ఈనెల 31 వరకు లాక్ డౌన్ మరింత కఠినతరంగా అమలు: తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్

Related image

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకుగాను ఎపిడమిక్ యాక్టు 1897 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకై చేపట్టిన చర్యలను డీజీపీ మహేందర్ రెడ్డితో కలసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో వివరించారు. కేవలం అత్యవసర సర్వీసులు మినహా పూర్తి స్థాయిలో ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ ను అమలు చేయనున్నట్టు తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచే వారిపై, బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. గ్రామాల్లో వ్యవసాయ, కూరగాయల సాగు పనులు చేపట్టుకోవచ్చని తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పధకం క్రింద సమూహాలుగా కాకుండా పరిమిత సంఖ్యలో పనులు చేపట్టవచ్చని అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన లాక్ డౌన్ లో భాగంగా అంతర్ రాష్ట్ర సరిహద్దులన్నీ మూసివేస్తున్నామని తెలియ చేశారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు, ప్రయివేట్ వాహనాలు, ఆటోలు, క్యాబ్ అన్నింటినీ బంద్ చేయించామని అన్నారు. ఎక్కడ కూడా 5 మంది కంటే గుమిగూడాకూడదని స్పష్టం చేశారు. జీవో 45 లో ఉన్న ప్రతి అంశాన్ని కచ్చితంగా అమలు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో అన్నిరకాల పరీక్షలు వాయిదా వేస్తున్నామని అన్నారు. రోడ్ మీద ఎక్కడ ఎలాంటి వాహనాలు నడవడానికి వీలు లేదని, ముఖ్యంగా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవ్వరు బయట తిరిగినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు బయట తిరిగితే కఠిన చర్యలు ఉంటాయని, ఎవరైనా బయట తిరిగితే పాస్ పోర్ట్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, కరొనా వైరస్ తీవ్రంగా ఉన్నందున్న ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. ప్రజా శ్రేయస్సు, ఆరోగ్యం కోసం ఇవాళ్టి నుంచి 31 మార్చ్ వరకు తెలంగాణ లాక్ డౌన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జివో 45 ను పటిష్టంగా అమలు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల వాహనాలను నిషేదిస్తున్నామని, ఎమర్జెన్సీ సర్వీసులు, అత్యవసర శాఖల వాహనాలు, మీడియా వాహనాలకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రైవేట్ వెహికిల్స్ ఎమర్జెన్సీ పనులకు మాత్రమే ఉపయోగించాలని, తమ ఇళ్లకు సమీపంలో ఉన్న దుకాణాల నుండి మాత్రమే నిత్యావసర వస్తువులు తేవడానికి మాత్రమే వ్యక్తిగత వాహనాలను ఉపయోగించాలని తెలిపారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఈనెల 31వ తేదీ వరకు క్రమశిక్షణతో ఉండాలని, సమస్యను అరికట్టాలంటే ప్రజలేవరూ రోడ్ల పైకి రావద్దని డీజీపీ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సమాజం కోసం పోలీసులు లాక్ డౌన్ ను స్ట్రిక్ గా ఆంక్షలు అమలు చేస్తున్నారని, ఇందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలన్నారు.

వాహనాలు, ప్రజల రాకపోకలను నివారించేందుకై  ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని మహేందర్ రెడ్డి చెప్పారు. ప్రతి వాహనాన్ని పోలీసులు పరిశీలిస్తారని, సరైన కారణం లేకుండా ఎక్కువ సార్లు పోలీసుల దృష్టిలో పడితే వెహికిల్ సీజ్ చేస్తారని, సీజ్ చేసిన వాహనాలు వైరస్ తీవ్రత తగ్గిన తరువాత రిలీజ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. చట్టం చాలా కఠినంగా అమలు చేయాలని రేంజ్ ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలను ఆదేశించామని డీజీపీ అన్నారు. నిబంధనల అతిక్రమణలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుందని అన్నారు.

లాక్ డౌన్ అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టూలు ఏర్పాటు చేశామని, నేడు  మధ్యాహ్నం నుంచి కఠినంగా అమలు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. ఈ విలేఖరుల సమావేశంలో అడిషనల్ డీజీపీ జితేందర్ కూడా పాల్గొన్నారు.

Somesh Kumar
COVID-19
Corona Virus
Telangana
DGP
TS DGP
Hyderabad

More Press Releases