కూలీలను, రైతులను ఆదుకోవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం: మంత్రి ఎర్రబెల్లి
- అందరికీ పని కల్పించడమే ధ్యేయం
- కొత్తగా జాబ్ కార్డులివ్వాలని అధికారులకు చెప్పాం
- కరోనా అంతమయ్యే వరకు స్వీయనియంత్రణ, సామాజిక, భౌతిక దూరం పాటించాలి
- పర్వతగిరిలో ఉపాధి హామీ కూలీలతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ, కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించాల్సి వచ్చిందని, దీంతో మొత్తం పనులన్నీ స్తంభించి, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతున్నదన్నారు. అయినప్పటికీ సీఎం కెసిఆర్ కూలీలకు ఉపాధి కల్పించాలని చూస్తున్నారన్నారు. అందుకే ఉపాధి కూలీ రేట్లను కూడా పెంచారన్నారు. అలాగే రైతాంగాన్ని ఆదుకోవాలని చూస్తున్నారని, ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నారని మంత్రి కూలీలకు తెలిపారు. కూలీలు, రైతులు బాగుంటే దేశం, రాష్ట్రం బాగుటుందని అన్నారు.
కొత్తగా వస్తున్న కూలీలకు కూడా జాబ్ కార్డులు జారీ చేయాలని ఆదేశించినట్లు మంత్రి కూలీలకు తెలిపారు. అందరికీ పని కల్పించాలని చెప్పారు. ఇక లాక్ డౌన్ సమయంలో స్వీయ నియంత్రణతో, సామాజిక, భౌతిక దూరం పాటిస్తూ పనులు చేయాలన్నారు. ఎండలు తక్కువగా ఉన్న సమయాల్లోనే పనులు చేపట్టాలని అక్కడున్న అధికారులను ఆదేశించారు.
విత్తనాల అమ్మకాలను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి:
తొర్రూరు (మహబూబాబాద్ జిల్లా), మే 13: జీలుగు విత్తనాలు వేసి భూసారాన్ని కాపాడాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులకు పిలుపునిచ్చారు. ఎరువులు, క్రిమి సంహారక మందులతో భూసారం తరుగుతుందన్నారు. భూసారాన్ని కాపాడాలంటే జీలుగుకంటే మెరుగైన సాధనం లేదన్నారు. అదిక దిగుబడులు రావాలన్నా, నాణ్యమైన పంటలు పండాలన్నా, జీలుగుని వాడాలని ఆయన అన్నారు. తొర్రూరులో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం లో జీలగు విత్తనాల అమ్మకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్, మండల రైతు బంధు కో ఆర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రామిని శ్రీనివాస్, కౌన్సిలర్లు శ్రీనివాస్, నట్వర్, రేవతి శంకర్, ప్రవీణ్ రాజు, సంపత్, ఎఓ కుమార్ యాదవ్ , ఎఇఓ, లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. పెద్ద వంగర వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద కూడా మంత్రి విత్తనాలను పంపిణీ చేశారు.
నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి:తొర్రూరు (మహబూబాబాద్ జిల్లా), మే 13: కష్ట కాలంలో దాతలు ముందుకు రావాలి. నిరుపేదలను ఆదుకోవడంలో ముందుండాలి. మనమంతా ఒకరికొకరు అండగా నిలవాలి. కరోనా కట్టడి అయ్యే వరకు పకడ్బందీగా లాక్ డౌన్ ని పాటించాలి. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ లో ఉత్సవ కల్చరల్ అండ్ డెవలప్మెంట్ వారి అధ్వర్యం లో 800 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కరోనా మహమ్మారి దేశాలను, ప్రజలను, ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసిందన్నారు. ఈ దశలో నిరుపేద ప్రజలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. కరోనా కష్టకాలంలో సిఎం కెసిఆర్ ప్రజల క్షేమాన్ని, సంక్షేమాన్ని వీడటం లేదని, కెసిఆర్ స్ఫూర్తిగా దాతలు ముందుకు రావాలన్నారు. ఒక్కొక్కరు కలిసి అందరినీ ఆదుకోవాలని ఆయన కోరారు. కరోనా అంతమయ్యే వరకు ప్రజలు లాక్ డౌన్ ని పాటించాలని, సామాజిక, భౌతిక దూరంతో స్వీయ నియంత్రణతోనే కరోనాని ఎదుర్కోవాలని మంత్రి తెలిపారు. ప్రజలంతా జాగ్రత్త వహించాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన వెసలుబాటుని దుర్వినియోగం చేయొద్దని, చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సోమేశ్వరరావుతోపాటు, స్థానిక ప్రజాప్రతినిధులు, నిరుపేదలు పాల్గొన్నారు.
గంట్లకుంట (పెద్దవంగర-మహబూబాబాద్ జిల్లా), మే 13: పలువురు దాతల సహకారంతో మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం గంట్లకుంట గ్రామంలో నిరుపేద కుటుంబాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దాతలను అభినందించారు. నిరుపేదలను ఆదుకోవడానికి అనేక మంది ముందుకు వస్తున్నారని చెప్పారు. కరోనా అంతమయ్యే వరకు ప్రజలంతా సంయమనం పాటించాలని కోరారు. కెసిఆర్ చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రైతాంగానికి సీఎం చేసినంతగా చరిత్రలో ఎవరూ చేయలేదన్నారు. ప్రజలంతా సిఎం కెసిఆర్ కి, ప్రభుత్వానికి అండగా నిలిచి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నిరుపేదలు, దాతలు పాల్గొన్నారు.