భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలికి స్వయం ప్రతిపత్తి కల్పించాలి: పవన్ కల్యాణ్ డిమాండ్
- ఇసుక సరఫరా సులభతరం చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలి
- ఇసుక విధానంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలనే ఈ ప్రభుత్వమూ చేస్తోంది
- ఇసుక మాఫియాను అదుపు చేయకపోతే నిర్మాణ రంగం కుదేలవుతుంది
- భవన నిర్మాణ కార్మికులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
ప్రకృతి సిద్ధంగా లభించే ఇసుక విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలనే ప్రస్తుత ప్రభుత్వం కూడా చేస్తోంది... ఫలితంగా మాఫియా చేతుల్లో ఇసుక విధానం చిక్కుకొందని తెలిపారు. ఇసుక ధరలు భారీగా ఉండటం, సరఫరా సక్రమంగా లేకపోవడంతో నిర్మాణాలు సాగక భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కరవైపోయిందని చెప్పారు. ఇసుక సరఫరాను సులభతరం చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. కరోనా వల్ల తలెత్తిన లాక్డౌన్ మూలంగా గత రెండు నెలలుగా పనులు లేక ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొన్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కరోన సమయంలో ఈ కార్మికుల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను ఏ విధంగా వ్యయం చేశారో వెల్లడించాలన్నారు. ఆదివారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ లోని భవన నిర్మాణ కార్మికులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ కాన్ఫరెన్స్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. 13 జిల్లాల నుంచీ 150 మంది భవన నిర్మాణ కార్మికులు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొని తమ సమస్యలను వివరించారు. గత యేడాది ప్రభుత్వం ఇసుక విధానం మారుస్తామని ఇసుక ఆపేయడంతో సుమారు 5 నెలలపాటు పని లేకుండా పోయిందని, ఇప్పుడు కరోనా, లాక్డౌన్ తో పనులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇప్పుడు కూడా ఇసుక అందుబాటులో లేకపోవడం, భారీగా ధరలు ఉండటంతో నిర్మాణాలు నిలిచి ఉపాధి కరవైందని తెలిపారు.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేసి ముందుకు వెళ్లాల్సిన పాలకులు మళ్ళీ అవే తప్పులు చేస్తే ఎలా? ప్రకృతి సిద్ధంగా లభించే ఇసుక విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, చెలరేగిపోతున్న మాఫియా వల్ల నిర్మాణ రంగం కుదేలైపోతుంది. అంతిమంగా ఈ ప్రభావం కార్మికుల కుటుంబాలపైపడుతోంది. ఒక మేస్త్రికి పని ఉంటే కనీసం 20 మంది స్కిల్డ్, అన్ స్కిల్డ్ కార్మికులు పనిలోకి వెళ్తారు. మేస్త్రికే పని లేక ఇబ్బందిపడుతుంటే ఇక కార్మికుల పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుంది. ఇసుకను ఆపేయడంతో నెలల తరబడి పనులు లేక 60 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుడు మనసు చలించి విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహిస్తే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఆ తరవాత కొన్ని నెలలు ఉపాధి లభించినా ఇప్పుడు కరోనా వల్ల ఇబ్బందులు వచ్చాయి.
• కండలు కరిగించే కార్మికుల ఆత్మాభిమానం కాపాడాలి
లాక్డౌన్ వల్ల నెలల తరబడి పనులు లేక ఆకలిదప్పులకు లోనైన కార్మికుల గురించి వింటుంటే బాధ కలిగింది. పరిస్థితులు చక్కబడ్డా ఇసుక కొరత, అధిక ధరల వల్ల భవన నిర్మాణాలు ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. ఇసుక ధరలకు భయపడే మధ్య తరగతి వారు గృహ నిర్మాణాల నుంచి వెనక్కి తగ్గుతున్నారు లాక్ డౌన్ సమయంలోనూ ఇసుక తవ్వకాలు సాగించి వేలాదిగా ఇసుక లారీలను తిప్పారు ఇసుక డంపింగ్ ప్రదేశాలకు చేరలేదు అని కార్మికులు చెబుతున్నారు. మరి అంత ఎటు వెళ్లిపోయింది. రాబోయే వర్షా కాలం, ఆపై వరదలతో తమ ఉపాధి అవకాశాలు మరింత దెబ్బ తింటాయి అని ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ ఆత్మహత్యలు జరుగుతాయో అని వారు భయపడుతున్నారు. కండలు కరిగించి నిర్మాణాలు చేసే కార్మికులు వారు. వారు తమ కష్టాన్నే నమ్ముకొంటారు తప్ప ఎక్కడా చేయి చాచరు. వారి ఆత్మాభిమానాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కరోనా సమయంలో ఈ కార్మికుల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను ఏ విధంగా వ్యయం చేశారో... వారికి ఏ మేరకు చేర్చారో తెలియచేయాలి.
కార్మిక శాఖ వీరిపై సానుకూలంగా వ్యవహరించాలి. ఈ కార్మికులు ఎంతగా ఇబ్బందిపడుతున్నారు అంటే – సభ్యత్వం కోసం రూ.100 కట్టినా ప్రయోజనం ఉండటం లేదు... ఆ రూ.100 ఉంటే రెండు రోజులు ఆకలి తీరుతుంది అని ఆ కష్ట జీవులు ఆలోచిస్తున్నారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా మండలి ఉంది. నిర్మాణాలు చేసే ప్రతి ఒక్కరూ ఆ కార్మికుల సంక్షేమం కోసం సెస్ చెల్లిస్తారు. ఆ మొత్తాన్ని కార్మికుల కోసం సద్వినియోగం చేయాలి. రాష్ట్ర విభజన నాటికి ఆ సంక్షేమ మండలి నిధిలో సుమారు రూ.4500 కోట్లు ఉండేవి. 50:50 చొప్పున నిధిని పంచుకున్నారు. ఆ నిధిని పాలకులు తమ రాజకీయ ప్రయోజనాలకు మళ్లిస్తున్నారు. ఇది ఎంత మాత్రం భావ్యం కాదు. ఈ రంగంలో 35 లక్షల మంది పైనే ఉపాధి పొందుతూ ఉంటే కేవలం 20.6 లక్ష మంది మాత్రమే రిజిస్టర్ అయి ఉన్నారు.
పనులకు తీసుకువెళ్లే మేస్త్రీలకే ఇబ్బందులు వస్తున్నాయి అంటే రాష్ట్రంలో నిర్మాణ రంగం ఎలా ఉందో అర్థం అవుతోంది. రాబోయే వర్షాకాలం, వరదల సమయంలో కూడా కార్మికుల ఉపాధికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కరోనా వల్ల తిరిగి వచ్చినవారు కూడా ఉంటారు. అందరికీ పనులు కల్పించాలి.
భవన నిర్మాణ కార్మికులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. మీ సమస్యలపై ఏ విధంగా ముందుకు వెళ్ళి ప్రభుత్వంలో కదలిక తీసుకురావాలి అనే విషయంపై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చిస్తాం. మిత్రపక్షంగా ఉన్న బి.జె.పి.తో కలసి మీ సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్తాం. మా పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు పట్టించుకోదు. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడుతుంది” అన్నారు.
• భవన నిర్మాణ కార్మికులకు రూ.3 వేలు పెన్షన్ ఇవ్వాలి: నాదెండ్ల మనోహర్
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “భవన నిర్మాణ కార్మికులు పనులు చేసుకొని బతుకుతాము అన్నా వారికి ఉపాధి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ప్రభుత్వం మారగానే ఇసుక విధానం అని చెప్పి కొన్ని నెలలపాటు పనులు లేకుండా చేశారు. ఇప్పుడు కరోనా. అదే సమయంలో ఇసుక లేకుండా చేశారు. లాక్డౌన్ ఉన్నా ఇసుక రవాణా ఆగలేదని కార్మికులు చెబుతున్నారు.. అయినప్పటికీ ఇసుకను మాత్రం అందుబాటులో ఉంచలేదు. ఈ పరిస్థితులతో కార్మికులు ఇబ్బందులుపడుతున్నారు. లాక్డౌన్ సమయంలో రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి అధ్యక్షుడు శ్రీ పవన్ కల్యాణ్ గారు తీసుకువెళ్లారు. కేంద్ర కార్మిక శాఖ స్పందించి పరిస్థితిని పరిశీలించింది. కేంద్ర నిబంధనల ప్రకారం 60ఏళ్ళు నిండిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.3 వేలు పెన్షన్ ఇవ్వాలి. ఈ నిబంధనను రాష్ట్రంలో అమలు చేయాలి” అన్నారు.
ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు తోరం రాజా తమ సమస్యలను వివరిస్తూ “గత యేడాది కాలంగా మా కార్మికుల బతుకు చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. మొదట ఇసుక విధానం అని చెప్పి ఆపేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారు మానవతా దృక్పథంతో స్పందించి లాంగ్ మార్చ్ చేయడంతో మార్పువచ్చింది. ఇప్పుడు లాక్డౌన్ ఇబ్బందులు. ఇప్పుడు మాకు అప్పు కూడా పుట్టడం లేదు. మా సంక్షేమానికి ఉద్దేశించిన నిధులను కూడా మళ్లిస్తున్నారు. కేంద్ర కార్మిక శాఖ ఇక్కడి పరిస్థితిపై దృష్టిపెట్టాక రాష్ట్ర కార్మిక శాఖలో కదలిక వచ్చింది” అన్నారు. ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు చొప్పున భవన నిర్మాణ సంఘం ప్రతినిధులు మాట్లాడారు.