ప్రతి ఒక్కరికి బియ్యం అందేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలి: మంత్రి తలసాని
హైదరాబాద్ నగరంలో ప్రతి ఒక్కరికి బియ్యం అందేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని తెలంగాణ పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. సమాచార శాఖ కమిషనర్ కార్యాలయంలో మున్సిపల్ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ అద్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి హైదరాబాద్ నగరంలో జరుగుతున్న రేషన్ కార్డు దారులకు బియ్యం పంపిణీ, అన్నపూర్ణ పథకం అమలు, వలస కూలీలకు బియ్యం సరఫరా తదితర కార్యక్రమాలపై సమీక్షించారు.
హైదరాబాద్ మేయర్ బొంతు రాంమోహన్, సివిల్ సప్లయ్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ghmc కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతి, CRO బాల మాయాదేవి లు ఈ సమావేశంలో పాల్గొనగా, మేడ్చల్ వెంకటేశ్వర్లు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు అమయ్ కుమార్ లు టెలి కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రధానంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి 5.54 లక్షల తెల్ల రేషన్ కార్డు దారులకు బియ్యం సరఫరా పూర్తయిందని, ప్రభుత్వం చెల్లిస్తున్న 15౦౦ రూపాయల నగదు ఖాతాల లో జమ చేసే కార్యక్రమం పూర్తయిందని CRO వెల్లడించారు.
కొన్ని ప్రాంతాలలో వలస కార్మికులకు బియ్యం సరఫరా అందలేదని, ఆయా mla లు, కార్పోరేటర్ల ద్వారా పిర్యాదులు అందుతున్నాయని మంత్రి కలెక్టర్ల దృష్టికి తీసుకొచ్చారు. ఈ నెల ముగిసేందుకు మరో ౩ రోజుల గడువు ఉన్నందున ఆయా mla ల తో సంప్రదింపులు జరిపి బియ్యం పంపిణీ అందరికీ సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆకలి తీర్చే బాద్యతను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తన భుజ స్కంధాలపై వేసుకొని ప్రతి కార్యక్రమాన్ని ఆయనే రూపొందిస్తున్నారని, అందులో భాగంగానే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బీహార్, తమిళనాడు, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వలస కూలీలకు ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం, 500 రూపాయల నగదు అందించే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇటీవల తాను, హోం మంత్రి శ్రీ మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి శ్రీ మల్లారెడ్డి, నగర మేయర్ కలిసి నగరంలోని mlc లు, mla ల సమావేశం నిర్వహించడం జరిగిందని ఆయన కలెక్టర్ల కు వివరించారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులలోని ప్రాంతాలలో బియ్యం పంపిణీ లో కొంత సమన్వయ లోపం ఏర్పడిందని, ఈ విషయాన్ని గమనించి మే నెలలో జరిగే బియ్యం పంపిణీ కార్యక్రమంలో రెవెన్యు, ghmc అధికారులు సమన్వయంతో వ్యవహరించి ప్రతి కార్మికుడికి ప్రభుత్వ ఫలం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మున్సిపల్ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు చొరవతో నగరంలో ఉంటున్నటువంటి దాదాపు 41 వేల మంది భవన నిర్మాణ కార్మికులకు క్రేదాయ్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు.
నగరంలో ఉన్నటువంటి కంటైన్ మెంట్ ప్రాంతాలలోని ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని ghmc కమిషనర్ కు సూచించారు. ఆయా ప్రాంతాలలో వైద్య బృందం ప్రతి ఇంటికి వెళ్లి స్థానికుల ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, అంతేకాకుండా అవసరమైన ప్రాంతాలలో స్ప్రే చేసే కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు. మే 7 వ తేదీ వరకు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విదించి నందున వచ్చే నెలలో కూడా ఈ యొక్క బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి ఇదివరకే ప్రకటించి ఉన్నందున వచ్చే నెల కార్యక్రమాల అమలు పై ముందుగానే సమగ్రమైన నివేదికను రూపొందించుకోవాలని కలెక్టర్లకు సూచించారు.