పల్లె, పట్టణ ప్రగతితోనే కట్టడిలో కరోనా వైరస్: మంత్రి ఎర్రబెల్లి
ధరూరు, నర్సింగాపూర్, మాధవాపూర్ (జగిత్యాల జిల్లా జగిత్యాల, కోరుట్ల), జూన్ 8ః సిఎం కఠినమైన లాక్ డౌన్ వంటి నిర్ణయాలు, పల్లె, పట్టణ ప్రగతితోనే తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ కట్టడిలో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. స్వీయ నియంత్రణ, సామాజిక, భౌతిక దూరం పాటిస్తూనే, ముఖాలకు మాస్కులు ధరించాలన్నారు. అలాగే రైతులు నియంత్రిత పంటలతో లాభసాటిగా మారాలని పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా దరూరు, నర్సింగాపూర్, మాధవాపూర్ లలో పల్లె ప్రగతికి కొనసాగింపుగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కరోనాను కట్టడి చేయడంలో సిఎం కెసిఆర్ విజయం సాధించారన్నారు. లాక్ డౌన్ ని ప్రకటించి చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయని చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ని ఎత్తేయడమే కాకుండా, వలస కార్మికులకు ఇచ్చిన వెసలుబాటు కారణంగా కరోనా మళ్ళీ విజృంభిస్తున్నదన్నారు. అయితే కరోనాని కట్టడి చేయడానికి వేరే మార్గాలు లేవన్నారు. ఉన్నదల్లా ఒక్కటే స్వీయ నియంత్రణ, అప్రమత్తత, ముఖాలకు మాస్కులు ధరించడం, సామాజిక భౌతిక దూరం పాటించడమొక్కటే మార్గం అన్నారు.
అయితే, ఇప్పటి వరకు కరోనా కట్టడిలో ఉండడానికి కారణం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలేనని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. కరోనా మన దేశంలోకి, రాష్ట్రంలోకి ఇతరుల ద్వారా రావడానికి ముందే నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు తెలంగాణని అద్దంలా మార్చాయన్నారు. పల్లె ప్రగతికి కొనసాగింపుగా నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం వల్ల కూడా మరోసారి పల్లెలు పరిశుభ్రంగా మారాయన్నారు. అయితే ఇంకా కరోనా విస్తరిస్తున్న కారణంగా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు.
*కెసిఆర్ ఏలుబడిలో లాభసాటిగా సాగుబడి*
సిఎం కెసిఆర్ చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతమైందని మంత్రి చెప్పారు. రైతుల కోసం చేపట్టిన రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, సాగునీరు, అందుబాటులో విత్తనాలు, కరోనా కాలంలో కొనుగోలు చేసిన పంటలు, ఇప్పుడు తాజాగా నియంత్రిత పంటల సాగు వరకు అనేక అంశాలను మంత్రి ప్రజలకు వివరించారు. కెసిఆర్ ఏలుబడిలో లాభసాటి సాగుబడి జరుగుతున్నదన్నారు. రైతులు లాభాల బాట పట్టాలి. రైతులు రాజులు కావాలనేదే సిఎం కెసిఆర్ సంకల్పమని మంత్రి చెప్పారు. తెలంగాణ సోనా, నిర్ణీత పత్తి, వరి, కంది పంటలే వేయాలని మంత్రి రైతులకు విజ్ఞప్తి చేశారు.
*హరితహారంలో భాగంగా మాధవాపూర్ లో మొక్కలు నాటిన మంత్రి ఎర్రబెల్లి*
హరిత హారంలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాధవాపూర్ లో మొక్కలు నాటారు. హరిత హారం తెలంగాణకు పచ్చల హారం అవుతున్నదని, కాల చక్రం సజావుగా కావడానికి, వర్షాలు బాగా పడి పంటలు పండటానికి హేతువులన్నారు. అలాగే కోతులు మన నుంచి వాపస్ పోవాలన్నా, మనకు వానలు తిరిగి రావాలన్నా మొక్కలు విరివిగా నాటాలని కోరారు.
*నర్సింగాపూర్ లో వరి నారు మొలకలు అలికిన మంత్రి దయాకర్ రావు*
నర్సింగాపూర్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతు అవతారమెత్తారు. స్వతాహాగా రైతు అయిన ఎర్రబెల్లి, గతంలో వ్యవసాయం కూడా చేశారు. అదే అనుభవంతో నర్సింగాపూర్ లో మంత్రి పర్యటన సందర్భంగా ఓ పొలం వద్ద రైతులు వరి నారు మొలకలు అలుకుతున్నారు. దీంతో మంత్రి దయాకర్ రావు నేరుగా వాళ్ళ వద్దకు వెళ్ళి అలవోకగా వరి మొలకలు అలికి, అందిరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
*ధరూరు, నర్సింగాపూర్, మాధవాపూర్ పల్లెల్లో పారిశుద్ధ్యాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి*
అంతుకముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధరూరు, నర్సింగాపూర్, మాధవాపూర్ గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. ప్రజాప్రతినిధులతో కలిసి మురుగునీటి కాలువలు, పచ్చదనం-పరిశుభ్రతలను పరిశీలించారు.
ఈ కార్యక్రమాల్లో జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత లక్ష్మీ, ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి దివంగత జువ్వాడి రత్నాకర్ రావుకు నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు:తిమ్మాపూర్ (ధర్మపురి), జూన్ 8ః జువ్వాడి రత్నాకర్ రావు రాజకీయాలకతీతంగా ప్రజాసేవకు అంకితమైన ఆదర్శమూర్తి అన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మాజీ మంత్రి దివంగత జువ్వాడి దశదిన కర్మ కార్యక్రమం ధర్మపురి మండలం తిమ్మాపూర్ లో సోమవారం జరగగా ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి హాజరయ్యారు. జువ్వాడి చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, సర్పంచ్ గా, సమితి అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా జువ్వాడి రత్నాకర్ రావు సేవలు చిరస్మరణీయమన్నారు. తామంతా ఆయన్ని రాజకీయాలకతీతంగా గౌరవిస్తామన్నారు. ఆయనకు నివాళులర్పించడానికే తాను వచ్చినట్లు, అలాగే, వారి కుటుంబానికి ధౌర్యం చెప్పడానికి తాము విచ్చేశామని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. మంత్రి ఎర్రబెల్లితోపాటు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, జువ్వాడి రత్నాకర్ రావు కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.