జాతీయ రహదారులకు సంబంధించిన ముందస్తు నిర్మాణ పనులను వేగవంతం చేయండి: తెలంగాణ సీఎస్ ఆదేశం
రాష్ట్రంలో జాతీయ రహదారులకు సంబంధించిన ముందస్తు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బిఆర్‌కెఆర్ భవన్‌లో ఉన్నత స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి యుటిలిటీ షిఫ్టింగ్, భూసేకరణ, అటవీ అనుమతులు తదితర విషయాలపై చర్చించారు. ఈ సందర్బంగా సీఎస్ మాట్లాడుతూ రోడ్ల నిర్మాణానికి సంబంధించి పెండింగ్ సమస్యలను జిల్లాల వారీగా తయారు చేయాలని, జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
రహదారులు నిర్ణీత సమయములో పూర్తయ్యేలా సమన్వయంతో పని చేయాలని ఆయన అధికారులను కోరారు. జాతీయ రహదారి ప్రాజెక్టులకు సంబంధించిన అటవీ, మెట్రో వాటర్ వర్క్స్, జిహెచ్‌ఎంసి, ట్రాన్స్ కో, మిషన్ భగీరథ విభాగాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యలను కమిటీ చర్చించింది.
ఈ సమావేశములో రవాణ, రోడ్డు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, పి.సి.సి.ఎఫ్ శోభ, ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, రీజనల్ అఫిసర్ రవి ప్రకాష్, నేషనల్ హైవేస్ ఆథారిటి ఆఫ్ ఇండియా అధికారి క్రిష్ణ ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.