గడ్డపార పట్టి ఉపాధి హామీ పనులు చేసిన తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి
పర్వతగిరి, రాయపర్తి (వరంగల్ రూరల్ జిల్లా), మే 8: క్లాస్ కి క్లాస్.. మాస్ కి మాస్.. తన రూటే సెపరేటు అని మరోసారి నిరూపించారు తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కూలీలతో కూలిగా.. జాలీగా.. గడ్డపార పట్టి, మట్టిని పెకిలించి, పెళ్ళలు తీసి ఉపాధి హామీ పనులు చేశారు. మరోవైపు కూలీలకు మాస్కులు పంపిణీ చేసి, సామాజిక, భౌతిక దూరం పాటించాలని, కరోనా నుంచి కాపాడుకోవాలని ఉద్బోధించారు.
పనులు బాగా నడుస్తున్నాయా? పని దినాలు కలుగుతున్నాయా? అంటూ ఆరా తీశారు. కూలీలందరికీ పని కల్పించాలన్నదే ప్రభుత్వ సంకల్పం, అందుకే ఈ కరోనా కష్ట కాలంలోనూ, ఆర్థిక సంక్షోభంలోనూ సీఎం కేసీఆర్ రూ.170 కోట్లు విడుదల చేశారని కూలీలకు భరోసా కల్పించారు. ఈ కరోనా వైరస్ నేపథ్యంలో పట్టణాలు, నగరాల నుంచి గ్రామాలకు చేరిన వాళ్ళకు కూడా పనులు కల్పించే బాధ్యతని ప్రభుత్వం తీసుకుందని చెప్పి, అందరికీ పని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంకోవైపు రాయపర్తి నర్సరీని ఆకస్మికంగా సందర్శించి, తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ తో వచ్చిన నీటిని మొక్కలకు పట్టి, అక్కడి కూలీలు, అధికారులను ఆశ్చర్య పరిచారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి జన నేతగా, జనంలోకి చొచ్చుకుని పోయే నేతగా మంచి పేరుంది. ఆ పేరుకు తగ్గట్లుగానే అవకాశం చిక్కితే చాలు జనంతో ఇట్టే కలిసిపోతారు. వాళ్ళల్లో ఒకడిగా మారిపోతారు. శుక్రవారం వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తిలో నిర్వహించే రక్తదాన శిబిరానికి హాజరవడానికి బయలుదేరారు. పర్వతగిరిలోని ఆవు కుంటలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. దాదాపు 500 మంది పనులు చేస్తున్నారు. వెంటనే కారు ఆపి, ఆ కూలీల దగ్గరకు దూసుకపోయారు. వాళ్ళతో మాట కలిపారు. పనులు ఎలా జరుగుతున్నాయి? ఏయే పనులు చేస్తున్నారు? కూలీ ఎంత గిడుతున్నది? సామాజిక దూరం పాటిస్తున్నారా? మాస్కులు ధరిస్తున్నారా? అంటూ ఆరా తీశారు. వెంటనే తన వద్ద ఉన్న మాస్కులను అక్కడి కూలీలకు తానే స్వయంగా పంపిణీ చేశారు. గడ్డపార పట్టి మట్టిని పెకిలించారు. ఆ మట్టి పెల్లలని తొలగించారు. కాసేపటి తర్వాత అక్కడే ఉన్న మట్టి మీదే కూర్చున్నారు. ఉపాధి కూలీలతో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ ప్రతి ఒక్కరికీ పని కల్పించాలనే లక్ష్యంతో ఉన్నారని మంత్రి ఎర్రబెల్లి కూలీలకు చెప్పారు. నగరాలు, పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా కూలీ పనులు చేసుకునే విధంగా, ఉపాధి కూలీల నమోదు చేపడతామన్నారు. అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, అలాగే కూలీల పనుల కోసం ఇప్పటికే సీఎం కేసీఆర్ రూ.170 కోట్లను విడుదల చేశారని చెప్పారు. అయితే కూలీలు తమకు భవిష్యత్తులోనూ ఉపయోగపడే విధంగా వ్యవసాయానుబంధ పనులు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్, తాను కూడా కేంద్రానికి పదే పదే విన్నవిస్తున్నామని చెప్పారు. ఉపాధి హామీ పనులను వ్యవసాయనుబంధంగా మార్చాలని చెప్పామన్నారు. అనేక చోట్ల ఉపాధి హామీ పనుల్లో భాగంగా కాలువల పనులు చేసుకుంటున్నారని చెప్పారు.
- రాష్ట్రంలోని 2,438 నర్సరీల ద్వారా 22 కోట్ల మొక్కలు
- అటవీశాఖ ద్వారా ఉపాధి హామీ కింద మరో 3కోట్ల మొక్కలు