బయట ఆహారానికి స్వస్తి పలికి వీలైనంత వరకు ఇంట్లో వండిన పదార్థాలనే తీసుకోవాలి: వైద్య నిపుణుల సూచన
హైదరాబాద్: స్వీయ నియంత్రణతోనే కరోనాను కట్టడి చేయగలమని గాంధీ ఆసుపత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివ ప్రసాద్ అన్నారు. బుధవారం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్య నిపుణులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ శివ ప్రసాద్ మాట్లాడతూ గత 2 / 3నెలల నుంచి ప్రపంచ వ్యాప్తంగా భయపెడుతున్న కరోనాను ప్రభుత్వం తీసుకున్న చర్యలతో చాలా వరకు కట్టడి చేయగలిగామని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ప్రజలలో శుభ్రత పట్ల చాలా అవగాహన వచ్చిందన్నారు. ప్రజలలో ఒక ధైర్యం వచ్చిందన్నారు. పాజిటివ్ కరోనా కేసులను గాంధీ ఆసుపత్రిలో ఉంచి మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు.
డ్రైఫ్రూట్స్ తో కూడిన బలవర్ధక ఆహారాన్ని అందించి రోగులలో రోగనిరోధక శక్తిని పెంచడం జరుగుతుందని అన్నారు.14 రోజుల పాటు ఆసుపత్రిలో వుండాలంటే భయపడే వారికి సైకాలజిస్ట్ ల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించి వారికి ధైర్యం చెప్పడం జరుగుతుందన్నారు. వ్యక్తిగత శుభ్రత, మాస్కు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడంతో వ్యాధి సోకకుండా చూసుకోవచ్చు అని అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ సడలించిన నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు. వ్యాపారస్థులు కూడా సానిటైజేషన్ చేస్తూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ, షాపులో పని చేసే వారిలో కూడా వ్యక్తిగత శుభ్రత పాటించేలా చూడాలన్నారు. ప్రజలు కరోనాతో సహజీవనం చేసే క్రమంలో నిబద్దతతో జాగ్రత్తలు పాటించాలన్నారు. స్వల్ప లక్షణాలు ఉన్న వారు ఇంట్లో ఉంటూ సరైన విశ్రాంతి తీసుకోవాలన్నారు. కోవిడ్ పొజిటివ్ వ్యక్తి ఇంట్లో ఉంటే వారిని చూసుకునే సంరక్షకుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
అపోలో ఆసుపత్రి పల్మనాలజిస్ట్ డాక్టర్ చైతన్య మాట్లాడుతూ లాక్ డౌన్ సడలించారని అనవసరంగా బయటకి వెళ్లవద్దు అని సూచించారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వయోవృద్దులు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి అన్నారు. బయట నుంచి తీసుకువచ్చిన ప్రతి వస్తువును 2- 3 రోజుల పాటు ఎండలో వాడాలని, కూరగాయలు అయితే ఉప్పు నీళ్లలో కడిగి వాడాలని సూచించారు. కరోనా నుండి కాపాడుకునే భాద్యత ప్రజల చేతులలోనే ఉందన్నారు. వీలైనంత వరకు డాక్టర్లను కలవాలంటే వీడియో లేదా టెలి కాన్ఫరెన్స్ ద్వారా కన్సల్డ్ కావాలని సూచన చేశారు. బయట ఆహారానికి స్వస్తి పలికి వీలైనంత వరకు ఇంట్లో వండిన పదార్థాలనే తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, జాయింట్ డైరెక్టర్ జగన్, సీ.ఐ.ఈ విజయ్ భాస్కర్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ యామిని తదితరులు పాల్గొన్నారు.