మిడతల దండు ప్రమాదం పొంచి ఉంది.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్

Related image

మిడతల దండు ప్రమాదం మరో సారి పొంచి ఉన్న నేపథ్యలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. గత నెలలో మూడు విడతలుగా దేశంలో ప్రవేశించిన మిడతల దండ్లు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వరకే వచ్చాయి. తెలంగాణ వైపు రాలేదు. అయితే తాజాగా ఓ మిడతల దండు తెలంగాణ సమీపంలోకి వచ్చింది.

రాష్ట్రానికి 200 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని రాంటెక్ వద్ద గల అజ్ని అనే గ్రామం వద్ద ప్రస్తుతం మిడతల దండు ఉంది. దాని ప్రయాణం దక్షిణం వైపు సాగితే, చాలా తక్కువ సమయంలో తెలంగాణలోకి ప్రవేశించే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యలో మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని కాపాడే చర్యలను ముఖ్యమంత్రి ఇవాళ ప్రగతి భవన్ లో సమీక్షించారు. మిడతల దండు గమనంపై సమాచారం తెప్పించుకున్నారు. మిడతల దండు దక్షిణం వైపు వస్తే ఏ క్షణమైనా తెలంగాణకు ముప్పే అని తేలింది. మరోవైపు ఈ నెల 20 నుంచి జూలై 5 వరకు మళ్లీ మిడతల దండు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తేల్చారు. ఆ సమయంలో తెలంగాణలో వర్షాకాలం పంట సీజన్ ప్రారంభమయి ఉంటుంది.

పంటలు మొలకెత్తి ఉంటాయి. మిడతల దండు దాడిచేసిందంటే చాలా నష్టం జరుగుతుంది. లేత పంటను పీల్చి పారేస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ విసి ప్రవీణ్ రావు, సిఐపిఎంసి ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆర్. సునిత, వ్యవసాయ యూనివర్సిటీ సీనియర్ శాస్త్రవేత్త రహమాన్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఎనిమిది జిల్లాల్లో అప్రమత్తత:


మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించే అవకాశం ఉన్నందున ఈ రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న 8 జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సిఎం ఆదేశించారు. భద్రాచలం, చర్ల, వెంకటాపురం, వాజేడు, పేరూరు, మంగపేట, ఏటూరునాగారం, చెన్నూరు, వేమనపల్లి, కౌటాల, ధర్మాబాద్, బోధన్, జుక్కల్, భాన్సువాడ, నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల నుంచి మిడతల దండు వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించి, తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


ఆదిలాబాద్ కు సిఎస్ బృందం:


మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా తీసుకున్న చర్యలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్యంలో ప్రత్యేక బృందాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ విసి ప్రవీణ్ రావు, సిఐపిఎంసి ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆర్. సునిత, వ్యవసాయ యూనివర్సిటీ సీనియర్ శాస్త్రవేత్త రహమాన్ తదితరులతో కూడిన బృందం ఒకటీ రెండు రోజుల్లో ఆదిలాబాద్ లో పర్యటించనుంది. అక్కడే ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తుంది. మిడతల దండు గమనాన్ని పరిశీలిస్తూ, అవసరమైన చర్యలను పర్యవేక్షిస్తుంది. 

  • జీవో నెంబరు 3ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రివ్యూ పిటిషన్ వేయాలనే నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కృతజ్ఞతలు తెలిపారు.

More Press Releases