సికింద్రాబాద్ జోన్‌లో పర్యటించిన మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్
- రోడ్లపై ఉన్న 300 మంది వలస కూలీలను గుర్తించి పునరావాస కేంద్రానికి తరలింపు
- దాతలు రోడ్లపై అన్నదానం చేయరాదు - షెల్టర్ హోంలలో ఉంచిన వారికి భోజనం పెట్టాలని సూచన
- కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రతిఒక్కరూ సహకరించాలి
వలసకూలీలను పలకరించి ఏఏ రాష్ట్రాలకు చెందినవారో వాకబ్ చేశారు. వలస కార్మికుల సంక్షేమానికి 12 కేజీల బియ్యాన్ని, రూ. 500 నగదును మొదటగా ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. లాక్‌డౌన్ ప్రభావాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలో ఉన్న పేదలతో పాటు వలస కార్మికుల సంక్షేమానికి కూడా చర్యలు తీసుకున్నారని తెలిపారు. నగరంలో ఉన్న వలస కార్మికులు, పదలు, నిరుద్యోగులు, అనాథల ఆకలిని తీర్చేందుకు అన్నపూర్ణ పథకం ద్వారా ప్రతిరోజు రెండు లక్షల మందికి భోజనాలను ఉచితంగా పెడుతున్నట్లు తెలిపారు. వలస కార్మికులు రోడ్లపై తిరుగవద్దని సూచించారు.
ప్రభుత్వం నెలకోల్పిన పునరావాస కేంద్రాల్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక దూరాన్ని పాటించాలని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పేదలు, వలస కార్మికుల, యాచకుల ఆకలిని తీర్చేందుకు ముందుకు వస్తున్న స్వచ్ఛంద సంస్థలు, దాతలను అభినందించారు. అయితే రోడ్లపై అన్నదానం చేయడం వలన గుంపులు గుంపులుగా చేరడంతో, వారిలో ఎవరికైనా పాజిటీవ్ ఉంటే, తెలియకుండానే ఇతరులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నదని తెలిపారు. కావునా దాతలు, స్వచ్ఛంద సంస్థలు జిహెచ్‌ఎంసి నెలకోల్పిన షెల్టర్ హోంలలో ఆశ్రయం కల్పించిన వారికి అధికారుల ద్వారా అన్నదానం చేయాలని విజ్ఞప్తి చేశారు.
నగరంలోని హోటళ్లు, లాడ్జీలు, రోడ్ల పక్కన తోపుడు బండ్లు, తినుబండారాలు తయారుచేసి విక్రయించే చిరు వ్యాపారాలు చేసే వ్యక్తుల వద్ద సహాయకులుగా పనిచేసినట్లు వలస కూలీలు వివరించారు. ప్రభుత్వం తమకు బియ్యం, రూ. 500 నగదును ఇచ్చినట్లు తెలిపారు. అయితే లాక్‌డౌన్ వలన ఉపాధి కోల్పోవడంతో పాటు తమ ప్రాంతానికి వెళ్లేందుకు అవకాశంలేనందున అక్కడక్కడ తలదాచుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, శానిటేషన్, హెల్త్ విభాగం అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.