చిత్ర పరిశ్రమ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా: తెలంగాణ మంత్రి తలసాని
హైదరాబాద్: కరోనా నియంత్రణ కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ సమస్యలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సినీ ప్రముఖులకు హామీ ఇచ్చారు.
గురువారం జూబ్లీహిల్స్ లోని ప్రముఖ సినీనటులు, పద్మభూషణ్ చిరంజీవి నివాసంలో చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమలోని 14 వేల మంది కార్మికులకు తన సొంత నిధులతో నిత్యావసర సరుకులను అందజేస్తానని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ సమావేశంలో పలువురు నిర్మాతలు, దర్శకులు మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు నిలిచిపోయి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న లక్షలాది మంది ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
అందరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొనే షూటింగ్ లను నిలిపివేయడం జరిగిందని అన్నారు. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న పరిశ్రమలోని 14 వేల మందికి కరోనా క్రైసిస్ చారిటీ (CCC) ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. పరిశ్రమలోని అన్ని వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని సినిమా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ నిర్వహించుకునేందుకు, సినిమా దియేటర్ లను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించాలని కోరారు.
లాక్ డౌన్ సమయంలో షూటింగ్ లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో వివరిస్తూ అవుట్ డోర్, ఇండోర్ షూటింగ్ లకు సంబంధించిన మాక్ వీడియో ను ప్రభుత్వానికి సమర్పిస్తామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ కు వివరించారు. స్పందించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తెలుగు చలనచిత్ర పరిశ్రమ పట్ల ఎప్పుడు సానుకూల ధోరణితో ఉంటుందని చెప్పారు. దేశంలోనే హైదరాబాద్ నగరం చిత్రరంగానికి హబ్ గా నిలిచిందని అన్నారు.
పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునేందుకు అనుమతించే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. తప్పనిసరిగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాస్క్ లను ధరించాలని, శానిటైజేషన్ ఉపయోగించాలని, బౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మాక్ షూటింగ్ నిర్వహణకు అవసరమైన సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు. షూటింగ్ ల నిర్వహణకు, దియేటర్ లను తెరిచేందుకు ముఖ్యమంత్రితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.
ఈ సమావేశంలో పద్మభూషణ్ చిరంజీవి, సేనియర్ నటులు అక్కినేని నాగార్జున, నిర్మాతలు అల్లు అరవింద్, సి కళ్యాణ్, దిల్ రాజు, శ్యాం ప్రసాద్ రెడ్డి, జెమిని కిరణ్, దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, వీవీ వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, ఎన్ శంకర్, FDC మాజీ చైర్మన్ రాం మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.