ఉన్న ఇళ్లు నిరుపయోగం చేసి... కొత్త ఇళ్లు అంటూ మభ్య పెడుతున్నారు: పవన్ కల్యాణ్
• ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ కొత్త ఇళ్లు అంటూ ప్రజాధనం దుర్వినియోగం
• ప్రజాధనం దుర్వినియోగంపై న్యాయపరమైన పోరాటం
• లబ్దిదారులకు ఇళ్లు ఇవ్వరు.. డబ్బు వెనక్కి అడిగితే మా ప్రభుత్వానికి ఇవ్వలేదంటారు
• ప్రభుత్వ ధోరణి బాధ కలిగిస్తోంది
• సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాం
• బాధితులకు న్యాయం జరగకుంటే ప్రత్యక్ష కార్యాచరణ
• కర్నూలులో జీ+3 ఇళ్ల పరిశీలన అనంతరం పవన్ కల్యాణ్
నిర్మించి ఉన్న ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వకుండా నిరుపయోగం చేసి, వైసీపీ ప్రభుత్వం కొత్త ఇళ్లు ఇస్తుందని ఆశపెడుతోందని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లను గాలికి వదిలేసి కొత్త ఇళ్లు అంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తప్పుబట్టారు. ఇళ్ల పేరిట ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న అంశంపై జనసేన పార్టీ తరఫున న్యాయపరమైన పోరాటం చేపడతామని తెలిపారు. ఈ అంశంపై పార్టీ లీగల్ విభాగంతో చర్చిస్తామన్నారు. కర్నూలు నగర శివార్లలోని తాండ్రపాడు ప్రాంతం, లక్ష్మీపురం వద్ద ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం కింద నిర్మించిన జీ+3 గృహ సముదాయాలను పరిశీలించారు. లబ్దిదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లలోనికి వెళ్లి వాటిని పరిశీలించారు.
అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. "ప్రజాధనాన్ని దోచుకునే తరహాలో ఆలోచించడం మానాలి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇళ్లు ఇస్తామని ఎరచూపి ఓట్లు వేయించుకుంటున్నారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ కొత్తగా గృహ నిర్మాణ పథకాలు ప్రవేశపెట్టడం ఆఖరులో అవి నిలిచిపోవడం జరుగుతోంది. ప్రభుత్వ ఇళ్ల కోసం ఎదురుచూసే పేద ప్రజలకు అన్యాయం జరుగుతోంది.
లబ్దిదారులు మొత్తం పనులు చేసుకునే వారు, రోజు కూలీలే. రూపాయి, రూపాయి పోగేసి డబ్బు కట్టిన లబ్దిదారులకు న్యాయం జరగడం లేదు. ఇళ్లు ఎప్పుడు ఇస్తారు అని అడిగితే అధికారుల నుంచి సమాధానం లేదు. డబ్బు వెనక్కి ఇవ్వమంటే మీరు ఇచ్చింది ఆ ప్రభుత్వానికి అంటున్నారు. అధికారులు కూడా ఇలాంటి ధోరణిలో మాట్లాడడం బాధాకరం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించిన గృహాలు లబ్దిదారులకు అందడం లేదు. కేంద్ర ప్రభుత్వ అనుసంధానంతో వచ్చే ఏ పథకం ఆగిపోయినా ప్రశ్నిస్తాం. ఇక్కడ జరుగుతున్న అవినీతిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాం.
ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో సమావేశం అయినప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రానికి వర్తించే పథకాల మీద జరిగిన చర్చలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అంశం కూడా చర్చకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం 2 లక్షల ఇళ్లు కేటాయించింది. కర్నూలులో 10 వేల ఇళ్లు కట్టారు. ఇప్పటి వరకు లబ్దిదారులకు అందచేయలేదు. గుంటూరు, విజయవాడతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా కట్టిన ఇళ్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. పోరాటయాత్రలో భాగంగా జగన్నాథగట్టు ప్రాంతాన్ని సందర్శించినప్పుడు నిధులు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో తెలుసుకున్నా. పైకప్పులు కూడా లేని పరిస్థితుల్లో ఉన్న ఆ ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తా. ప్రభుత్వాలు స్పందించని పక్షంలో లబ్దిదారులకు న్యాయం జరగనప్పుడు బాధితుల తరఫున ప్రత్యక్ష కార్యచరణకు దిగుతాం. సుగాలి ప్రీతి అంశంలో కూడా ప్రభుత్వ స్పందన కోసం వేచి చూశాం. నిర్ణీత సమయంలో స్పందించకపోవడం వల్లే నిరసనకు దిగాం" అని చెప్పారు.
అంతకు ముందు జీ+3 గృహాల కోసం డబ్బు కట్టిన లబ్దిదారులు పవన్ తో మాట్లాడుతూ తాము బంగారం తాకట్టు పెట్టి... రూపాయి, రూపాయి పోగు చేసి ఇళ్ల కోసం డబ్బు కట్టామని, తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.