడం లక్ష్యంగా రూపొందించిన లోన్ సురక్ష పథకం విస్తరణ సేవలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం సచివాలయంలో ప్రారంభించారు. స్త్రీనిధి సంఘ సభ్యుల కరదీపికను, స్నేహ లోన్ కార్యక్రమాల ప్లకార్డులను... పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ 2018–19 వార్షిక నివేదికనూ విడుదల చేశారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ‘స్త్రీనిధి నుంచి రుణాలు పొందిన సభ్యులకు భరోసా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా లోన్ సురుక్ష పథకాన్ని విస్తరించాం. లోక్ సురక్ష కింద స్త్రీనిధి నుంచి సభ్యులు తీసుకున్న మొత్తానికి సమానంగా బీమా వర్తింపు ఉంటుంది. ఏదైనా కారణంతో రుణం పొందిన సభ్యురాలు చనిపోతే... బాకీ ఉన్న మొత్తాన్ని బీమా నిధి నుంచే చెల్లించడం జరుగుతుంది. బీమా కింద వచ్చే మొత్తంలో బాకీ చెల్లించగా మిగిలిన డబ్బులను సభ్యురాలి కుటుంబానికి ఇస్తాం. లోన్ సురక్ష పథకం విస్తరణలో భాగంగా... ఎవరైనా సభ్యురాలు దురదృష్టవశాత్తు చనిపోతే అదే రోజు అంత్యక్రియలకు గరిష్టంగా రూ.5 వేలు వెంటనే సాయం చేస్తాం. ఈ సదుపాయం ఈ రోజు నుంచి మొదలుపెడుతున్నాం. అలాగే స్త్రీనిధి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమాన్ని అన్ని సంఘాల సభ్యులకు చేరవేయాలనే లక్ష్యంతో కరదీపిక రూపొందించాం.
మహిళా సాధికారత లక్ష్యంగా ఏర్పాటైన స్త్రీనిధి కార్యక్రమాల నిర్వహణ పారదర్శకంగా నడిచేందుకు ఉపయోగపడుతుంది. స్త్రీనిధి పరిధిలోని రాష్ట్రంలోని 5 లక్షల సంఘాల్లోని ప్రతి సభ్యురాలికి అందజేయనున్నాం. సంఘాల సభ్యులకు, సమాఖ్యలకు ఒనగూరే ప్రయోజనాలను ఈ కరదీపికలో వివరించాం. స్త్రీనిధిలోని పొదుపు పథకాలు, రకరకాల రుణాల వివరాలు దీంట్లో ఉన్నాయి. సభ్యులు, సమాఖ్యలు చేయాల్సిన పనులను... చేయగూడని పనులను కరదీపికలో వివరంగా పొందుపరిచాం. ఈ కరదీపికతో గ్రామాల్లోని ప్రతి ఒక్క సభ్యురాలికి అవగాహన పెరుగుతుంది. స్త్రీనిధి నుంచి రూ.3 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఎన్ని రకాల రుణాలను పొందవచ్చేనే విషయాలతోపాటు అన్ని అంశాలను దీంట్లో పొందుపరిచాం. ప్రతి గ్రామంలో అన్ని మహిళా సంఘాల్లోని సభ్యులకు స్త్రీనిధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం ఈ కార్యక్రమం ఉద్దేశం.
స్త్రీనిధి కార్యక్రమాలపై ఇప్పటికే అన్ని జిల్లాల్లోని ఎంపిక చేసిన 250 మంది సభ్యులకు శిక్షణ ఇచ్చాం. ఇలా శిక్షణ పొందిన వారు గ్రామాలకు వెళ్లి అన్ని సంఘాల్లోని మహిళా సభ్యులకు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ కార్యక్రమం కోసం అవసరమైన ప్లకార్డులను, ఇతర అవగాహన పత్రాల విడుదల చేశాం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అమలు చేసిన అన్ని కార్యక్రమాలపై సమగ్ర వార్షిక నివేదికనూ విడుదాల చేశాం’ అని వివరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్వి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూప్రసాద్, సెర్ప్ సీఈవో పౌసుమిబసు, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.