కరోనా పాజిటివ్ కేసులు అధికారికంగా ప్రకటిస్తున్న వాటి కంటే ఎక్కువే ఉంటాయి: పవన్ కల్యాణ్
- తమిళనాడు సరిహద్దుగా ఉన్న జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి
- సోషల్ డిస్టెన్స్, మాస్కులనేవి మనం పాటించాల్సిన నిబంధనల్లో భాగం కావచ్చు
- కరోనా ప్రభావంతో నష్టపోతున్న రంగాలు, వృత్తులపై సానుభూతితో అండనివ్వాలి
- చిన్నపాటి జీవితాలకు భరోసా అవసరం
- జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజా పక్షమే... ప్రజా సమస్యలపై బలంగా మాట్లాడతాం
- నెల్లూరు జిల్లా నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “కరోనా ఎక్కువ కాలం ఉండే ఆరోగ్య సంబంధిత సమస్య అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ఈ సమస్య అదుపులోకి వచ్చేందుకు రెండున్నర సంవత్సరాలు పట్టవచ్చని నిపుణుల వ్యాసాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ దేశానికీ దేశానికీ రూపం మార్చుకొంటోంది... కాబట్టి ఒకే వ్యాక్సిన్ తో కాకపోవచ్చు... వైరస్ రూపానికి తగ్గ విధంగా వ్యాక్సిన్లు తీసుకురావాల్సి ఉంటుందని ఫార్మా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకూ సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్కులు ధరించడం లాంటివి చేయాలి. ఇవి మనం పాటించే నిబంధనల్లో భాగంగా మారవచ్చు.
కరోనా ప్రభావం, లాక్ డౌన్ వల్ల పలు రంగాలు దెబ్బ తిని, నష్టపోయాయి. వివిధ వృత్తుల్లో ఉన్నవారు ఆర్థికంగా సమస్యల్లో ఉన్నారు. వాటి పట్ల ప్రభుత్వం సానుభూతితో స్పందించి సహకారం అందించాలి. నెల్లూరు జిల్లాలో స్వర్ణకారులు, చేనేత వృత్తిలో ఉన్నవారు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. చేతి వృత్తులు, కుల వృత్తుల్లో ఉన్న వారికీ భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలో వరి, నిమ్మ రైతులు, ఆక్వా రంగంలో ఉన్న వారు దెబ్బ తిన్నారు. వీరందరి సమస్యలు నా దృష్టికి వచ్చాయి. ఎప్పటికప్పుడు స్పందిస్తున్నాం. ప్రతి రంగం ఏ విధంగా ప్రభావితమైంది, ఉపాధికి గండిపడిందీ అనే విషయాలపై సమగ్రంగా నివేదిక సిద్ధం చేస్తున్నాం.
నెల్లూరు జిల్లాలో జనసేన నాయకులు, శ్రేణులు ఆపదలో ఉన్న వారికి చేస్తున్న సేవలు అభినందనీయం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా నిలవాలి అన్నది మన పార్టీ విధానం. అందుకు అనుగుణంగా మీరంతా పని చేస్తున్నారు. జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజా పక్షమే. వారికే సమస్య వచ్చినా అండగా నిలిచి అది పరిష్కారం అయ్యే వరకూ బలంగా మాట్లాడతాం” అన్నారు.
అధికార పక్షం తీరుని ప్రజలు గమనిస్తున్నారు: నాదెండ్ల మనోహర్
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “రాష్ట్రంలో మొదటి కరోనా కేసు నమోదైంది నెల్లూరు జిల్లాలోనే. ఇక్కడ కేసులు సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు జిల్లా పొరుగున ఉన్న తమిళనాడులో వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి తరుణంలో జనసేన బలంగా ప్రజలకు సేవలు అందిస్తోంది. అధికార పక్షం వారు ఈ విపత్కర సమయంలో వ్యవహరిస్తున్న తీరుని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజా ప్రతినిధుల వ్యవహారం, ప్రజల ఇబ్బందులు, స్థానిక సమస్యలపై మన పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు స్పందించండి. ప్రజలకు మేలు జరిగే విధంగా పని చేయాలి” అని చెప్పారు.
నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు ఉన్న తీరు, నియంత్రణలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, రైతాంగం బాధలపై నాయకులు వివరించారు. పార్టీ పి.ఎ.సి. సభ్యుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ “కేంద్రం ప్రకటించిన రెడ్ జోన్ జిల్లాల్లో నెల్లూరు కూడా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి ఆగలేదు. రెడ్ జోన్ లో కూడా నిబంధనలు అమలు చేయడం లేదు. ప్రజలు ఇంత ఇబ్బందికరం పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతులు ఇవ్వడం అందరినీ మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా మహిళలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పలుచోట్ల మహిళలు, స్థానికులు మద్యం అమ్మకాలు ఆపాలని ధర్నాలు చేసినా పట్టించుకోలేదు. విచ్చలవిడిగా అమ్ముతున్నారుగానీ ఒక్క చోట కూడా డీ అడిక్షన్ సెంటర్ తెరవలేదు. అధికార పార్టీ నేతలు నిబంధనలు పాటించడం లేదు. జిల్లా అధికారులను బెదిరించే విధంగా మాట్లాడుతున్నారు” అన్నారు.
కావలి నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ అలహరి సుధాకర్ మాట్లాడుతూ “ఈ జిల్లాలో ఆక్వా రంగం మీద ఆధారపడ్డవారు నష్టాల్లో ఉన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అమ్ముకుందామన్నా దళారులు ప్రవేశిస్తున్నారు. రైతుల వాహనాలు అడ్డగిస్తున్న పోలీసులు దళారుల వాహనాలు మాత్రం విడిచిపెడుతున్నారు” అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ నలిసెట్టి శ్రీధర్ మాట్లాడుతూ “పంటలు బాగా పండినా మార్కెట్ లేకపోవడం, ధరలు దక్కకపోవడం రైతులు అన్ని విధాలా నష్టపోయారు. ఈ ప్రాంతంలో నిమ్మ పంట ఎక్కువ. ధర లేకపోవడంతో రైతులు చెట్టు నుంచి కాయలు కోయకుండా వదిలిపెట్టే పరిస్థితి వచ్చింది” అని తెలిపారు.
నెల్లూరు నగర పార్టీ నాయకుడు కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ “కరోనా పరీక్షల కోసం తీసుకువచ్చిన పరికరాలకు కూడా వినియోగించకుండా పక్కన పెట్టేశారు. అవసరమైన ల్యాబ్ టెక్నీషియన్స్ లేకపోవడం ఓ సమస్యగా మారింది. వేల కొద్దీ వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఇందులో 3 వేలు ఆటోలు ఉన్నాయి. వీటి మీద ఆధాపడేవారు భారీ జరిమానాలు చెల్లించే పరిస్థితి లేదు” అన్నారు.
సూళ్ళూరుపేట నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడుతూ “ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువ. ఇక్కడికి ఉద్యోగులు శ్రీకాళహస్తి ప్రాంతం నుంచీ వస్తూ ఉంటారు. రెడ్ జోన్ పరిధిలో ఉన్నవారు ఇక్కడికి రావడంతో స్థానికుల్లో ఆందోళన పెరుగుతోంది. మద్యం దుకాణాలు తెరవడంతో పొరుగున ఉన్న తమిళనాడు నుంచీ భారీగా వచ్చారు. భౌతిక దూరం అనేది ఎవరూ పాటించడం లేదు. అధికారులు దీనిపై దృష్టి పెట్టడం లేదు” అన్నారు. పార్టీ నేతలు జి.శ్రీకాంత్, టోనీ, కృష్ణవేణి, జి.వెంకటేశ్వర్లు తదితరులు జిల్లాలో పరిస్థితిని వివరించారు.