పసిపిల్లల ప్రాణాలు కాపాడటానికి నిధులు విడుదల చేయించిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి

Related image

ఏడో నెల నిండక ముందే పుట్టి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న ముగ్గురు బిడ్డల పరిస్థితిని విని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వేగంగా స్పందించారు. విషయం తన దృష్టికి వచ్చి 24 గంటలు గడవక ముందే సీఎం సహాయ నిధి నుంచి రూ.7 లక్షలు విడుదల చేయించారు.

ఇందుకు సంబంధించిన వివరాలు ఇవీ.. ప్రకాశం జిల్లా నాగులుప్పల పాడు మండలం ఉప్ప గుండ్లురు గ్రామానికి చెందిన కొలక లూరి అంకయ్య  ఒంగోలు టు టౌన్ పోలీసు స్టేషన్లలో కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. అతని భార్య మరియమ్మ కు ఈ నెల 3వ తేదీ ఒంగోలు సంఘమిత్ర ఆసుపత్రిలో ప్రసవం అయ్యింది. 7వ నెల కూడా నిండక ముందే ఇద్దరు పాపలు, ఒక బాబు పుట్టారు. వీరంతా నెలలు నిండక ముందే పుట్టడంతో ఆరోగ్యం ఇబ్బందికరంగా మారింది. మెరుగైన చికిత్స కోసం పిల్లలను ఒంగోలులోని చందమామ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఇబ్బందిగా తయారు కావడంతో విజయవాడలోని రైన్ బో చిన్న పిల్లల ఆసుపత్రికి తరలించారు.

పిల్లల ప్రాణాలు కాపాడటానికి లక్షలాది రూపాయలు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పారు. అంకయ్య పరిస్థితి చూసిన పోలీస్ సంఘం వారు కొంత సహాయం చేశారు. ఉద్యోగ భద్రత స్కీం  కింద రూ 2లక్షల 10 వేలు అందాయి. మరో 30 రోజులు పిల్లలు ముగ్గురు వెంటిలేటర్ మీద చికిత్స పొందాలని డాక్టర్లు చెప్పారు. దీంతో ఏం చేయాలో పాలు పోని అంకయ్య మంగళవారం తాడేపల్లిలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ఆయన నివాసంలో కలిసి తన గోడు వినిపించుకున్నారు. తన పిల్లల ప్రాణాలు కాపాడాలని వేడుకున్నారు. పిల్లలు ప్రాణాపాయంలో ఉన్న విషయం విని చలించిన వైవీ సుబ్బారెడ్డి వెంటనే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. పిల్లల ప్రాణాలు కాపాడటానికి చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన సీఎం.. సీఎం సహాయ నిధి నుంచి రూ.7 లక్షలకు నగదు పరపతి పత్రం ( ఎల్ ఓ సి ) మంజూరు చేశారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.

More Press Releases