ఒక్క కార్మికుడికి కూడా ఉద్యోగం నుండి తొలగించరాదు: మంత్రి కేటీఆర్
- జిల్లాల కార్మిక, పరిశ్రమల శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రులు కె.టి.ఆర్, మల్లారెడ్డిలు
- కార్మికులు, పేదలకు అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం
- లాక్‌డౌన్ సమయంలో ఏ కార్మికుడు ఇబ్బంది పడరాదు
- వలస కార్మికుల సంక్షేమంపై పని ప్రదేశాలను తనిఖీ చేయాలి
ఈ సందర్భంగా ఒక్క కార్మికుడికి కూడా ఉద్యోగం నుండి తొలగించరాదని స్పష్టం చేశారు. అదే సమయంలో కార్మికులకు జీతాలు చెల్లించాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిపారు. పరిశ్రమలకు కూడా విద్యుత్ బిల్లులు, ఆస్తిపన్ను చెల్లింపులో ప్రభుత్వం అనేక వెసులుబాట్లు కల్పించినట్లు తెలిపారు. ఏ పరిశ్రమకు విద్యుత్ సరఫరా నిలిపివేయరాదని స్పష్టంగా ఆదేశించినట్లు తెలిపారు. శాశ్వత ఉద్యోగులతో పాటు రోజువారి కూలీ పనులతో మనుగడ సాగించుటకై వివిధ రాష్ట్రాలు, చుట్టుప్రక్కల జిల్లాల నుండి వచ్చిన వలస కార్మికుల సంక్షేమాన్ని కూడా చూడాల్సిన బాధ్యత మనపై ఉన్నదని తెలిపారు.
మానవీయ కోణంలో వలస కార్మికులకు కూడా 12 కిలోల బియ్యాన్ని, రూ. 500 నగదును ప్రభుత్వం ఇస్తున్నదని తెలిపారు. పేదలు, వలస కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కె.సి.ఆర్ తీసుకున్న చర్యలను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్దిలో వలస కార్మికులు కూడా భాగస్వాములేనని ప్రభుత్వం ప్రకటించినట్లు తెలిపారు. ఫ్యాక్టరీల వద్ద ఉండిపోయిన కార్మికులకు నిత్యావసరాలు అందించాల్సిన బాధ్యత తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేషన్‌కార్డులేనివారికి కూడా బియ్యం, నగదును మంజూరుచేసే అధికారులను జిల్లా కలెక్టర్లకు కల్పించినట్లు తెలిపారు. పని ప్రదేశాల్లో ఉన్న కార్మికులకు వైద్య సేవలను అందించాలని ఆదేశించారు.
లాక్‌డౌన్ పొడగింపుతో ఎటువంటి పనులు చేయకుండా ఖాళీగా ఉంటున్న కార్మికులలో తమ ప్రాంతాలకు వెళ్లాలనే భావన కలుగుతుందని తెలిపారు. అయితే వలస కార్మికులు రోడ్లపైకి రావడం వలన ఇంత వరకు అమలు చేసిన లాక్‌డౌన్ లక్ష్యం దెబ్బతింటుందని తెలిపారు. ఎక్కడ ఉన్న కార్మికులను అదే ప్రదేశంలో ఉంచాలని ఆదేశించారు. ఈ అంశంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అధికారులను కోరారు. పని ప్రదేశాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఇ.ఎస్.ఐ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో పాటు అందుబాటులో ఉన్న ప్రైవేట్ వైద్యుల సేవలను కూడా తీసుకోవాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయపడేందుకు ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్ నెంబర్లను కార్మికులకు అందజేయాలని సూచించారు. అత్యవసర సేవలను అందించుటకై కొన్ని రకాల పరిశ్రమలను నడుపుటకు ప్రభుత్వం గతంలోనే వెసులుబాటు కల్పించినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు.
ఇటువంటి పరిశ్రమలలో వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. పని ప్రదేశంలో కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు ఇవ్వాల్సిన బాద్యత యాజమన్యాలదేనని స్పష్టం చేశారు. అవసరమైనచోట గ్లౌసులు కూడా ఇవ్వాలని తెలిపారు. సదరు పరిశ్రమలు 30-40 శాతం సామర్థ్యం మేరకే నడవాలని తెలిపారు. కార్మికుల సంక్షేమానికి, సామాజిక దూరం నిబంధనల అమలుకు రెగ్యులర్‌గా ఆయా పరిశ్రమలను తనిఖీ చేయాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్, కమిషనర్ మాణిక్‌రాజ్, కార్మిక శాఖ కమిషనర్ నధీమ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.