బోడుప్పల్, పీర్జాదిగూడ కార్పొరేషన్లలో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్
హైదరాబాద్, మే 14: హైదరాబాద్ నగరానికి వచ్చే ట్రాఫిక్ రద్దీని తగ్గించుటకు ప్రధాన రోడ్లను కలుపుతూ లింక్ రోడ్లను నిర్మిస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి సి హెచ్ మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ లు తెలిపారు. గురువారం పీర్జాదిగూడ మేయర్ జక్కా. వెంకటరెడ్డి, బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, టౌన్ ప్లానింగ్, హెచ్ ఎం డి ఏ, హెచ్ ఆర్ డి సి ఎల్ అధికారులతో కలిసి పర్యటించారు. మిస్సింగ్ లింక్ రోడ్లు, రేడియల్ రోడ్ల ను పరిశీలించారు. ఉప్పల్ నల్లచెరువు నుండి బోడుప్పల్ వరకు లింక్ రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. పీర్జాదిగూడ - ఉప్పల్ భగాయత్ మార్గంలో మూసీ పక్క నుండి వెళ్లే రోడ్డుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు రైతులతో మాట్లాడాలని అధికారులకు మంత్రి సూచించారు. నాగోలు -బండ్లగూడ - పీర్జాదిగూడ లను కలుపుతూ రూ.20 కోట్లతో 4 కిలోమీటర్లు పొడవున విస్తరిస్తున్న లింక్ రోడ్, బ్రిడ్జి పనులను తనిఖీ చేశారు. రూ 3.5 కోట్లతో బతుకమ్మ ఘాట్ - బోడుప్పల్ మధ్య నిర్మిస్తున్న 1.2 కిలోమీటర్లు లింక్ రోడ్, చంగిచర్ల - చర్లపల్లి మధ్య 4 లేన్లతో విస్తరిస్తున్న రోడ్ లో పనులు నిలిచిన 500 మీటర్లు పొడవు భూమిని పరిశీలించి, భూ సేకరణ సమస్య ను పరిష్కరించారు. వెంటనే మార్కింగ్‌చేసి పనులను చేపట్టాలని హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సి.ఇ వసంతను ఆదేశించారు. ఈ పర్యటనలో టౌన్‌ప్లానింగ్ అడిషనల్ సిసిపి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
- చర్లపల్లి రైల్వే టర్మినల్ రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన మంత్రి మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్
- మంత్రి కె.టి.ఆర్ నిర్వహించిన సమావేశంలో చర్చకు వచ్చిన చర్లపల్లి రైల్వేస్టేషన్ రోడ్ల అభివృద్ది అంశం
మేడ్చల్ జిల్లా అభివృద్దికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. వెయ్యి కోట్లతో వరంగల్ రహదారిలో స్కైవేలు, ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో చర్లపల్లి రైల్వేస్టేషన్ కీలకంగా మారుతుందని తెలిపారు.
ఇటీవల జిహెచ్‌ఎంసిలో దక్షణ మధ్య రైల్వే అధికారులతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో చర్లపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ది, రోడ్ల విస్తరణ అంశం గురించి చర్చకు వచ్చినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ ఈ సందర్భంగా తెలిపారు. తదనుగుణంగా మంత్రి కె.టి.ఆర్ జారీచేసిన ఆదేశం మేరకు రోడ్ల విస్తరణ పనులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను జంక్షన్‌గా అభివృద్ది చేయడం వలన దూరప్రాంత రైళ్ల రాకపోకలు ఇక్కడి నుండే జరుగుతాయని తెలిపారు. తద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఎం.ఎం.టి.ఎస్ రైల్ కూడా చర్లపల్లి రైల్వే టర్మినల్ వరకు పొడిగించే అవకాశం ఉన్నదని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్దిని దృష్టిలో ఉంచుకొని హెచ్.ఎం.డి.ఏ, హెచ్.ఆర్.డి.సి.ఎల్, టౌన్‌ప్లానింగ్ విభాగాలు, రైల్వే అధికారులతో సమన్వయంతో పనిచేయనున్నట్లు తెలిపారు. భూసేకరణకు మూడింతలు టి.డి.ఆర్‌లను జారీచేయనున్నట్లు తెలిపారు.