పర్యాటక ప్రాంతంగా అన్నారం షరీఫ్, పర్వతగిరి: మంత్రి ఎర్రబెల్లి
- రూర్బన్ ప్రాజెక్టు కింద ఖరారైన పనుల కోసం ఎమ్మెల్యే అరూరి రమేశ్, వివిధ శాఖల అధికారులతో కలిసి క్షేత్ర పరిశీలన చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
రూర్బన్ ప్రాజెక్టు కింద మంజూరైన మొదటి విడత నిధులలో భాగంగా ఖరారైన పనులను స్వయంగా మంత్రి ఎర్రబెల్లి, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఆయా శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పర్వతగిరి ఊరచెరువు వద్ద మొక్కలు నాటారు. చెరువు కట్టను పరిశీలించారు. చెరువుని విశాలం చేయాలన్నారు. వచ్చే ఏడాది నుంచి దసరా ఉత్సవాలు అక్కడే జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత అన్నారం దర్గా చెరువుని పరిశీలించారు. కట్ట వెంట నడుస్తూ వెళ్ళారు. చెరువుని పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. చెరువునే కాదు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అక్కడే ఉన్న ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మొక్కలు నాటారు. దర్గాను దర్శించి మొక్కుకున్నారు. దారిలో తమకు ఎదురైన పలువురు ఉపాధి హామీ కూలీలకు మంత్రి మాస్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. "రూర్బన్ ప్రాజెక్టు నిధులపై తాను గతంలో ఎంపీగా పని చేసినప్పుడే అవగాహనతో పని చేశాను. మధ్యలో ఈ ప్రాజెక్టుని నిలిపివేశాం, నేను, స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్ తో కలిసి సిఎం గారి ద్వారా కేంద్రానికి లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశాం, అనేక ప్రయత్నాల తర్వాత మొదటి విడతగా రూ.30 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో పర్వతగిరి ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలనేదే లక్ష్యం" అని అన్నారు. అన్నారం గ్రామానికి దర్గా దర్శనార్థం లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ సరైన సదుపాయాలు కల్పించడంతో పాటు అన్నారం షరీఫ్, పర్వతగిరిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో అన్నారం రోడ్డు పొడవునా షట్టర్లు వేసివ్వాలని, మాంసం కేంద్రం నిర్మించాలని, కబేళాను కట్టించాలని, స్కూల్ భవనాన్ని కొంత దూరంలో నిర్మించాలని, ప్రస్తుత స్కూల్ స్థలంలో బస్టాండ్ నిర్మించాలని భావిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు.
ఇప్పటికే ఎమ్మెల్యే అరూరి రమేశ్ కృషితో వచ్చిన రోడ్ల కారణంగా కాస్త మెరుగైన సదుపాయాలు ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. గిరిజన తండాలను కూడా అభివృద్ధి పరచాలని చూస్తున్నామన్నారు. అలాగే ఇక్కడి ప్రజలకు ఉపాధి, శిక్షణ, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. ప్రజావసరాలకనుగుణమైన అభివృద్ధి, ప్రణాళికలతో ఇక్కడ పనులు చేపడతాన్నారు. పర్వతగిరిలోనూ అధునాతన లైబ్రరీ, మినీ స్టేడియం, జిమ్ ఏర్పాటు చేస్తామన్నారు. నిధుల కొరత లేదని, పనులు కూడా వేగంగా పూర్తి చేస్తామన్నారు. తాను స్థానికుడిని కావడం, ఎమ్మెల్యే రమేశ్ చొరవ కారణంతా తాము పర్వతగిరి ప్రాంత ప్రజల కోసం, వారి పురోగతి కోసం పరితపిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
ఈ ప్రాంతం వాడిగా.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచి, ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని, అందుకు ప్రజల సహకారం ఉండాలాన్నారు. మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మంత్రి వెంట వివిధ శాఖల అధికారులు ఉన్నారు.