ప్రభుత్వ కట్టడాలకు ఇసుకకు అనుమతులివ్వండి.. అధికారులకు మంత్రి ఎర్రబెల్లి ఆదేశం!
- గ్రామాల్లో పారిశుద్ధ్యానికీ ఉపాధి హామీ
- నరేగా నిధులను పూర్తిగా వినియోగించుకోవాలి
- ఉపాధి హామీని సద్వినియోగం చేయలేకపోతే అధికారుల పై చర్యలు
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పలు చోట్ల హరిత హారం కార్యక్రమాలు నిర్వహించి, మొక్కలునాటిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరపరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
- పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, పెద్దవంగర మండలాల పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించిన మంత్రి
6వ విడత తెలంగాణకు హరితహారంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలోని కపిల్ హోమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి, ఆ తర్వాత వరసగా తొర్రూరు పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ ఎదురుగా KGVB స్కూల్లో, తొర్రూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్లకు PPE కిట్లను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు, పెద్ద వంగర మండలాలలోని డబుల్ బెడ్ రూం ఇండ్లు, కల్వర్టులు, ఉపాధి హామీ నిధులు, హరిత హారం, పల్లె, పట్టణ ప్రతగి, కరోనా వైరస్ కట్టడి వంటి పలు అంశాలమీద సుదీర్ఘంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, కరోనా వైరస్ విస్తృతి ఆందోళనకరంగా ఉందన్నారు. సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల కట్టడిలోకివచ్చినప్పటికీ, ఆతర్వాత ప్రధాని మోడీ ఇచ్చిన సడలింపులతో వలస కూలీలతో మళ్ళీ విస్తరించిందన్నారు. అయితే, ప్రజలు ఎవరికివారుగా స్వీయ నియంత్రణలో ఉండాలని సూచించారు. డాక్టర్లు, పోలీసులు, అధికారులు, పారిశుద్ధ్యకార్మికులు కరోనా కట్టడిలో తమ ప్రాణాలను ఫణంగాపెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని ప్రశంసించారు. మరోవైపు సిఎం కెసిఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణకు హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కెసిఆర్ రూపొందించి అమలు చేస్తున్న హరిత హారం జీవావరణాన్ని కాపాడుతుందన్నారు.
*ప్రభుత్వ కట్టడాలకు ఇసుకకు అనుమతులివ్వండి*
కరోనా నేపథ్యంలో కుంటుపడిన అభివృద్ధి ని పరుగులు పెట్టించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కట్టడాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇసుక కొరత అడ్డంకి కారాదని, నిబంధనలతో కూడిన అనుమతులిచ్చి, ప్రభుత్వ కట్టడాలు ఆగిపోకుండా చూడాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులను ఆదేశించారు.
*పల్లె పారిశుద్ధ్యానికీ ఉపాధి హామీ*
ఇక నుంచి పల్లె పారిశుద్ధ్యానికి కూడా ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకోవచ్చని మంత్రి ఎర్రబెల్లి ప్రకటించారు. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ పరిధిలోనే పల్లెల పారిశుద్ధ్యం నిర్వహిస్తున్నామని, ఇక నుంచి ఉపాధి హామీని కూడా అనుసంధానించుకోవచ్చని మంత్రి ఎర్రబెల్లి అధికారులకు తెలిపారు.
*నరేగా నిధులను పూర్తిగా వినియోగించుకోవాలి*
నరేగా (ఉపాధి హామీ) నిధులను పూర్తి గా సద్వినియోగం చేయాలని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. వివిధ శాఖలకు ఉపాధి హామీని అనుసంధానించినందున ఆయా పనులను ఉపాధి హామీ కింద తప్పనిసరిగా చేయాలని చెప్పారు. అలా చేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్సారెస్సీ కాలువలు, కాలువలకు ఇరువైపులా మొక్కలు నాటడం, రైతులను భాగస్వాములను చేయడం వంటి కార్యక్రమాలు చేయాలని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతిని కొనసాగించాలని మంత్రి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు.
*పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు, పెద్ద వంగర మండలాల అభివృద్ధి పనులపై సమీక్ష*
*డబుల్ బెడ్ రూం ఇండ్లు నెల రోజుల్లోగా పూర్తి చేయాలి*
నెల రోజుల్లోగా పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, పెద్ద వంగర మండలాల్లోని డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి, ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. జులై మొదటి వారంలో తొర్రూరు, పెద్ద వంగర మండలాల్లోని కనీసం ఐదారు గ్రామాల్లో ప్రారంభోత్సవాలు జరిగేలా చూడాలని మంత్రి సూచించారు. అలాగే కల్వర్టులను సైతం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నెల రోజుల్లోగా ఇండ్లు పూర్తి కావాలి లేదా సంబంధిత కాంట్రాక్టర్ల కాంట్రాక్ట్ లను రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు.
*పల్లెలు పరిశుభ్రంగా లేకపోతే సర్పంచులు, గ్రామ కార్యదర్శులపై వేటు*
నియోజకవర్గంలోని గ్రామాల్లో 10 రోజుల్లో పారిశుద్ధ్యం మెరుగు పడకపోతే, సర్పంచ్ లు, కార్యదర్శులపై వేటు వేస్తామని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. తాను జిల్లా కలెక్టర్ తో కలిసి మరో 10 రోజుల తర్వాత ఆకస్మిక తనిఖీలు చేస్తామన్నారు. అప్పటి కల్లా గ్రామాలు శుభ్రంగా లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే, గ్రామాల్లో మంకి ఫుడ్ కోర్టులు, వైకుంఠ దామాలు, స్కూల్స్, డంప్ యార్డులు, నర్సరీలు నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
*పల్లెపల్లెకో పార్క్*
ప్రతి గ్రామంలో ఎకరా భూమి పార్క్ కోసం కేటాయించాలి. చెరువు శిఖాల్లో ఇలాంటి పార్కులను సైతం ఉపాధి హామీ కిందే నిర్మించుకోవచ్చని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ గౌతం, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.