తెలంగాణ వ్యాప్తంగా హరిత శుక్రవారం
- ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవంలో పాల్గొంటూ మొక్కలకు నీళ్లు
- ఎండలను లెక్కచేయకుండా, కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ పాల్గొన్న ప్రజలు
- విపరీతంగా మండుతున్న ఎండలు, కరోనా వైరస్ భయం ఇవేవీ కూడా తెలంగాణ వ్యాప్తంగా హరిత శుక్రవారం (గ్రీన్ ఫ్రైడే) స్ఫూర్తిని ఆపలేకపోయాయి
ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం (మే 22) కూడా కలిసి రావటంతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రకృతి ప్రేమికులు మొక్కల యోగక్షేమాలు కూడా ఆసక్తిగా పట్టించుకున్నారు. అనేక జిల్లాలు, మండలాల్లో హరితహారం మొక్కలకు నీరు పోశారు. చాలా గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా ట్రాక్టర్లలో నీటిని తరలించి చెట్లకు పట్టారు. 40 డిగ్రీలు దాటిన విపరీత ఎండలు, కరోనా వైరస్ భయాలు కూడా పక్కన పెట్టి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
భౌతిక దూరం పాటించటంతో పాటు, అందరూ దాదాపుగా మాస్క్ లను ధరించి పాల్గొనటం విశేషం. అన్ని ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు హరిత శుక్రవారంలో పాల్గొన్నారు. కొందరు స్థానిక నర్సరీలు పరిశీలించి, రానున్న ఆరవ విడత హరితహారం సన్నద్ధతలు తెలుసుకున్నారు. ఆయా ప్రభుత్వశాఖల పరిధిలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ కోసం గ్రీన్ ఫ్రైడే తప్పని సరిగా అమలు చేయాలని ప్రభుత్వం సూచించింది.