తెల్ల రేషన్ కార్డ్ దారులకు బియ్యం పంపిణీ తదితర అంశాలపై మంత్రి తలసాని సమీక్ష
ఉపాధి కోసం వివిధ ప్రాంతాల నుండి వచ్చి లాక్ డౌన్ కారణంగా ghmc పరిధిలో చిక్కుకపోయిన వలస కార్మికులు అందరికి ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న ఒకొక్కరికి 12 కిలోల బియ్యం, 500 రూపాయల నగదు అందేవిదంగా తగు చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో హోం మంత్రి మహమూద్ అలీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మేయర్ బొంతు రాం మోహన్ లతో కలిసి వలస కూలీలకు బియ్యం పంపిణీ, తెల్ల రేషన్ కార్డ్ దారులకు బియ్యం పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్ శ్వేతా మహంతి, ghmc కమిషనర్ లోకేష్ కుమార్ లతో సమీక్షించారు.
ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా ఏ ఒక్కరూ ఆకలితో అలమటించ వద్దనే లక్ష్యంతో తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం, ఒక్కో కార్డుకు 1500 రూపాయల నగదు ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడే ఉండిపోయిన వలస కూలీలను కూడా తమ బిడ్డలుగా భావించి వారికి కూడా ఒకొక్కరికి ఉచితంగా 12 కిలోల బియ్యం, 500 రూపాయల ఆర్ధిక సహాయం ఇవ్వాలని నిర్ణయించి పంపిణీ చేస్తుందని వివరించారు. ghmc పరిధిలో ఇప్పటి వరకు 35 వేల మంది వలస కూలీలకు బియ్యం, ఆర్ధిక సహాయం పంపిణీ జరిగిందని, ఇంకా లక్షా 38 వేల మంది వలస కూలీలకు బియ్యం అందాల్సి ఉందని తమకు అందిన నివేదికలు వెల్లడిస్తున్నాయని, ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళినట్లు చెప్పారు. వారికి కూడా బియ్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ghmc పరిధిలో గుర్తించబడిన కంటైన్మెంట్ ప్రాంతాలలోని ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని ఆదేశించారు. వారికి నిత్యావసర వస్తువులు, మందులు తదితర అవసరాలు తీర్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇవే విషయాలపై మంగళవారం ఉదయం 11.30 గంటలకు హోం మంత్రి మహమూద్ అలీ, మేయర్ బొంతు రాంమోహన్ లతో కలిసి మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయం నుండి ghmc పరిధిలోని mla లు, mlc లు, కర్పోరేటర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.