స్వీయ నియంత్రణ, సామాజిక, భౌతిక దూరంతో కరోనాని ఎదుర్కొందాం: మంత్రి ఎర్రబెల్లి
- అల్లా దయ అందరి మీదా ఉండాలి
- కరోనా కష్టాలు త్వరగా తీరాలి
- అన్నదాతల జీవితాలు అద్భుతంగా సాగాలి
- తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామం కావాలి
- ముస్లీంలందరికీ రంజాన్ శుభాకాంక్షలు
- రాయపర్తి, పర్వతగిరిలో ముస్లీంలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రంజాన్ పవిత్ర మాసమన్నారు. ముస్లీంలంతా ఎంతో పవిత్రంగా ఉపవాస దీక్షలు పడతారని, సమాజమంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటారన్నారు. ఈసారి కరోనా కష్టకాలంలో రంజాన్ వచ్చిందన్నారు. అయితే, ముస్లీంలనే కాక అనేక మంది ప్రజలను ఆదుకోవడానికి తమ ఎర్రబెల్లి ట్రస్టుతోపాటు, అనేక సేవా సంస్థలు ముందకు వచ్చాయని అన్నారు. అలాంటి వాళ్ళందరి సహకారంతో పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ముస్లీం కుటుంబాలకు రంజాన్ పర్వదినం జరుపుకోవడానికి వీలైన వస్తువులతో కూడిన నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ముస్లీంలను ఆదుకోవడానికి ముందకు వచ్చిన కావేరి ఫౌండేషన్ ని మంత్రి అభినందించారు.
అల్లా దయ అందరిమీదా ఉండాలని కోరుకోవాలని ముస్లీంలకు మంత్రి ఎర్రబెల్లి సూచించారు. అంతేగాక కరోనా నుంచి ప్రజలు త్వరగా విముక్తి కావాలన్నారు. మంచి వర్షాలు పడి, అన్నదాతలు అద్భుతమైన పంటలు పండించి, రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండేలా చూడాలని అకాంక్షించారు. .
ఈ కార్యక్రమంలో కావేరీ భాస్కర్ రావుతోపాటు, స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లీంల కుటుంబాలు పాల్గొన్నాయి.