హైదరాబాద్ లో విస్తృతంగా పర్యటించిన కేంద్ర బృందం
హైదరాబాద్, ఏప్రిల్ 30: జలశక్తి విభాగం అదనపు కార్యదర్శి అరుణ్ భరోక నేతృత్వంలోని కేంద్ర బృందం గురువారం నగరంలో విస్తృతంగా పర్యటించింది. కోఠి మెటర్నటీ ఆసుపత్రిని సందర్శించి అక్కడ చికిత్సకై వచ్చిన పేషెంట్లతో మాట్లాడారు. లాక్‌డౌన్ నేపథ్యంలో అందిస్తున్న మెటర్నటి సేవల గురించి వైద్యాధికారులు, సిబ్బందిని వాకబ్ చేశారు. అనంతరం ఎల్బీనగర్ జోన్‌లో ఉన్న ఉప్పల్ నైట్ షెల్టర్‌ను, మార్కెట్‌ను సందర్శించారు. నిత్యావసరాల రవాణాకు ప్రభుత్వపరంగా అందుతున్న సహకారం గురించి వాకబ్ చేశారు.
అదే విధంగా చింతల్‌కుంట కంటైన్‌మెంట్ జోన్‌ను తనిఖీచేసి, కోవిడ్-19 నివారణకు చేపట్టిన చర్యలు, కంటైన్‌మెంట్ జోన్‌లో ఉన్న కుటుంబాలకు అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. తదుపరి ఫీవర్ హాస్పిటల్‌ను సందర్శించారు. ఈ బృందంలో కేంద్ర ప్రజారోగ్యశాఖ సీనియర్ వైద్యులు డా.చంద్రశేఖర్ గెడం, జాతీయ పోషకాహర సంస్థ డైరెక్టర్ డా.హేమలత, వినియోగదారుల వ్యవహారాల శాఖ డైరెక్టర్ ఎస్.ఎస్.ఠాకూర్, జాతీయ విపత్తు నివారణ సంస్థ అసోసియేట్ ప్రొఫెసర్ శేఖర్ చతుర్వేదిలు ఉన్నారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్లు డా.ఎన్.రవికిరణ్, బి.శ్రీనివాస్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, ఆయా ప్రాంతాల డిప్యూటి కమిషనర్లు పాల్గొన్నారు.