ఈ నెల 22న 45 బస్తీ దవాఖానలు ప్రారంభం: మంత్రి తలసాని
హైదరాబాద్: ఈ నెల 22 న ఉదయం 10.30 గంటలకు జీహెచ్ఎంసీ పరిధిలో ఒకే సమయంలో 45 బస్తీ దవాఖానలను ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ప్రకటించారు. హైదరాబాద్ జిల్లాలో 22, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 05, సంగారెడ్డి జిల్లాలో 03 చొప్పున బస్తీ దవాఖానల ప్రారంభించడం జరుగుతుందని వివరించారు.
బస్తీ దవాఖానల ప్రారంభ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, హోం మంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ ప్రభాకర్, మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసి యోద్దిన్, స్థానిక ఎమ్మెల్యేలు కార్పోరేటర్లతో కలిసి ప్రారంభిస్తారని ఆయన తెలిపారు.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో పని చేస్తున్న 123 బస్తీ దవఖానల ద్వారా ప్రతిరోజూ 10 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. నూతనంగా ప్రారంభించే 45 బస్తీ దవాఖానల తో అదనంగా మరో 4 వేల మందికి వైద్య సేవలు అందుతాయని తెలిపారు.
ఒక్కో బస్తీ దవఖానలో ఒక వైద్యుడు, ఒక నర్స్, ఒక సహాయకుడు ఉంటారు. ప్రజలకు వైద్య సేవలు చేరువ చేసేందుకే ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తుందని అన్నారు. 50 వేల మంది జనాభాకు ఒకటి చొప్పున బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు.