ఆందోళన వద్దు.. అందరూ క్షేమంగా ఉన్నారు: తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి

Related image

  • వదంతులు నమ్మకండి

  • మూడు జిల్లాల కలెక్టర్లతో ఫోన్ లో పరిస్థితులు సమీక్షించిన మంత్రి జగదీష్ రెడ్డి

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ప్రార్ధనలో ఉమ్మడి నల్గొండ జిల్లాల నుండి పాల్గొన్న వారందరూ క్షేమంగా ఉన్నారని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రార్ధనలో పాల్గొన్న వారందరూ వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణలోనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలోనీ ఓ ప్రార్థనా మందిరంలో జరిగిన ప్రార్ధనలలో ఉమ్మడి నల్గొండ జిల్లాలకు చెందిన వారు పాల్గొన్నారంటూ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం మూడు జిల్లాల కలెక్టర్లతో మంత్రి జగదీష్ రెడ్డి ఫోన్ లో పరిస్థితులను సమీక్షించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ నల్గొండ నుండి 31 మంది బోనగిరి-యాదాద్రి జిల్లా నుండి 12 మంది సూర్యపేట జిల్లా నుండి 11 మంది ఢిల్లీలోని ప్రార్థన మందిరంలో జరిగిన ప్రార్ధనలో పాల్గొన్న మాట నిజమేనని అధికారులు కూడా ధ్రువీకరించారని ఆయన తెలిపారు. అయితే వారందరూ కూడా ప్రభుత్వ అధికారుల దృష్టిలో ఉన్నారని, వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన క్యారంటైన్ లో ఉన్నారని ఆయన చెప్పారు.

ఇందులో అందరూ కూడా క్షేమంగా ఉన్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. దీనిపై వస్తున్న వదంతులు నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు. కరోనా వైరస్ మహమ్మారిని అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆయన మరోమారు పిలుపునిచ్చారు. అందులో బాగంగానే అటు పోలీసులు ఇటు వైద్య ఆరోగ్యశాఖలతో పాటు పారిశుధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన కొనియాడారు. ఇటువంటి పరిస్థితుల్లో వదంతులు విని ఆందోళన చెందితే వారి శ్రమకు అర్థం లేకుండా పోతుందని ఆయన అన్నారు.

More Press Releases