ఏప్రిల్15 వరకు ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలి: తెలంగాణ మంత్రి అల్లోల
తెల్ల రేషన్ కార్డుదారులకు 12 కిలోల బియ్యం, రూ 1500 పంపిణీ
వలస కార్మికులకు భోజన వసతి ఏర్పాటు
ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ సహకారం అందిస్తున్నందుకు రెండు చేతులెత్తి మొక్కుతున్న
కరోనా వైరస్ కట్టడికి నిరంతరం శ్రమిస్తున్న వైద్యశాఖ, పోలీస్ శాఖకు, కార్మికులకు కృతజ్ఞతాభినందనాలు
ఏప్రిల్ 15 నుండి గ్రామాల్లోనే వరి ధాన్యం కొనుగోలు
వరి ధాన్యం కొనుగోలుకు 201 కేంద్రాలు
మొక్కజొన్న కొనుగోలుకు 75 కేంద్రాలు: మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్, మార్చి 30: జిల్లాలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలంతా ఏప్రిల్ 15 వరకు స్వీయ నియంత్రణ పాటించాలని తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఏప్రిల్ 15 వరకు స్వీయ నియంత్రణ పాటించి ఇంటి వద్దనే ఉండాలని ప్రజలకు అభ్యర్థించారు. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచంలోని 198 దేశాలలో ప్రభలిందని ఆ వ్యాధి తీవ్రతను గ్రహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏప్రిల్ 14 వరకు స్వీయ నియంత్రణ కు ఆదేశించడం జరిగిందని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించి ఇంటి వద్దనే ఉండి సహకారం అందించినందుకు గాను రెండు చేతులెత్తి మొక్కుతున్న ట్లు తెలిపారు. ప్రజల సహకారంతోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏ ఒక్క జిల్లాలో కూడా కరోనా వైరస్ నిర్ధారణ కాలేదన్నారు. ఇదే విధంగా ఏప్రిల్ 15 వరకు తమ సహకారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా మూడు నుంచి నాలుగు అడుగుల వరకు సామాజిక దూరం పాటించాలన్నారు.1055 మంది విదేశాల నుండి జిల్లాకు వచ్చారని అందులో 240 మంది 14 రోజుల హోమ్ కోరంటైం పూర్తయిందని మిగతా 815 మందిని వారి వారి ఇళ్లలో హోమ్ quarantine, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా కోరంటైన్ కేంద్రంలో ఉంచడం జరిగిందని అన్నారు. quarantine లో 71 బెడ్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
జిల్లాలో 70 ఐసోలేటెడ్ బెడ్స్, 15 ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య శాఖ, పోలీస్ శాఖ క్రింది స్థాయి ఉద్యోగి నుండి పై స్థాయి అధికారి వరకు, కార్మికులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. గ్రామ సర్పంచ్ నుంచి వీడీసీ సభ్యుల వరకు ప్రతి గ్రామంలో సహకారం, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీపీల సహకారం అందిస్తున్నందునే కరోనా వైరస్ ను నియంత్రించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ పిలుపుమేరకు ప్రజలంతా ఏప్రిల్ 15 వరకు కరోనా వైరస్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోగ నిరోధక శక్తి పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ పండ్లను ఎక్కువగా తినాలి అన్నారు. 60 సంవత్సరాలు పైబడిన వారు ఎవరు కూడా బయటకు రావొద్దు అన్నారు.
తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ.1500 రూపాయలు ప్రభుత్వ అనుమతి రాగానే పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాలు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర నుండి వచ్చిన వలస కూలీలకు భోజన వసతి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఏప్రిల్ 15 నుండి గ్రామాలలోనే వరి ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రైతులు ఇందుకోసం సమాయత్తం కావాలి అన్నారు. జిల్లాలో ఒక లక్ష 797 ఎకరాల్లో వరి ధాన్యం పని చేయడం జరిగిందన్నారు. రెండు లక్షల 41 వేల812 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో నాలుగు బాయిల్డ్ మిల్లులు 28 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలవి ఉన్నాయని మిగితా 213812 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇతర జిల్లాలకు రవాణా చేయడం జరుగుతుందన్నారు.
201 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వరి మద్దతు ధర క్వింటాల్ కు గ్రేడ్ ఎ రకం 1835/- రూపాయలని గ్రేడ్ బి రకానికి రూ1815/- రూపాయలని అన్నారు. జిల్లాలో 62 లక్షలు గోనె సంచులు అవసరం కాగా ప్రస్తుతం ఈ రెండు లక్షలు నిల్వ ఉన్నాయని మిగితా వాటిని తెప్పించడం జరుగుతుందన్నారు. ఆరువేల టార్పాలిన్ కావలసి ఉండగా ప్రస్తుతం జిల్లాలో 2500 ఉన్నాయని మిగతా వాటికి టెండర్లు పిలవడం జరిగింది అన్నారు. జిల్లాలో మొక్కజొన్న 80115 ఎకరాల్లో పండించడం జరిగిందని 240345 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న వస్తుందని అంచనా వేయడం జరిగింది. మొక్కజొన్న కొనుగోలు కోసం 75 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
మొక్కజొన్న కనీస మద్దతు ధర క్వింటాల్ కు1760/- లని తెలిపారు. జిల్లాలోని వరి ధాన్యం, మొక్కజొన్న పండించిన రైతులకు దాదాపు 800 కోట్లు రూపాయలు రానున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రైతులకు రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు నీరు అందించడం వల్లే రైతులు అత్యధికంగా పండించారని అన్నారు. నిర్మల్ జిల్లాలో వ్యవసాయ పరంగా ఉత్పాదకత పెరిగిందని అన్నారు. కరోనా వైరస్ బాధితుల సహాయార్థం ఏ సి డి పి నిధుల నుండి మూడు కోట్ల రూపాయలను, ఒక నెల వేతనం ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. జిల్లాలోని జడ్పీటీసీలు మొత్తం తమ నెల వేతనం రెండు లక్షలు రుాపాయలు అందించనున్నట్టు తెలిపారు.
జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ 45 లాక్ డౌన్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేసినందున జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణ పరిస్థితి కంట్రోల్ లో ఉందని తెలిపారు. జిల్లాలో విదేశాలనుండి వచ్చిన 1055 మందిని గుర్తించి వారిని హోమ్ quarantine లో ఉంచి వారి ఆరోగ్యం, చుట్టుపక్కల వారి ఆరోగ్యం కోసం ప్రతిరోజు వైద్యులను పంపించి పరిశీలించడం జరిగిందన్నారు. జిల్లాలో ఏప్రిల్ 6 వరకు విదేశాల నుండి వచ్చిన వారి 14 రోజుల గడువు పూర్తి అవుతుందన్నారు. ఏప్రిల్ 15 వరకు జిఓ ఎంఎస్ నెంబర్ 45 లాక్ డౌన్ పగడ్బందీగా అమలు చేయడం జరుగుతుందన్నారు. ఉపాధి హామీ పనులను ఐదుగురుతో మూడు అడుగుల సామాజిక దూరం పాటించి ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.
జిల్లాలో 2.5 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని 7000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఇవ్వాల్సి ఉందని, ప్రస్తుతం జిల్లాలో ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల బియ్యం స్టాక్ ఉందన్నారు. కరోనా వైరస్ బాధితుల సహాయార్థం జిల్లాలో ఇప్పటివరకు 12 లక్షల 65 వేల రూపాయలు జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ నిధికి దాతలు అందించారన్నారు.
జిల్లా ఎస్పీ శశిధర్ రాజు మాట్లాడుతూ.. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం ఆదేశించినా నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో దుకాణాలు తెరిచి ఉంచిన 18 దుకాణదారులు పై కేసులు నమోదు, 80 వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కె విజయలక్ష్మి, జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ గండ్ర ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, ఎఫ్ ఎస్ సి ఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ నల్ల వెంకట్రాంరెడ్డి, అదనపు ఎస్పి శ్రీనివాస రావు, డాక్టర్ కార్తీక్, జెడ్పీటీసీలు ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.