ఆరవ విడత హరిత హారం కార్యక్రమంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
- హరితహారం మొక్కలు వంద శాతం బతకాలనే లక్ష్యంతో పని చేయాలి
- నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యతను ప్రతీ ఒక్కరు తీసుకోవాలి
- ఆకుపచ్చని మాస్కులు (గ్రీన్ మాస్క్) లు ధరించి హరిత హారంలో పాల్గొనాలి
- లాక్ డౌన్ వల్ల పర్యావరణం మెరుగైంది. దానిని కాపాడుకోవాలి
- ఆరవ విడత హరిత హారం కార్యక్రమంపై అన్ని జిల్లాల అటవీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
అయితే గత ఐదు విడతల్లో నాటిని మొక్కల్లో బతికిన శాతం ఎంతని మంత్రి ఆరా తీశారు. అటవీ శాఖలో ప్రతీ ఉద్యోగి జవాబుదారీ తనంతో పని చేసి నాటిన ప్రతి మొక్క వంద శాతం బతకాలనే లక్ష్యంతో పని చేయాని మంత్రి అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ మొక్కలు నాటిన చోట్ల 85%కి పైగా మంచి ఫలితాలు ఉన్నాయని, ఇతర శాఖలు, బహిరంగ ప్రదేశాల్లో నాటిన మొక్కల్లో బతికిన శాతం కొంత తక్కువగా నమోదవుతోందని అధికారులు మంత్రికి వివరించారు.
ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టాన్ని కఠినంగా అమలుచేస్తున్నందున గ్రామాలు, పట్టణాల్లో అటవీ శాఖ తరపున చక్కని సాంకేతిక సహకారాన్ని అందిస్తూ మొక్కలు నాటించాలని మంత్రి సూచించారు. పంచాయతీ రాజ్ చట్టం మాదిరిగానే నాటిన మొక్కల్లో 85% బతకించాలనే నిబంధనలను అటవీ శాఖలోనూ అమలు చేస్తున్నామని, ఆ మేరకు తమ పరిధిలో ఫలితాలు చూపించకపోతే ఆ సంబంధిత అటవీ శాఖ అధికారి, సిబ్బందిని భాద్యులుగా చేస్తున్నామని పీసీసీఎఫ్ మంత్రికి వెల్లడించారు.
ఆరవ విడతలో అడవుల బయట 20 కోట్లు, అడవుల లోపల 1.90 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రికి వివరించారు. ఇప్పటికే జిల్లాలు, శాఖల వారీగా లక్ష్యాలను సంబంధిత అధికారులకు నిర్ధేశించామన్నారు. అటవీ శాఖ తరపున ప్రతీ గ్రామీణ, పట్టణ ప్రాంత నర్సరీకి వెళ్లి ప్లాంటేషన్ ప్రక్రియ ఏ విధంగా చేపట్టాలో వారికి సూచించామని అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ పకడ్బందీగా జరగాలని, నర్సరీలకు వెళ్లినప్పుడు అటవీ శాఖ అధికారులు స్థానిక ప్రతినిదులను ఖచ్చితంగా కలవాలని మంత్రి ఆదేశించారు.
80 రోజులకు పైగా లాక్ డౌన్ తో పర్యావరణం బాగా మెరుగైందని, ఆ ఫలితాలను కొనసాగించేలా అటవీ శాఖ పనితీరు ఉండాలని మంత్రి సూచించారు. కరోనా నేపథ్యంలో హరిత స్పూర్తిని చాటేలా తెలంగాణకు హరిత హారం లోగోతో ఉన్న ఆకుపచ్చని మాస్కులను (గ్రీన్ మాస్క్) ధరించాలని మంత్రి సూచించారు. ఈసారి మంచి వర్షాలు ఉంటాయని వాతావరణ నివేదికలు చెప్పుతున్న నేపథ్యంలో బాగా పని చేసి వంద శాతం లక్ష్యాన్ని జియో టాగింగ్ తో సహా సాధించాలని మంత్రి ఆదేశించారు. నర్సరీల్లో పెద్ద మొక్కలను మొదటి దశలో వాడాలని, నేల స్వభావానికి తగిన మొక్కలు నాటాలని మంత్రి చెప్పారు.
ఈసారి హరిత హారంలో కోటి చింత మొక్కలు నాటి భవిష్యత్తులో తెలంగాణకు చింతపండు దిగుమతి అవసరం లేకుండా చూడాలన్నారు. గ్రామాలు, రాష్ట్ర, జాతీయ రోడ్ల వెంట రహదారి వనాలు (అవెన్యూ ప్లాంటేషన్) చాలా చక్కగా అభివృద్ది చెందుతున్నాయని, ఎక్కడైనా మొక్కలు చనిపోతే తక్షణం తగిన ఎత్తులో ఉన్న మొక్కలను నాటి గ్యాప్ ఫిల్లింగ్ చేయాలన్నారు. హరిత హార కార్యక్రమ ప్రక్రియను ఆడిట్ పరిధిలోకి తేవాలన్నారు. థర్డ్ పార్టీ ద్వారా పచ్చదనం పెరిగిన శాతాన్ని, సర్వైవల్ శాతాన్ని ఖచ్చితంగా గణించాలని స్పష్టం చేశారు. అడవుల్లో 33% పచ్చదనం పెంచాలన్న సీయం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు.
మరోవైపు ఈ సీజన్ లో తునికాకు సేకరణ పురోగతిపై మంత్రి ఆరా తీశారు.
ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ (HoFF) ఆర్.శోభ, అదనపు పీసీసీఎఫ్ లు లోకేష్ జైస్వాల్, ఆర్.ఎం.డోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, ఎం.సి. పర్గెయిన్, సిదానంద్ కుక్రేటి, హైదరాబాద్, రంగారెడ్డి చీఫ్ కన్జర్వేటర్లు చంద్రశేఖర రెడ్డి, సునీతా భగవత్, అన్ని జిల్లాల అధికారులు పాల్గొన్నారు.