పారిశుద్ధ్య పనులు రోజు జరగాలి: తెలంగాణ సీఎస్

Related image

సంగారెడ్డి , జూన్ 5:- పారిశుద్ధ్య నిర్వహణ నిరంతర ప్రక్రియగా కొనసాగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో పల్లె ప్రగతిలో జరుగుతున్న పనులు పారిశుద్ధ్య నిర్వహణ, హరితహారం తదితరాలను పరిశీలించుటకు శుక్రవారం సిఎస్ ఆకస్మికంగా కంది మండలం ఎద్దు మైలారం, కొండాపూర్ మండలం గుంతపల్లి గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాల్లో డంప్ యార్డ్, వైకుంఠధామం, వర్మీ కంపోస్ట్ యూనిట్, హరిత హారంలో నాటిన మొక్కలు, నర్సరీ, పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య పనులు రోజు జరగాలని, ఎప్పుడు  వచ్చినా చూడడానికి గ్రామం బాగా కనిపించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయితీలలో అన్ని రకాల మంచి కార్యక్రమాలు జరుగుతున్నవని, పారిశుద్ధ్య కార్యక్రమం, హరితహారంతో మూన్ముందు మరిన్ని మంచి ఫలితాలు కనిపిస్తాయన్నారు. పారిశుద్ధ్యం బాగుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఎలాంటి రోగాలు దరిచేరవని అన్నారు.

ఏ రాష్ట్రంలోనూ ,దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ను అందించిన ది ముఖ్యమంత్రి గారి మంచి ఆలోచనగా సి ఎస్ పేర్కొన్నారు. జిల్లాలో సందర్శించిన రెండు గ్రామాల్లోనూ మంచి పనులు జరిగాయని ,పారిశుద్ధ్య నిర్వహణ బాగుందన్నారు. dumpyard, వైకుంఠ దామాలు అన్ని పూర్తయ్యాయని, వాటిని పూర్తిస్థాయిలోవినియోగించుకోవాలని సూచించారు.

వర్షాకాలంలో హరితహారానికి సిద్ధం కావాలని అధికారులకు సూచించారు, ఉన్న నర్సరీలను ఇంకా బాగు చేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో మాత్రమే పార్కులు ఉన్నాయని, గ్రామాల్లో కూడా పార్కు లు  ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని ఆయన సూచించారు. జిల్లాలో శానిటేషన్ హరితహారం పనులు బాగున్నాయని,  అంకితభావంతో పనిచేసారని జిల్లా కలెక్టర్  అధికారులను సి ఎస్ అభినందించారు.

గ్రామాల సందర్శనకు ముందుగా గీతం యూనివర్సిటీ ఆవరణలో సిఎస్ మొక్కలు నాటారు. ఈ సందర్శనలో సి ఎస్ వెంట పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

More Press Releases