ప‌క‌డ్బందీగా "కుడా" మాస్ట‌ర్ ప్లాన్: మంత్రి ఎర్ర‌బెల్లి

Related image

  • 15 న‌గ‌రాల్లో అధ్య‌య‌నం చేసి రూప‌క‌ల్ప‌న‌

  • భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌క‌నుగుణంగా ప్ర‌ణాళిక‌లు

  • ఇన్న‌ర్, అవుట‌ర్ రింగ్ రోడ్ల‌తో స‌ర్వాంగ సుంద‌రంగా కాక‌తీయ న‌గ‌రం

  • త్వ‌రిత గ‌తిన సీఎం హామీల ప‌నుల పూర్తి

  • మామునూరు ఎయిర్ పోర్టు పున‌రుద్ధ‌ర‌ణ‌

  • "కుడా" మాస్ట‌ర్ ప్లాన్, సిఎం హామీల అమ‌లు, మామునూరు ఎయిర్ పోర్టు పున‌రుద్ధ‌ర‌ణల‌పై ఉన్న‌త స్థాయి స‌మీక్ష స‌మావేశం చర్చ‌

  • "మాస్ట‌ర్ ప్లాన్ మాస్ట‌ర్ పీస్"  లా ఉండాల‌ని అధికారుల‌కు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రాశాఖా మాత్యులు ఎర్ర‌బెల్లి  ద‌యాక‌ర్ రావు దిశానిర్దేశం

  • మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్, న‌గ‌ర పాల‌క, ఐటీ శాఖ‌ల మంత్రి కెటిఆర్ తో మ‌రో స‌మావేశం

అత్యంత ప‌క‌డ్బందీగా "కుడా" మాస్ట‌ర్ ప్లాన్ ని సిద్ధం చేయాల‌ని, మ‌రిన్ని మెరుగులు దిద్ది, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు స‌రిప‌డా ప్ర‌ణాళిక‌లు  రూపొందించాల‌ని, చారిత్రాత్మ‌క కాక‌తీయ వాస‌ర‌త్వ న‌గ‌రం వ‌రంగ‌ల్ ని స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దాల‌ని జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రాశాఖా మాత్యులు ఎర్ర‌బెల్లి  ద‌యాక‌ర్ రావు గారి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మీక్ష స‌మావేశం  నిర్ణ‌యించింది. అలాగే త‌ర్వ‌త‌గతిన సీఎం హామీల ప‌నులు  పూర్తి  చేయాల‌ని, మామునూరు ఎయిర్ పోర్టును  పున‌రుద్ధ‌రించాల‌ని  స‌మావేశం చర్చించింది. కాగా, "కుడా" మాస్ట‌ర్ ప్లాన్ మాస్ట‌ర్ పీస్ లా ఉండాల‌ని, సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ లు అభినందించేలా రూపొందించాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి  ద‌యాక‌ర్ రావు అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు.

ఈ స‌మీక్ష స‌మావేశంలో స్త్రీ, శిశు సంక్షేమ‌, గిరిజ‌న సంక్షేమ‌శాఖ మాత్యులు శ్రీ‌మ‌తి స‌త్య‌వ‌తి  రాథోడ్ గారు, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్, వ‌రంగ‌ల్ మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ రావు, వ‌రంగ‌ల్ ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్, మాజీ ఉప ముఖ్య‌మంత్రి, శాస‌న మండ‌లి స‌భ్యులు క‌డియం శ్రీ‌హ‌రి, శాస‌న మండ‌లి స‌భ్యులు పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం, స్టేష‌న్ ఘ‌న్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య‌, వ‌ర్ద‌న్న‌పేట ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్, ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్, కుడా చైర్మ‌న్ మ‌ర్రి యాద‌వ‌రెడ్డి, వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా క‌లెక్ట‌ర్ హ‌న్మంత్ గాంధీ, వ‌రంగ‌ల్ న‌గ‌ర క‌మిష‌న‌ర్ ప‌మేలా స‌త్ప‌తి, కుడా, వ‌రంగ‌ల్ న‌గ‌ర మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రాశాఖా మాత్యులు ఎర్ర‌బెల్లి  ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, కుడా మాస్ట‌ర్ ప్లాన్ పై అంశాల వారీగా అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. ఢిల్లీ, ముంబ‌యి, కోల్ క‌టా, చెన్నై, భువ‌నేశ్వ‌ర్, అహ్మ‌దాబాద్, బెంగ‌ళూరు, జైపూర్, భోపాల్, తిరువ‌నంత‌పురం, గౌహ‌తీ వంటి 15 న‌గ‌రాల‌ను  ప‌రిశీలించి రూపొందించిన కుడా మాస్ట‌ర్ ప్లాన్ ప్ర‌ణాళిక‌కు మ‌రిన్ని మెరుగులు దిద్దాల‌న్నారు. ఇన్న‌ర్ రింగ్ రోడ్డు, అవుట‌ర్ రింగ్ రోడ్డుల క‌నెక్టివిటీని, జాతీర ర‌హ‌దారుల‌కు స‌రిగ్గా అనుసంధానం చేయాల‌న్నారు. కుడా  ప‌రిధిలోని ప్ర‌స్తుతం ఉన్న చెరువులు, కుంట‌లు, దురాక్ర‌మ‌ణ‌కు గురైన‌వి...వాటి మ‌నుగ‌డ‌, పున‌రుద్ధ‌ర‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ప‌లు సూచ‌న‌లు చేశారు.

అలాగే ఏయే కారిడార్ల‌లో ఏయే కారిడార్ల‌లో ఏయే ప‌రిశ్ర‌మ‌లు ఉన్నాయి? ఇంకా ఏయే పరిశ్ర‌మ‌లు పెట్ట‌డానికి వీలుంటుంద‌నే విష‌యాలు స్ప‌ష్టం చేయాల‌న్నారు. వర్ష‌పునీటి నిర్వ‌హ‌ణ‌, మురుగునీటి కాలువ‌ల ప‌రిస్థితి ఏంట‌ని అధికారుల‌ను ప్ర‌శ్నించారు. వీలైన‌న్ని ఎక్కువ హ‌రిత  హారం, గ్రీన్ జోన్స్ ఏర్పాటు  చేయాల‌ని, అర్బ‌న్ లంగ్ స్పేస్ ల‌ను పెంచాల‌ని సూచించారు. పురావ‌స్తు భ‌వ‌నాలు, దేవాల‌యాలను ప‌రిర‌క్షిస్తూనే, వాటిని ప‌ర్యావర‌ణ స‌హితంగా, ప‌ర్యాట‌కానికి వీలుగా తీర్చిదిద్దాల‌ని సూచించారు. వార‌స‌త్వ క‌ట్ట‌డాల ప‌రిర‌క్ష‌ణ‌కు న‌డుం బిగించాల‌న్నారు. గ‌తంలో మంత్రి కెటిఆర్ సూచించిన విధంగా చేసిన మార్పుల‌పై కూడా అధికారుల‌ను ప్ర‌శ్నించారు.

అలాగే, నాటి నిజాం న‌వాబు 1930లోనే ఏర్పాటు చేసిన మామునూరు ఎయిర్ పోర్టు ఉమ్మ‌డి రాష్ట్ర పాల‌న‌లో పూర్తిగా ప‌నిచేయ‌కుండా పోయింద‌న్నారు. మామునూరు ఎయిపోర్టును పున‌రుద్ధ‌రించ‌డానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై కూడా స‌మావేశంలో చ‌ర్చించారు.

ఇక సీఎం కెసిఆర్ 2016లో వరంగ‌ల్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఇచ్చిన హామీల ప‌నుల‌పై కూడా చ‌ర్చ జ‌రిగింది. రూ.817.20 కోట్ల విలువైన 1342 ప‌నులు మంజూర‌య్యాయ‌ని అధికారులు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల‌కు వివ‌రించారు. అయితే, ఆయా ప‌నులు వివిధ ద‌శ‌ల్లో ఉన్నాయ‌ని అధికారులు చెప్ప‌గా, ఆయా ప‌నులు, వాటి  ద‌శ‌ల‌ను నియోజ‌క‌వ‌ర్గాల వారీగా చ‌ర్చించారు.  ఆయా ప‌నుల‌ను  అత్యంత వేగంగా, నాణ్య‌త‌గా పూర్తి  చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇవే అంశాల‌పై రేపు, బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఐటీ, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల మంత్రి గౌర‌వ కె.టి. రామారావుతో స‌మావేశ‌మై స‌మీక్షించాల‌ని నిర్ణ‌యించారు.

More Press Releases