ప్రజా సమస్యలు.. ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడితే నియంతృత్వ ధోరణితో కేసులు పెడుతున్నారు: నాదెండ్ల మనోహర్
- జనసేన ఎప్పుడూ ప్రజాపక్షమే... నిర్మాణాత్మకంగా సమస్యలను వెల్లడిద్దాం
- కరోనా సమయంలో ఎంతో సేవ చేస్తున్న వైద్య, పోలీస్, రెవెన్యూ.. ఇతర శాఖ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించారు
- చేనేత, చేతి వృత్తులు వారు ఉపాధి కోల్పోయారు
- పార్టీ ముఖ్య నాయకులతో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
శనివారం సాయంత్రం పార్టీ ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, ముఖ్య నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని పరిస్థితిపై నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో ప్రజలకు పార్టీ తరఫున అందించాల్సిన భరోసా, రెడ్ జోన్లో ఉన్నవారికి అండగా నిలవడం, ప్రజా సమస్యలు, రైతాంగం పరిస్థితి, చేనేత రంగంపై ఆధారపడ్డ వారు చేతివృత్తుల వారు పరిస్థితి, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “మన అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారు కోవిడ్-19 వల్ల ఉత్పన్నమైన విపత్కర పరిస్థితుల్లో రాజకీయాల కంటే ప్రజలకు బాసటగా నిలవడమే ముఖ్యం అని స్పష్టంగా చెప్పారు. ఈ మాటను మన నాయకులు, శ్రేణులు అనుసరిస్తున్నారు. కరోనా వ్యాప్తి రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ సమయంలో ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో అందరూ చూస్తున్నారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రోజురోజుకీ కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు ఆందోళనలో ఉన్నారు. అక్కడి కోవిడ్ ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి మన నాయకులు అధ్యక్షుల వారి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే లాక్ డౌన్ మూలంగా పేద వర్గాలు ఎన్నో ఇబ్బందులుపడుతున్నాయి. రైతులు తమ పంటలు అమ్ముకోలేకపోతున్నారు. అకాల వర్షాలతో మరింత నష్టపోయారు. చేతి వృత్తులవారు ఉపాధి కోల్పోయారు.
చేనేత రంగంపై ఆధారపడి రెండున్నర లక్షల కుటుంబాలు ఉన్నాయి. వారికీ పని లేకుండా పోయింది. ఇలా ప్రతి వర్గం సమస్యలను ఎదుర్కొంటోంది. మన జనసేన ఎప్పుడూ ప్రజల పక్షమే. వారి సమస్యలపై, ప్రభుత్వ పాలనలో లోపాలపై ఎప్పుడూ నిర్మాణాత్మకంగానే మాట్లాడాలి. ఆ దిశగా బలంగా మాట్లాడి ప్రజలకు మేలు జరిగేలా ముందుకు వెళ్దాం.
మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా చేసే నిర్మాణాత్మక విమర్శను పాలకులు గ్రహించాలి. ఇష్టానుసారం కేసులు పెట్టడం సరికాదు. ఇలాంటి సమయంలో రాజకీయాలే ప్రధానం అనేలా కక్ష సాధింపుతో వ్యవహరించడం తగదు. కర్నూలులో కరోనా వ్యాప్తి రోజురోజుకీ పెరిగిపోతుంటే - పార్టీ అధికార ప్రతినిధిపై ఎఫ్.ఐ.ఆర్. ఉంది అంటూ అక్కడి పోలీసులు హైదరాబాద్ వచ్చారు. అంటే ప్రభుత్వం ధోరణి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కరోనా భయపెడుతున్నా ఎంతో బాధ్యతతో వైద్య, పోలీస్, రెవెన్యూ, మునిసిపల్.. ఇలా పలు శాఖల ఉద్యోగులు ముందుకు వెళ్లి సేవలు చేస్తుంటే వారి జీతాల్లో కోతలు విధించింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే పెన్షన్ మీద ఆధారపడ్డ వారికీ కోత వేశారు. ఇళ్ల స్థలాలకు భూముల సేకరణ పేరుతో సాగిస్తున్న వ్యవహారాలు, ఇసుక అక్రమ రవాణా విషయాలు మన అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారి దృష్టికి చేరాయి. రాజధాని రైతులకు రావాల్సిన వార్షిక కౌలు, భూమిలేని పేదలకి పెన్షన్లలో జాప్యంపై స్పందించారు. ప్రతి సమస్యపై జనసేన గళం వినిపిస్తుంది” అన్నారు.
ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పార్టీ ప్రధాన కార్యదర్శులు టి.శివశంకర్, సత్య బొలిశెట్టి, కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాస్, పి.ఎ.సి. సభ్యులు కందుల దుర్గేష్, పంతం నానాజీ, చిలకం మధుసూదన్ రెడ్డి, మనుక్రాంత్ రెడ్డి, పాలవలస యశస్వి, అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.