సామాజిక దూరం పాటించడం ద్వారానే కరోనా వైరస్ ను నివారించవచ్చు: గాంధీ ఆస్పత్రి వైద్య నిపుణులు
హైదరాబాద్: కరోనా వైరస్ నివారణకు మందు లేదని, సామాజిక దూరం పాటించడం ద్వారానే కరోనా వైరస్ ను నివారించవచ్చని గాంధీ ఆస్పత్రి వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. బుధవారం నాడు సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్య నిపుణులు గాంధీ ఆస్పత్రి వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్, అపోలో ఆసుపత్రి కన్సల్టెంట్ డాక్టర్ సాయి రెడ్డిలు సంయుక్తంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తుందని, అగ్ర దేశాలు కూడా వ్యాధి బారిన పడుతున్నాయని అన్నారు. ప్రజలు ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ను గౌరవించాలని అన్నారు. పరిస్థితి అర్థం చేసుకుని ప్రజలు వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. బయటకు వెళ్లాల్సి వస్తే తప్పక సామాజిక దూరం పాటించాలన్నారు. ప్రజలు సహకరించాలనీ, కరోనా వ్యాప్తి నివారణ అన్నది కేవలం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల మాత్రమే సాధ్యం కాదనీ, ఆ నిర్ణయాలను ప్రజలు తు.చ. తప్పకుండా పాటించడం వల్ల మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజలు గతంలో కంటే మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయని అన్నారు.
తలనొప్పి, జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటె కరోనా వైరస్ సోకినట్టుగా నిర్ధారించడానికి డాక్టర్ ను సంప్రదించాలన్నారు. అలానే జ్వరం తలనొప్పి కూడా వస్తాయని, అదే విధంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తుంటాయని అన్నారు. ఈ లక్షణాలు ఉంటె వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. వైరస్ కు వాక్సిన్ ప్రయోగ దశలో ఉన్నాయని, ప్రస్తుతం ఐసీయంఆర్ సూచనల ప్రకారం బాధితులకు వైద్యం అందిస్తున్నామని అన్నారు. గాంధీ ఆస్పత్రి కరోనా బాధితులకు పకడ్బందీ చికిత్స అందిస్తున్నారని, ప్రతి రోజు 30 నుంచి 40 మంది డిశ్చార్జ్ అవుతున్నారని వివరించారు.
యశోద ఆసుపత్రి పల్మనాలజిస్ట్ డాక్టర్ సాయి రెడ్డి మాట్లాడుతూ అతిగా భయపడవలసిన అవసరం లేదని, అదే విధంగా అతి నిర్లక్ష్యం కూడా మంచిది కాదన్నారు. వాక్సినేషన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతోంది అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలందరు సమిష్టిగా ప్రభుత్వం చేపట్టె చర్యలకు కచ్చితంగా అమలు అయ్యేలా సహకరించాలన్నారు. స్వీయ నియంత్రణ, భౌతిక దూరాన్ని పాటిస్తూ చేతులను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలని సూచించారు.
అత్యవసరంగా బయటి వెళ్ళవలసి వస్తే మాస్క్ ను ధరించాలన్నారు. అన్ని గొంతు నొప్పులు, జలుబు కరోన అని భయపడవలసిన అవసరం లేదని ఏడాదిలో రెండు సార్లు ఇటువంటి లక్షణాలు సర్వసాధారణంగా వస్తాయన్నారు. ఒక వేళ లక్షణాలు ఎక్కువైతే డాక్టర్ ను సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను తప్పకుండా అధిగమించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, జాయింట్ డైరెక్టర్ జగన్, సీఐఇ విజయ్ భాస్కర్ రెడ్డి ఏడి యామిని,తదితరులు పాల్గొన్నారు.