పారిశుద్ధ్యాన్ని పకడ్బందీగా నిర్వహించాలి: మంత్రి ఎర్రబెల్లి
- పచ్చదనం-పరిశుభ్రతతోనే ఆరోగ్యం
- మాస్కులతో కరోనా మన దరికి రాదు
- కెసిఆర్ లాంటి సీఎం మనకు ఉండటం మన అదృష్టం
- మన సీఎం కెసిఆర్ దేశానికే గర్వ కారణం
- మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్
ఈ సందర్భంగా ఇద్దరు మంత్రులు గ్రామంలో కలియ తిరిగారు. పాదయాత్ర చేశారు. గ్రామంలో పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. మురుగునీటి కాలువలను చూశారు. గ్రామంలో తమకు పరిచయం ఉన్న వాళ్ళందరినీ పేరుపేరుగా పలకరించారు. పారిశుద్ధ్యానికి సంబంధించిన పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి, మంత్రి సత్యవతి రాథోడ్ లు మాట్లాడుతూ, ఆరోగ్యమే మహా భాగ్యమన్నారు. పెద్దలు చెప్పిన ఆ మాటలు అన్ని వేళలా సత్యాలన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే, ఏదైనా సాధించవచ్చని చెప్పారు. ఆరోగ్యంగా ఉండాలంటే, మనం శుభ్రంగా ఉండాలి. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని పకడ్బందీగా నిర్వహించాలి. అని మంత్రులిద్దరూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ వానా కాలం సీజన్ లో మరింత జాగ్రత్త వహించాలి. దోమల నివారణ, దోమలు పెరగకుండా చూడటం, నీటి నిల్వలు లేకుండా చూడటం, కాలువలను శుభ్రంగా ఉండేలా చేయడం వంటి చర్యలన్నీ చేపట్టాలని సూచించారు.
మరోవైపు కరోనా కట్టడికి మాస్కులు ధరించాలన్నారు. స్వీయ నియంత్రణ, సామాజిక, భౌతిక దూరం పాటించాలన్నారు. కరోనా బారి నుండి మనల్ని మనమే రక్షించుకోవాలి. కరోనా విస్తరణను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని ప్రజలను మంత్రులిద్దరూ కోరారు.
ఆదాయం పడిపోయినా అందరినీ సిఎం కెసిఆర్ ఆదుకుంటున్నారని మంత్రులు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిని ఆపడం లేదన్నారు. ఉచిత బియ్యం, రూ.1500 ఆర్థిక సాయం చేస్తున్నారని చెప్పారు. కష్టాలున్నా.. రైతులకు అన్ని విధాలుగా మేలు చేస్తున్నారన్నారు. ఒక్క ఉచిత విద్యుత్ కోసం ఒక్కో రైతుకు రూ.60వేలను ప్రభుత్వమే ఇస్తున్నదని చెప్పారు. రైతు బంధు కోసం రూ.7వేల కోట్లు, రూ.1200 కోట్లతో రుణ మాఫీతోపాటు రూ.30వేల కోట్లతో పంటల కొనుగోలు చేసిన ప్రభుత్వం దేశంలోనే లేదని మంత్రులు దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు చెప్పారు. పంటల కొనుగోలు కోసం ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే రూ.100 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని వివరించారు.
మక్కలతో ఈ వానాకాలంలో మనకేమీ లాభం లేదంటూనే, ప్రభుత్వం సూచిస్తున్న నియంత్రిత పంటలనే వేయండి-లాభసాటిగా మారండి అంటూ మంత్రులిద్దరూ రైతులకు పిలుపునిచ్చారు. వ్యవసాయం దండగ కాదు... పండుగలా చేసిన ఘనత సిఎం కెసిఆర్ దేనన్నారు. సిఎం కెసిఆర్ లాంటి సీఎంని తాము ఇప్పటి వరకు చూడలేదు.కెసిఆర్ లాంటి సీఎం మనకు ఉండటం మన అదృష్టం. మన సీఎం కెసిఆర్ దేశానికే గర్వ కారణం అని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు ప్రజలకు తెలిపారు.
*గండు బుచ్చయ్య కుటుంబానికి పరామర్శ*
మేచరాజుపల్లిలో తమ కుటుంబంతో అనుబంధం ఉన్న గండు బుచ్చయ్య కుటుంబాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు పరామర్శించారు. ఏడాదిన్నర క్రితమే బుచ్చయ్య మృతి చెందారు. అయితే, వారి కుటుంబ సభ్యులతో కాసేపు గడిపిన మంత్రులు వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
*బూరుగుపల్లిలో ఆకస్మిక తనిఖీ*
అంతకుముందు బూరుగుమళ్ళ గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామంలో పర్యటించి మురుగునీటి కాలువలు, పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణను మరింతగా మెరుగు పరచాలని ఆ గ్రామ ప్రజలకు మంత్రి సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.