లబ్ధిదారులైన యువకులకు ఉపాధి కోసం వాహనాలను పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి
- సహకార బ్యాంకుల ద్వారానే రైతాంగానికి నిజమైన సహకారం
- డిసిసిబీ గౌరవం పెంచే విధంగా రైతులకు సాయం చేయండి
- రైతులకు మరింత చేరువగా డిసిసిబి కావాలి
- వరంగల్ రూరల్ జిల్లా పర్వత గిరి కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యలో కార్మికులకు చెక్కుల పంపిణీ
- డీసీసీబీ ఆధ్వర్యంలో రైతులకు వాళ్ళ ముంగిట్లోనే రుణాలు పంపిణీ చేసే విధంగా రూపొందించిన మొబైల్ ఏటీఎం వాహనాల ప్రారంభం
- హరిత హారంలో భాగంగా మొక్కలు నాటిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
కమర్షియల్ బ్యాంకులున్నప్పటికీ, సహకార బ్యాంకుల ద్వారానే రైతాంగానికి నిజమైన సహకారం అందుతుందని, ఆ దిశగా తమపై రైతులకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా వ్యవహరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిసిసిబి చైర్మన్, డైరెక్టర్లు, అధికారులకు చెప్పారు. సిఎం కెసిఆర్ చర్యలు, పథకాలను చూసి నడుచుకోవాలన్నారు. రైతులను రాజులను చేయడానికి సిఎం కెసిఆర్ అహర్నిషలు కష్టపడుతున్నారని, రైతు బంధు, రుణ మాఫీ, విత్తనాలు, ఎరువులు, రైతు బీమా, చివరకు రైతుల పంటల కొనుగోలు వంటి అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం ఒక్క తెలంగాణలో తప్ప మరెక్కడా లేదన్నారు.
మిగతా రాష్ట్రాల్లో రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధరలు లేక అప్పులపాలై, దళారులకు అగ్గువ ధరకే అమ్ముకుంటున్నారన్నారు. ఈ పరిస్థితి మనకు రాకుండా ఉండడానికి కరోనా సమయంలోననూ కెసిఆర్, రూ.30వేల కోట్ల అప్పులు తెచ్చి, రైతులను ఆదుకున్నారని వివరించారు. అలాగే రైతులకు నియంత్రిత పంటలనే వేయాలని చెబుతున్నారని, రైతులు లాభసాటిగా మారాలన్నదే సీఎం కెసిఆర్ లక్ష్యమని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. ప్రాథమిక స్థాయిలో రైతులకు సహకార బ్యాంకులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా అంతా కలిసికట్టుగా పని చేయాలన్నారు. పలు ప్రభుత్వ పథకాలను వివరిస్తూ, రైతులు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందని మంత్రి వివరించారు.
అలాగే కులవృత్తులను కాపాడుతూ, మిషన్ భగీరథ ద్వారా చెరువులు, కుంటలను సంరక్షించిన ఘనత మన సిఎం కెసిఆర్ దే అన్నారు. మన సమాజ మూలాలను చెరిగిపోకుండా కాపాడుతూనే, ఆధునిక పోకడలతో అవసరమైన అభివృద్ధి చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిది, సిఎం కెసిఆర్ దే నని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు.
ఈ కార్యక్రమాల్లో వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, డిసిసిబి చైర్మన్ మార్నేని రవిందర్ రావు, వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వరరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, డిసిసిబి, కోఆపరేటివ్ బ్యాంకుల అధికారులు, లబ్ధిదారులు, రైతులు పాల్గొన్నారు.