అన్నపూర్ణ భోజన పథకాన్ని ఇతర రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకున్నాయి: తెలంగాణ మంత్రి తలసాని
రూ.5 లకే అన్నపూర్ణ భోజన పథకం ఆరు సంవత్సరాల వేడుకల్లో పాల్గొన్న మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్, సి.ఎస్. సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్
వృద్దులు, దివ్యాంగుల సౌకర్యార్థం పైలెట్ ప్రాజెక్ట్ గా ప్రవేశపెట్టిన మొబైల్ అన్నపూర్ణ పథకం ప్రారంభం
నగరంలో ఏ వ్యక్తి ఆకలితో ఇబ్బంది పడరాదనేదే ప్రభుత్వ సంకల్పం: సిఎస్ సోమేశ్ కుమార్
నగరంలో ప్రతిరోజు 35వేల మంది పేదల ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణ భోజన పథకం: మేయర్ బొంతు రామ్మోహన్
రూ. 5 లకే నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్న అన్నపూర్ణ పథకం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థక, ఫిషరిస్, డైరీ డెవలప్‌మెంట్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ప్రస్తుత చీఫ్ సెక్రటరి సోమేశ్ కుమార్ గతంలో జి.హెచ్.ఎం.సి కమిషనర్‌గా వ్యవహరించిన కాలంలో అన్నపూర్ణ భోజన పథకానికి శ్రీకారం చుట్టి, 2014 మార్చి 1న నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ప్రారంభించారు.
అప్పుడు 8 కేంద్రాలతో రోజుకు 2,500 మందికి రూ. 5/- లకే భోజనాన్ని అందించిన అన్నపూర్ణ పథకం దశలవారిగా నగరంలో 150 కేంద్రాలకు పెరిగి, ప్రతిరోజు 30,000 నుండి 35,000 మంది ఆకలిని తీరుస్తున్నది. అన్నపూర్ణ భోజన పథకాన్ని ప్రవేశపెట్టి ఆరు సంవత్సరాలు అయిన సందర్భంగా సోమవారం అమీర్‌పేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. అమీర్‌పేట కేంద్రంలో అత్యధికంగా ప్రతిరోజు 1200 మంది ఆకలిని తీరుస్తున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులు, కార్మికులు ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నట్లు తెలిపారు. అన్నపూర్ణ పథకాన్ని రూపొందించిన సోమేశ్ కుమార్‌ను, నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్న హరే కృష్ణ ఫౌండేషన్ లను అభినందించారు.
పురపాలక శాఖ మంత్రి కె.టి.ఆర్ ఆదేశాలతో జి.హెచ్.ఎం.సి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ఆధునిక పద్దతిలో మోడల్ మార్కెట్లు, ఫుట్‌పాత్‌లు, వీధిలైట్లు, వైట్‌టాపింగ్ రోడ్లు, వైకుంఠదామాలు అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరం దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్నదని తెలిపారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
చీఫ్ సెక్రటరి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఆకలితో ఏ వ్యక్తి ఇబ్బంది పడరాదని ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ఆదేశాల మేరకు అప్పటి వరకు 55 చోట్ల నిర్వహిస్తున్న అన్నపూర్ణ కేంద్రాల సంఖ్యను 150 కేంద్రాలకు పెంచినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ఆకాంక్ష, పురపాలక శాఖ మంత్రి కె.టి.ఆర్ ఆదేశాలు, జి.హెచ్.ఎం.సి కృషితో అన్నపూర్ణ పథకం ద్వారా 4కోట్ల భోజనాల మైలురాయిని చేరుకున్నట్లు తెలిపారు. ఆకలి సమస్య ఏర్పడరాదనే ఉధ్దేశంతో అన్ని ప్రాంతాలలో అన్నపూర్ణ కేంద్రాలను నెలకోల్పినట్లు తెలిపారు.
దేశంలో ఆర్థికాభివృద్ది పడిపోయినప్పటికీ మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె.సి.ఆర్ చేపట్టిన చర్యలతో అభివృద్ది బాగున్నదని తెలిపారు. అన్నం పెట్టడం పుణ్య కార్యక్రమమని తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్దిలో అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం ఉన్నదని తెలిపారు. అందుకని పేదల ఆకలిని తీర్చుటకు అన్నపూర్ణ పథకాన్ని రూపొందించినట్లు వివరించారు. నిర్భాగ్యుడైన భిక్షగాడు కూడా యాచన ద్వారా పొందిన రూ. 10/- లతో ఒక రూ. 5/- లతో తన ఆకలిని తీర్చుకొని, మిగిలిన రూ. 5/- తో మరొక వ్యక్తి ఆకలిని తీర్చిన సంఘటనలు తన దృష్టికి వచ్చినట్లు వివరించారు.
మానవతకు హద్దులేదని అన్నపూర్ణ పథకం నిరూపించినట్లు పేర్కొన్నారు. 2000 సం.లో అనంతపురం జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న కాలంలో పుట్టపర్తి సాయిబాబాతో ఏర్పడిన సాన్నిహిత్యం ఏర్పడినట్లు తెలిపారు. అప్పటి నుండి నిరుపేదల ఆకలిని తీర్చుట గురించి దేవాలయాలలో అన్నదానానికి చేయూతగా నిలుస్తున్నట్లు తెలిపారు. జి.హెచ్.ఎం.సి కమిషనర్ గా పనిచేస్తున్నప్పుడు హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్ వారు ఉస్మానియా ఆసుపత్రిలో పేషంట్ ల సహాయకులకు ఉచితంగా భోజనం అందించే కార్యక్రమానికి తనను ఆహ్వానించినట్లు తెలిపారు. ఆ రకంగా పేదల ఆకలిని తీర్చేందుకై అన్నపూర్ణ పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు.
నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ రూ. 5/- లకే అన్నపూర్ణ భోజన పథకం ప్రభుత్వానికి తృప్తిని ఇచ్చిన పథకమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ఆదేశాలతో కంటోన్మెంట్ కు కూడా దీనిని విస్తరించినట్లు తెలిపారు. ఈ పథకాన్ని చాలా రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకొని ఆయా రాష్ట్రాలలో ప్రవేశపెట్టినప్పటికీ సక్రమంగా అమలు కావడంలేదని తెలిపారు. అయితే మనవద్ద హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ వారు చూపుతున్న శ్రద్ద వలన పేదలకు నాణ్యమైన భోజనంతో పాటు అందరికీ గుర్తింపు లభిస్తున్నదని అభినందించారు.
రోజుకు దాదాపు 30 - 35వేల మందికి అన్నపూర్ణ భోజనాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. నగరానికి వచ్చే ప్రయాణికులు, పేషెంట్ల సహాయకులు, ఉద్యోగార్థులు, పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులు, చిరుద్యోగులు, నిరుపేదలు అన్నపూర్ణ పథకంతో లబ్దిపొందుతున్నట్లు తెలిపారు. విదేశీయులు కూడా ఈ పథకాన్ని మెచ్చుకున్నట్లు తెలిపారు. దేశంలో అద్బుతమైన పథకంగా ఉన్న అన్నపూర్ణ పథకాన్ని దివ్యాంగులు, వృద్దులకు చేరువ చేసేందుకు మొబైల్ అన్నపూర్ణ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.
హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సత్యగౌరచంద్రదాస మాట్లాడుతూ అన్నపూర్ణ పథకం రాష్ట్రంలోనే 16 మున్సిపాలిటీలు, నగరాలలో 176 కేంద్రాలకు విస్తరించి ప్రతిరోజు 45వేల మంది ఆకలిని తీరుస్తున్నట్లు తెలిపారు. పేదల ఆకలిని తీరుస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.ఆర్ 2017 మార్చి 16న అన్నపూర్ణ పథకంగా పేరు పెట్టినట్లు తెలిపారు. అమీర్‌పేట కేంద్రం ద్వారా పోటీ పరీక్షల విద్యార్థుల ఎక్కువగా లబ్దిపొందుతన్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మొబైల్ అన్నపూర్ణ భోజన పథకాన్ని చీఫ్ సెక్రటరి సోమేశ్ కుమార్ ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్ ఎన్.శేషుకుమారి, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్, జి.హెచ్.ఎం.సి కమిషనర్ డి.ఎస్.లోకేష్‌కుమార్, అదనపు కమిషనర్ బి.సంతోష్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రావిణ్య తదితరులు పాల్గొన్నారు.