వైరస్ సోకిన ప్రతి వందమందిలో తొంభై శాతం మందికి ప్రమాదం ఏమి ఉండదు: గాంధీ వైద్య నిపుణులు

Related image

హైదరాబాద్: ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా వైరస్ ను నిర్మూలించవచ్చని గాంధీ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ.మాధవ్ అన్నారు. శుక్రవారం నాడు సమచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ అన్ని వైరస్ లాంటిదేనని, వైరస్ సోకిన ప్రతి వందమందిలో తొంభై శాతం మందికి ప్రమాదం ఏమి ఉండదని స్పష్టం చేశారు.

చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు వైరస్ సోకిన ప్పుడు వీరికి ప్రమాదం పొంచి ఉంటుందని, వీరు డాక్టర్ల సూచనలు, సలహాలు తప్పక పాటించాలని తెలిపారు. వైరస్ సోకినప్పుడు ప్రధానంగా జ్వరం, పొడిదగ్గు,ఆయాసం ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి,శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు రావచ్చని తెలిపారు. ఈ వ్యాధి వచ్చినప్పుడు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్ కు ప్రతి స్పందించటం వలన జ్వరం, నలతగా ఉన్నట్లు అనిపిస్తుందని తెలిపారు. కొందరిలో దగ్గు వస్తుందని అన్నారు. మనం ఈ వైరస్ ను శ్వాస లోకి పీల్చినపుడు లేదా ఈ వైరస్ తో  కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకుని, అవే చేతులతో మన ముఖాన్ని ముట్టుకున్నపుడు కళ్ళు, ముక్కు, నోటి ద్వారా ఇది మన శరీరంలోకి ప్రవేశిస్తుందన్నారు. ఈ లక్షణాలతో బాధపడుతున్న వారు హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి, చెస్ట్ ఆస్పత్రి, కింగ్ కోఠి ఆస్పత్రులకు వెళ్ళితే వైద్యులు తగిన వైద్య సహాయం అందిస్తారని అన్నారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనాను అరికట్టవచ్చని అన్నారు.

గాంధీ ఆస్పత్రి వైద్యులు కరోనా కట్టడికి తీవ్రంగా శ్రమిస్తున్నారని అన్నారు. ప్రతిఒక్కరూ మాస్క్ లను ధరించాలనీ,వీలైనన్ని సార్లు చేతులు శుభ్రంగా కడగాలని అన్నారు. పండ్లు, కూరగాయలను శుభ్రం చేసిన అనంతరమే వాడాలని, వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని అన్నారు. శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా  చూసుకోవాలని,రోగ నిరోధక శక్తి ని పెంచే పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు. ఆరోగ్య పరంగా ప్రజలు సమిష్టిగా కృషి చేస్తూ, పలు జాగ్రత్తలతో దినచర్య గడిపితే కరోనా బారిన పడకుండా ఉంటామని అన్నారు.

ఈ సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, సీఐఇ విజయ్ భాస్కర్ రెడ్డి, డీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

More Press Releases