మాస్కులు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి
మార్గమధ్యంలో మంత్రి ఎర్రబెల్లి పలువురికి మాస్కులు పంపిణీ చేశారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం పెద్దబాయి తండా వద్ద వ్యవసాయ పనులకు వెళ్తున్న కూలీలను చూసి ఆగి మాస్క్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారిని మంత్రి కుశల ప్రశ్నలు వేశారు. కరోనా ఉందా? జాగ్రత్తగా ఉంటున్నారా? వ్యవసాయ పనులు, కూలీలు దొరుకుతున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కాళేశ్వరం నీటి రిజర్వాయర్లతో తెలంగాణ సస్యశ్యామలం:రామవరం, కొడకండ్ల, నాంచారి మడూరు, అమ్మాపురం (జనగామ, మహబూబాబాద్ జిల్లాలు), జూలై 14: కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్సారెస్పీ, దేవాదుల, పాలమూరు రంగారెడ్డి వంటి పలు సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణ సస్యశ్యామలం కానున్నదని, రైతులను రాజులను చేసే లక్ష్యంతోనే సీఎం కెసిఆర్ అనేక రైతు సంక్షేమ, రైతు అనుబంధ పథకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
రైతు వేదికలతో దళారుల నుంచి రైతులకు విముక్తి లభిస్తుందని, గిట్టుబాటు ధరలు కల్పించడానికి వీలవుతుందని వారన్నారు. ఉమ్మడి జిల్లాలోని జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో మంగళవారం విస్తృతంగా పర్యటించిన మంత్రులు జనగామ జిల్లా రామవరం, కొడకండ్ల, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు, అమ్మాపురం గ్రామాల్లో రైతు వేదికలకు మంత్రులిద్దరూ శంకుస్థాపనలు చేశారు. అలాగే నాంచారి మడూరు గ్రామంలో మొక్కలునాటి ప్రకృతి వనానికి అంకురార్పణ గావించారు. అనేక చోట్ల మంత్రులిద్దరూ కలిసి తెలంగాణకు హరిత హారంలో భాగంగా మొక్కలు నాటారు.
ఆయా రైతువేదికల శంకుస్థాపనల అనంతరం మంత్రులిద్దరూ మాట్లాడారు. రైతులను రాజులను చేయడానికే సిఎం కెసిఆర్ కంకణం కట్టుకున్నారని చెప్పారు. కరోనా కష్ట కాలంలోనూ రైతులను ఇబ్బందులు పెట్టకూడదన్న లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. రైతాంగ ధాన్యం కొనుగోలు ఒక్క తెలంగాణలో తప్ప, దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. రూ.30వేల కోట్లతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ఘతన కెసిఆర్ ది అని చెప్పారు. రైతులకు సాగునీరు, ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, రైతు వేదికలు, కల్లాలు, గోదాములు, అందుబాటులో విత్తనాలు, ఎరువులు, రుణ మాఫీలు... ఇలా అనేక పథకాలు కేవలం రైతాంగం కోసమే అమలు అవుతున్నాయని మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి అన్నారు.
*రైతు వేదికలతో దళారుల నుంచి రైతులకు విముక్తి*
రైతు వేదికలతో దళారుల నుంచి రైతాంగానికి విముక్తి కలుగుతుందని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు చెప్పారు. రైతుల ధాన్యానికి రైతులే ధరలు నిర్ణయించే పరిస్థితులు రావాలన్నారు. అన్నదాత బాగుంటేనే దేశం బాగుంటుందని, ఆ లక్ష్యంతోనే సీఎం కెసిఆర్ రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున ఏర్పాటు చేసి, రైతు వేదికలు నిర్మిస్తున్నారని మంత్రులు రైతులకు చెప్పారు. ఇలా ఒక్క జనగామ జిల్లాలోనే 62 రైతు వేదికలు నిర్మితమవుతుండగా, ఇప్పటికే 9 రైతు వేదికలకు శంకుస్థాపనులు జరిగాయని మంత్రులు తెలిపారు.
*కొడకండ్లలో 40వేల మెట్రిక్ టన్నుల గోదాము*
ఇక కొడకండ్లలో రూ.25 కోట్ల వ్యయంతో 40వేల మెట్రిక్ టన్నుల గోదాము నిర్మిస్తున్నట్లు మంత్రులు వివరించారు. ఈ గోదాము నిర్మితమైతే, ఈ ప్రాంత రైతాంగానికి తమ పంటలను నిలువ చేసుకునే వీలుంటుందని, గిట్టుబాటు ధరలు లభించినప్పుడే తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందని మంత్రులు తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కనీసం మండలానికో ఓ గోదాము చొప్పున నిర్మిస్తున్నట్లు మంత్రులు వివరించారు. రైతు వేదికలతో పాటు, కల్లాలు కూడా నిర్మిస్తున్నట్లు మంత్రులు రైతులకు తెలిపారు.
*ఉపాధి హామీతో వ్యవసాయ పనులు అనుసంధానం*
ఉపాధి హామీతో వ్యసాయ పనులను అనుసంధానం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా కూలీలకు ఉపాధి లభించినట్లు మంత్రులు తెలిపారు. దేశం సగటు కంటే, మన తెలంగాణ రాష్ట్ర సగటు అత్యధికంగా ఉందని, కరోనా కష్ట కాలంలోనూ గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించిన ఘనత మన తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రులుతెలిపారు.
*కెసిఆర్ పథకాలతోనే ప్రగతి బాటలో పల్లెలు*
సిఎం కెసిఆర్ రూపొందించి అమలు చేస్తున్న వివిధ పథకాల కారణంగా తెలంగాణ పల్లెలు ప్రగతి బాటలో పయనిస్తున్నాయని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు అన్నారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయి ప్రగతిని పల్లెల్లో చూడలేదన్నారు. తమ సుదీర్ఘ రాజకీయ జీవితంలో సిఎం కెసిఆర్ లాంటి సీఎంని కూడా చూడలేదని, నిరంతరం ప్రజలు, రైతులు, వారి సంక్షేమం, అభివృద్ధి కోసం పరితపించే సీఎం మనకు ఉండటం మన అదృష్టమని మంత్రులు తెలిపారు.
*సిఎం కెసిఆర్, దయన్న నేతృత్వంలో ప్రగతి పథంలో తెలంగాణః మంత్రి సత్యవతి రాథోడ్*
సిఎం కెసిఆర్ నేతృత్వంలో.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో అటు తెలంగాణ రాష్ట్రం, ఇటు పాలకుర్తి నియోజకవర్గం ప్రగతి పథంలో పయనిస్తున్నాయని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గ్రామీణాభివృద్ధి పథకాలన్నీ మంత్రి ఎర్రబెల్లి ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయన్నారు. తెలంగాణకు కెసిఆర్ సిఎం కావడం, మన దయన్న తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖకు మంత్రి కావడం ప్రజలు చేసుకున్న అదృష్టం అన్నారు. మరోవైపు పాలకుర్తి, చెన్నూరు వంటి రిజర్వాయర్లు పూర్తి చేసి, పాలకుర్తి నియోజకవర్గం మొత్తానికి సాగునీటిని, మంచినీటిని అందిస్తామని మంత్రి ఎర్రబెల్లి ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
*కరోనాతో జెర జాగ్రత్త!*
కరోనాతో ప్రజలు జెర జాగ్రత్తగా ఉండాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరికొద్ది రోజులు ప్రజలు స్వీయ నియంత్రణ, వ్యక్తి గ పరిశుభ్రత, పరిసరాల పారిశుద్ధ్యాన్ని పకడ్బందీగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా జరిగిన ఆయా కార్యక్రమాల్లో జనగామ, మహబూబాబాద్ కలెక్టర్లు నిఖిల, గౌతం, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.