కూరగాయలను ఉప్పు నీటిలో కడిగి వాడుకోవడం ఉత్తమం: వైద్య నిపుణుల సూచన
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి, తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుసుకొని కచ్చితంగా పాటిస్తే కరోనాపై విజయాన్ని సాధించవచ్చు అని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సృజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనాపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్య నిపుణులు పాల్గొని మాట్లాడారు.
డాక్టర్ సృజన్ మాట్లాడుతూ సాధారణంగా 80- 85శాతం మందిలో జలుబు, తలనొప్పి, గొంతు నొప్పి వంటి లక్షణాలు వస్తాయని అవి చాలా వరకు తగ్గుముఖం పట్టడం జరుగుతుందన్నారు. తీవ్రస్థాయిలో ఉన్నవారికి శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గే అవకాశం ఉంటుందని అన్నారు. స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటే చాలా వరకు వైరస్ సోకకుండా చూసుకోవచ్చు అని అన్నారు. వీలు అయినంత వరకు ఇంట్లో వుంటూ, బయటకి వెళితే తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలన్నారు. చేతులను తప్పనిసరిగా ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రపరచడం అలవర్చుకోవాలన్నారు. తీవ్ర వ్యాధులతో బాధపడే వారు బయటకు వెళ్లకుండా, ఇంట్లోనే వుంటూ డాక్టర్ సలహా తీసుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతతో కరోనా బారిన పడకుండా ఉండవచ్చు అని అన్నారు. భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలన్నారు.
అపోలో మెడికల్ కాలేజ్ పల్మొనాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ జయశ్రీ మాట్లాడుతూ ఎన్ 95 మాస్కులు వైద్య సిబ్బందికి అవసరమని, సాధారణంగా ప్రజలు సర్జికల్ లేదా బట్ట మస్కులను ధరించవచ్చు అని అన్నారు. మాస్కులను ముట్టుకోకూడదని, అనివార్యంగా ముట్టుకుంటే చేతులను తప్పనిసరిగా శుభ్రపరచుకోవాలని సూచించారు. ఇంట్లో ఉండే తలపులు నాబ్స్, ఎలక్ట్రికల్ స్విచ్చులను విధిగా శుభ్రపరచాలన్నారు.
బయట నుండి తెచ్చిన సరుకులను 2- 3 రోజుల తర్వాత వాడుకోవాలన్నారు. కూరగాయలను ఉప్పు నీటిలో కడిగి వాడుకోవాలని ఆమె సూచించారు. బయట ఆహారాన్ని తీసుకోకుండా, ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. కోవిడ్ తో సహజీవనం చేయాలి కనుక ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. త్వరలో కొత్త మందులు రాబోతున్నాయని, దాదాపు అన్నీ ట్రయల్స్ దశలో ఉన్నాయని తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీ ప్రారంభమైందని తెలుపుతూ మైల్డ్ లక్షణాలు ఉన్న రోగులు హోమ్ ఐసోలేషన్ తో వ్యాధిని తగ్గించుకోవచ్చు అని అన్నారు.
ఈ సమావేశం లో అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, జాయింట్ డైరెక్టర్ జగన్, సి ఐ ఇ విజయభాస్కర్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ యామిని తదితరులు పాల్గొన్నారు.