బయోడైవర్సిటీ ఫస్ట్ లేవల్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన తెలంగాణ మంత్రులు
- బయోడైవర్సిటీ ఫస్ట్ లేవల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రులు కె.టి.ఆర్, సబితా ఇంద్రారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ
- వినియోగంలోకి వచ్చిన ఎస్.ఆర్.డి.పి ప్యాకేజి -4 కింద రూ. 379 కోట్లతో చేపట్టిన అన్ని పనులు
- జె.ఎన్.టి.యు నుండి బయోడైవర్సిటీ జంక్షన్ వరకు ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో కు కలిగిన వెసులుబాటు
హైదరాబాద్ నగరానికి తలమానికంగా దినదినాభివృద్ది చెందుతున్న ఐ.టి-ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలలో పెరుగుతున్న వాహనాల రద్దీతో తరచుగా నిలిచిపోతున్న ట్రాఫిక్ సమస్యను అదిగమించుటకై ఎస్.ఆర్.డి.పి ప్యాకేజి -4 కింద రూ. 379 కోట్లతో ఆరు పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటిలో ఐదు పనులు గతంలోనే పూర్తై ప్రారంభించడం జరిగింది. ఈ ప్యాకేజిలో చివరిదైన ఫస్ట్‌లేవల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించడంతో జె.ఎన్.టి.యు నుండి బయోడైవర్సిటీ వరకు దాదాపు 12 కిలోమీటర్ల కారిడార్ వినియోగంలోకి వచ్చి ట్రాఫిక్ ఫ్రీ ఫ్లోకు వెసులుబాటు కలిగింది. ఎస్.ఆర్.డి.పి ప్యాకేజి-4 పనులతో ఈ ప్రాంతం అంతర్జాతీయ స్థాయి నగరాలకు ధీటుగా కనిపిస్తున్నది.
ఎస్.ఆర్.డి.పి ప్యాకేజి -4 కింద నిర్మించిన పనుల వివరాలు:
*1) రాజీవ్ గాంధీ జంక్షన్:* మెజెస్టిక్ షాపింగ్ మాల్ నుండి మలేషియన్ టౌన్‌షిప్ వరకు రూ.97 కోట్ల 93 లక్షల వ్యయంతో 1230 పొడవున నిర్మించిన ఈ ఫ్లైఓవర్ పనులు 2019 ఏప్రిల్ 6న పూర్తయ్యాయి. దీంతో జె.ఎన్.టి.యు - హైటెక్‌సిటీ మధ్య వాహనాల రాకపోకలకు ట్రాఫిక్ ఇబ్బంది తొలగింది.
*2) అయ్యప్ప సొసైటి జంక్షన్ అండర్‌పాస్:* రూ.44 కోట్ల 30 లక్షలతో 450 మీటర్ల పొడవున అండర్‌పాస్ నిర్మించారు. 2018 జనవరి 3న ఈ అండర్ పాస్ పనులు పూర్తయ్యాయి. దీంతో కొండాపూర్ నుండి అయ్యప్ప సొసైటీ వరకు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ సమస్యలు తొలగాయి.
*3) మైండ్‌స్పేస్ జంక్షన్ ఫ్లైఓవర్:* రూ.80 కోట్ల 23 లక్షల వ్యయంతో 830 మీటర్ల పొడవున నిర్మించిన ఈ ప్రాజెక్ట్ పనులు 2018 నవంబర్ 9 న పూర్తయ్యాయి. దీంతో ఇన్‌ఆర్బిట్ మాల్ - ర్యాడిసన్ మధ్య వాహనాల రాకపోకలకు ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులు తొలగాయి.
*4) మైండ్‌స్పేస్ జంక్షన్ అండర్‌పాస్:* రూ.51 కోట్ల 41లక్షలతో 365 మీటర్ల పొడవు, 28.8 మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఈ త్రీలేన్ అండర్‌పాస్ పనులు 2018 ఏప్రిల్ 28న పూర్తయ్యాయి. దీంతో హైటెక్ సిటీ నుండి బయోడైవర్సిటీ సొసైటీ వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగాయి.
*5) బయోడైవర్సిటీ జంక్షన్ సెకండ్ లేవల్ ఫ్లైఓవర్:* రూ.69.12 కోట్ల వ్యయంతో 990 మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఈ త్రీలేన్ ఫ్లైఓవర్ పనులు 2019 నవంబర్ 4న పూర్తయ్యింది. దీంతో మెహిదీపట్నం వైపు నుండి మైండ్‌స్పేస్ వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగాయి.
*6) బయోడైవర్సిటీ జంక్షన్ ఫస్ట్‌లేవల్ ఫ్లైఓవర్:* రూ.30 కోట్ల 26 లక్షలతో 690 మీటర్ల పొడవున నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ను నేడు ప్రారంభించడం జరిగింది. గచ్చిబౌలి వైపు నుండి మెహిదీపట్నం వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగాయి.