కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాల పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది: తెలంగాణ మంత్రి తలసాని
కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాల పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని తెలంగాణ పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుండి జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, కార్పోరేటర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా లాక్ డౌన్ అమలు, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు తదితర అంశాలపై సమీక్ష జరిపారు.
పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు మాట్లాడుతూ తమ తమ ప్రాంతాలలోని వలస కూలీలకు బియ్యం పంపిణీ చేయలేదని మంత్రి దృష్టికి తీసుకురాగా, 2, 3 రోజులలో పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా విన్నవించిన తమ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన మంత్రికి పలువురు కార్పొరేటర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ౩౦ వరకు లాక్ డౌన్ ను పొడగించిందని చెప్పారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమీక్షిస్తూ అవసరమైన తగు ఆదేశాలను జారీ చేస్తున్నారని చెప్పారు. జీహెచ్ఎంసీలో ఉన్న ౩౦ సర్కిల్ లను 17 జోన్ లుగా విభజించడం జరిగిందని, ఒక్కో జోన్ కు వైద్య, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ శాఖలకు చెందిన ఒకొక్క అధికారి బాద్యులుగా ఉంటారని, ఇందుకోసం ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో సౌకర్యాలు కల్పిస్తూ కరోనా వ్యాధి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
విద్యుత్, మంచి నీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. 12 రైతు బజార్ ల ద్వారా ప్రతిరోజు 4 వేల క్వింటాళ్ళ కూరగాయల ను ప్రజలకు అందిస్తున్నట్లు వివరించారు. అన్ని ప్రాంతాలలో సోడియం హై పో క్లోరైడ్ స్ప్రే చేస్తున్నట్లు చెప్పారు. నగరంలో 126 కంటైన్మేంట్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ ప్రాంతాల లోని ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అవసరమైన చర్యలను తీసుకోవడం జరిగిందని చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు క్రేడాయ్ సంస్థ ప్రతినిధులు 41 వేల మంది భవన నిర్మాణ కార్మికులకు లాక్ డౌన్ పూర్తయ్యే వరకు బోజన సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. అన్నపూర్ణ పథకం ద్వారా మధ్యాహ్నం 60 వేల మందికి, సాయంత్రం ౩౦ వేల మందికి ఉచిత భోజనం అందిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు. అంతేకాకుండా దాదాపు 18 వేల మందికి గుజరాత్ సేవా మండలి, ఇతర స్వచ్చంద సంస్థలు వలస కార్మికులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
వాసవి సేవాకేంద్రం, బేగం బజార్ మర్చంట్స్ అసోసియేషన్ తదితరులు వలస కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే, ఎంఎల్సీలు, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి వారి ప్రాంతాలలో లాక్ డౌన్ సమయంలో ఆకలితో అలమటించకుండా అన్నదాన కార్యక్రమాల నిర్వహణ, నిత్యావసర వస్తువుల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. రేషన్ షాప్ లు, మార్కెట్ లు, సూపర్ మార్కెట్ లు తదితర ప్రాంతాలలో సోషల్ డిస్టెన్స్ పాటించాలని అన్నారు. స్వయం నియంత్రణ తోనే కరోనా వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చని, ప్రజలు అందుకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయన సూచించారు. పలువురు కార్పొరేటర్లు తమ సొంత నిధులతో, దాతల సహకారంతో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు, ఆహారం పంపిణీ చేస్తుండటం పట్ల మంత్రి అభినందించారు.
నగరంలో ఉన్న 5.80 తెల్ల రేషన్ కార్డు దారులకు 674 షాపుల ద్వారా బియ్యం పంపిణీ జరుగుతుందని, 1500 రూపాయల నగదు వారి ఖాతాల లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో ఏ ఒక్కరు ఆకలితో అలమటించ వద్దనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు అన్ని స్థాయిలలోని అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు.