చేతులను విధిగా 40 సెకన్ల పాటు కడుక్కోవడం అలవర్చుకోవాలి: ఉస్మానియా ఆసుపత్రి వైద్య నిపుణులు
హైదరాబాద్: రాష్ట్రంలో గత రెండు మాసాలుగా కరోనా వైరస్ విస్తరిస్తూ ప్రస్తుతం 1300 కేసులకు చేరువలో వుండగా, అందులో 400 కేసులు ఆక్టివ్ గా ఉన్నాయని ఉస్మానియా ఆసుపత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కొండల్ రెడ్డి తెలిపారు. కరోనాపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు బుధవారం రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్య నిపుణులు పాల్గొని మాట్లాడారు.
డాక్టర్ కొండల రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు ఆసుపత్రులలో కరోనా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాధి గ్రస్తులకు ఇస్తున్న వైద్యం సత్ఫలితాలను ఇస్తుందన్నారు. గాంధీ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో కరోనా వ్యాధికి చికిత్సలు చేయడం జరుగుతుందని అందులో భాగంగా ప్లాస్మా థెరపీ కూడ ప్రారంభమైందని అన్నారు.
ప్రతి ఒక్కరు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మాస్కు ను తప్పనిసరిగా ధరించాలన్నారు. చేతులను విధిగా 40 సెకన్ల పాటు కడుక్కోవడం అలవర్చుకోవాలన్నారు. ఒక వ్యక్తి మాస్క్ ను ధరించి, మాస్కు ధరించని వ్యక్తికి దగ్గరగా వెళ్ళితే వైరస్ సోకే అవకాశం ఉందన్నారు. జ్వరము, దగ్గు, ఆయాసం లాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ సలహా, సూచనలు తప్పక తీసుకోవాలని సూచించారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను వైద్యుల సలహా మేరకే తీసుకోవాలన్నారు.
లాక్ డౌన్ ఎత్తి వేసాక కూడ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ, వ్యక్తిగత శుభ్రతను పాటించాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవారు తగు జాగ్రతలు తీసుకోవాలన్నారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు విటమిన్ సి, డి,జింక్, ప్రోటీన్స్ అధికంగావున్న ఆహారాన్నితీసుకోవాలన్నారు. వీటితో పాటు విధిగా కనీసం అర్ధగంట పాటు వ్యాయామం చేయాలని సూచించారు.
అపోలో ఆసుపత్రి కన్సల్టెంట్ పల్మొనాలజిస్ట్ డాక్టర్ దివ్యేష్ వాఘ్రే మాట్లాడుతూ కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 40లక్షలు కాగా రాష్ట్రంలో 1300 కేసులు చేరువలో ఉందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్నచర్యలు, ప్రజల సహకారంతో వ్యాధి వ్యాప్తిని కట్టడి చేయగలుగుతున్నామన్నారు. ఆర్ధిక లావాదేవీలు పుంజుకోవడం కోసం లాక్ డౌన్ ను ప్రభుత్వం దశల వారీగా తీసివేస్తే, అప్పుడు కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ, చేతులని శుభ్రపరచుకోవాలన్నారు.
గుండె, ఊపిరితిత్తులు వంటి దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడే వారు తగిన జాగ్రత్త వహించాలని సూచించారు.వీరు అత్యవసరం గా బయటికి వెళ్ళవలసి వస్తే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రపంచ వ్యాప్తం గా వైరస్ ను నిరోధించడానికి వాక్సిన్ తయారీ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉందన్నారు.
ఈ సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, జాయింట్ డైరెక్టర్ జగన్, సి ఐ ఇ విజయభాస్కర్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ యామిని తదితరులు పాల్గొన్నారు.